అవినీతి రహిత పాలన అందిస్తాం: ఎమ్మెల్యే హరీష్‌రావు
సిద్దిపేట రూరల్, న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకుంటామని, అలాగే సిద్దిపేట ప్రాంతాన్ని బంగారంలా తీర్చిదిద్దుతానని స్థానిక ఎమ్మెల్యే హరీష్‌రావు పేర్కొన్నారు. మంగళవారం సిద్దిపేట మండలం పుల్లూర్ గ్రామంలో పెద్దమ్మ జాతర ఉత్సవాల్లో, పట్టణంలోని నీలకంఠేశ్వరాలయం, గణేష్‌నగర్‌లోని హనుమాన్ ఆలయం, రావిచెట్టు హనుమాన్ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై మరింత భారం పెరిగిందని, ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించిన అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాదిరిగా కాంట్రాక్టర్ల కోసం, వాటి కమిషన్ల కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేయదన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం, గల్ఫ్ బాధితుల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు కన్న కలలను సాకారం చేసే విధంగా కృషి చేస్తామన్నారు. వ్యవసాయానికి నీళ్లు అందిస్తామని, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన అందిస్తామన్నారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఇచ్చిన హమీలు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తామన్నారు.
అంతకు ముందు నీలకంఠేశ్వర సమాజంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే ప్రోత్సాహక బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలు అందించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు పుల్లూరి సరోజన అంజనేయులు, పరమేశ్వర్‌గౌడ్, ఎంపీటీసీ గంగపురం మహేష్, టీఆర్‌ఎస్ నాయకులు బాల్‌రంగం, రాజనర్సు, రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, సత్యనారాయణగౌడ్, వంగ ప్రవీణ్‌రెడ్డి, ఎల్లారెడ్డి, కడవేర్గు నర్సింలు, వీరబత్తిని జనార్ధన్, గుండ్ల జనార్ధన్, నీలకంఠ సుజాతఅశోక్‌కుమార్, తుమ్మ శ్రావణి, ప్రకాష్ పాల్గొన్నారు.