శిశువును అప్పగిస్తున్న ఐసీడీఎస్ అధికారులు
కొండమల్లేపల్లి : నాలుగో కాన్పులోనూ ఆడ శిశువు జన్మించడంతో సాకడం భారంగా భావించిన ఆ తల్లిదండ్రులు శిశువును హైదరాబాద్‌లోనీ బంధువులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించి బుధవారం శిశువును తల్లిదండ్రులకు అప్పగించారు. ఐసీడీఎస్ సీడీపీఓ సక్కుబాయి తెలిపిన వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లి పట్టణానికి చెందిన భగవంతు, సైదమ్మకు గతంలో మూడు కాన్పుల్లోనూ ఆడపిల్లలే జన్మించారు. ఈ క్రమంలో గత నెల 26న నాలుగో కాన్పులోనూ ఆడశిశువు జన్మించింది.
ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పోషణ భారం కావడంతో శిశువును సాకలేక హైదరాబాద్‌లో ఉండే బంధువులకు పెంచుకునేందుకు అప్పగించారు. ఈ నెల 12 నుంచి శిశువు తల్లివద్ద లేకపోవడంతో గమనించిన అంగన్‌వాడీ సిబ్బంది ఆరా తీశారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించడంతో పాపను తీసుకొచ్చి తామే పెంచుకుంటామని అనడంతో తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రభుత్వ పరంగా లభించే పథకాలను వర్తింపజేసి తమను ఆర్థికంగా ఆదుకోవాలని శిశువు తల్లిదండ్రులు కోరారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ రాధా, అంగన్‌వాడీ టీచర్లు శోభ, మేరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment