
సాక్షి, హైదరాబాద్: నగరంలో నాలాల విస్తరణ పనుల్లో భాగంగా జీహెచ్‌ఎంసీ అధికారులు పలు ప్రాంతాల్లోని అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో నాలాలపై అక్రమంగా వెలిచిన కట్టడాలను శనివారం అధికారులు కూల్చివేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు జరిగే అవకాశం ఉండటంతో.. పెద్ద ఎత్తున పోలీసుల బందోబస్తు నడుమ ఈ కూల్చివేతలు చేపడుతున్నారు. బాధితులకు నష్టపరిహారం చెల్లించిన అనంతరమే కూల్చివేస్తున్నామని అధికారులు తెలిపారు. ఉప్పుగూడ నుంచి డబీర్‌పురా మీదుగా చాదర్‌ఘాట్ వరకు ఓపెన్ నాలాపై అక్రమ కట్టడాల కూల్చివేత కొనసాగుతోంది.
ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత
మరోవైపు శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని గచ్చిబౌలిలో నాలాల అక్రమణ తొలగింపులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడం అన్యాయమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కూల్చివేతలను అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారి బాధితులకు నచ్చజెప్పి కూల్చివేతలను కొనసాగించారు. నష్టపరిహారం ఇప్పించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో బాధితులు శాంతించారు.
Comments
Please login to add a commentAdd a comment