సెల్లార్‌ ఫిల్లింగ్‌ | GHMC Sellar Filling Starts in Hyderabad | Sakshi
Sakshi News home page

సెల్లార్‌ ఫిల్లింగ్‌

Published Wed, Jun 26 2019 8:26 AM | Last Updated on Wed, Jul 3 2019 11:23 AM

GHMC Sellar Filling Starts in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వర్షాలు మొదలయ్యాయి. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో రోడ్లు చెరువులుగా మారుతున్నాయి. బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం కోసం సెల్లార్లు తవ్వి పనులు అర్ధాంతరంగా నిలిపివేయడంతో అవి వర్షపు నీటితో నిండిపోతున్నాయి. ఫలితంగా పరిసరాల భవనాలకు ముప్పు పొంచి ఉంది. దీనిపై నగరవాసులు సోషల్‌ మీడియాలో ముఖ్యమంత్రి కార్యాలయం, జీహెచ్‌ఎంసీ కమిషనర్, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తదితరులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకముందే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ నిర్మాణ, కూల్చివేతల (సీఅండ్‌డీ) వ్యర్థాలతో సదరు సెల్లార్లను పూడ్చాలని నిర్ణయించింది. సెల్లార్లు తవ్వి నిర్మాణ పనులను మధ్యలో నిలిపేసిన అన్నింటినీ సీఅండ్‌డీ వ్యర్థాలతో పూడ్చివేయనుంది.  వర్షాకాల ప్రమాద నివారణ చర్యల్లో భాగంగా ఇలాంటి వాటిని గుర్తించి పూడ్చివేయనున్నట్లు టౌన్‌ప్లానింగ్‌ అధికారులు తెలిపారు. ఎక్కడైనా ఇలాంటివి ఉంటే ప్రజలు సమాచారం అందించాలని కోరారు. 

అనుమతి పొందినా...
సెల్లార్ల తవ్వకాల కోసం జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతి పొందినప్పటికీ, ఇంకా పనులు చేపట్టనివారు సెప్టెంబర్‌ 30 వరకు తవ్వకాలు ప్రారంభించరాదని సిటీ చీఫ్‌ ప్లానర్‌ దేవేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. అప్పటి వరకు సెల్లార్ల తవ్వకాలపై నిషేధం ఉంటుందన్నారు. అనుమతులు పొంది ఇప్పటికే సెల్లార్ల తవ్వకాలు చేపట్టినవారు తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలి. వారు పటిష్ట భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నదీ? లేనిదీ? అధికారులు తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగితే నిర్మాణదారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. వర్షం కురుస్తున్నప్పుడు ఎలాంటి తవ్వకాలు జరపరాదని అధికారులు హెచ్చరించారు. జీహెచ్‌ఎంసీలో సెల్లార్ల తవ్వకాలకు అనుమతి పొందిన భవనాలు దాదాపు 200 ఉండవచ్చని అంచనా. నిబంధనల మేరకు 750 చ.మీ.ల స్థలముంటే ఒక సెల్లార్, 1000 చ.మీ.ల స్థలముంటే రెండు సెల్లార్లు తవ్వవచ్చు. కానీ అనుమతులు లేకుండానే తక్కువ స్థలంలో అక్రమంగా సెల్లార్లు తవ్వుతున్నవారు కూడా ఉన్నారు. ఇలాంటి వారిపై జీహెచ్‌ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. నగరంలో నాలుగు సెల్లార్ల వరకు అనుమతులిస్తున్నారు. ఒక్కో సెల్లార్‌ను దాదాపు మూడు మీటర్ల లోతుతో తవ్వుతున్నారు. గతేడాది సెల్లార్ల తవ్వకాలతో ప్రమాదాలు జరగడంతో వీలైనంత వరకు సెల్లార్ల తవ్వకాలను నివారించాలని యోచించారు. సెల్లార్లకు బదులు పైఅంతస్తుల్లో పార్కింగ్‌ ఏర్పాట్లు చేసుకునే వారికి ఆ మేరకు అదనపు అంతస్తులకు అనుమతిస్తామని కూడా గతంలో ప్రకటించారు. 

జాగ్రత్తలు అవసరం..  
సెల్లార్ల తవ్వకాల పనులు సగంలో ఉన్నవారు పటిష్ట భద్రత చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. సెల్లార్ల తవ్వకాలు జరిపేవారు, ముఖ్యంగా వాలు ప్రాంతాల్లో నేల జారిపోకుండా ఇసుక బస్తాలు వినియోగించాలి. దాంతో పాటు నైలింగ్, గ్రౌటింగ్‌లు కూడా  చేయాలని స్పష్టం చేశారు. సెల్లార్ల తవ్వకాలకు చుట్టూ 3 మీటర్ల సెట్‌బ్యాక్‌ వదలాలి. ఇది పైలెవెల్‌ సెల్లార్‌కు కాగా, దిగువ లెవెల్స్‌కు వెళ్లే కొద్దీ  అదనంగా మరో 0.5 మీటర్ల చొప్పున వదలాలి. తాత్కాలిక రిటైనింగ్‌ వాల్‌ నిర్మించాలి. సెల్లార్‌ ప్రాంతాల్లో అధిక బరువులుండే వస్తువులు, నిర్మాణ సామగ్రి ఉంచరాదు. భారీ వాహనాలు సెల్లార్ల సమీపంలోకి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పనుల్ని నిత్యం పరిశీలిస్తూ ఎక్కడైనా నేల వదులుగా జారిపోయేలా ఉంటే వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్లార్‌ తవ్వుతున్న చోట గానీ, పరిసరాల్లోని భవనాల్లో గానీ భూమి కదులుతున్నట్లు గ్రహిస్తే యుద్ధప్రాతిపదికన అవసరమైన చర్యలు చేపట్టాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement