
హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 72 ప్రశాసన్‌నగర్‌లో ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ (ప్లాట్ నం.149) జీహెచ్‌ఎంసీ పార్కును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను మంగళవారం జీహెచ్‌ఎంసీ సర్కిల్–18 టౌన్‌ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. ప్లాట్ నం–149ను ఆనుకుని ఉన్న పార్కును సదరు ఐపీఎస్ అధికారి రెండు వైపులా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. అంతే కాకుండా పార్కులోని ఇనుప దిమ్మెలతో అనధికారిక స్ట్రక్చర్ కూడా నిర్మించారు. పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించకపోగా నిబంధనలకు విరుద్ధంగా మరో రెండు అంతస్తులు నిర్మించారు.
జీ ప్లస్–1 నిర్మాణానికి అనుమతి తీసుకున్న ఠాకూర్ ఇటీవల ఇంటి చుట్టూ సెట్‌బ్యాక్‌ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. అక్రమంగా ఓ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని కూడా దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో నిర్మించారు. పార్కు స్థలంలో కబ్జాలను కూల్చివేసిన అధికారులు.. అక్రమంగా నిర్మించిన అంతస్తులను కూడా తొలగించాలంటూ మంగళవారం తుది నోటీసులు జారీ చేశారు. 2017, జూన్ 4న ప్రశాసన్‌నగర్ హౌసింగ్ కో ఆపరేటివ్ సొసైటీ ఠాగూర్ అక్రమ నిర్మాణంపై ఫిర్యాదు చేసిందని, దీంతో అదే సంవత్సరం జూన్ 5న ఒకసారి, జూన్ 17న రెండోసారి నోటీసులు జారీ చేశామని అధికారులు చెప్పారు. స్పందన రాకపోవడంతో మంగళవారం మూడో నోటీసు జారీచేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment