ఎంకి పెళ్లి సుబ్బి చావుకు రావడమంటే ఇదేనేమో! ప్రభుత్వ పాఠశాలలకు సన్నబియాన్ని చేరవేసేందుకు అయ్యే భారాన్ని భరించాలంటూ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై విద్యాశాఖలోని కొందరు ఏంఈఓ స్థాయి అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. వీరి తరపున రంగంలోకి దిగిన ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ ప్రతినిధులు మండలాల వారీగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో సమావేశమై విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఒక్కో పాఠశాల నుంచి రూ.500 నుంచి రూ.1500 దాకా వసూలు చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జిల్లాలో 309 వివిధ వసతిగృహాలు, 3071 ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులతో పాటు కేజీబీవీ, మోడల్‌స్కూల్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాలకు జనవరి నుంచి సన్నబియ్యం భోజనం అందిస్తున్న విషయం తెలిసిందే. సుమారు 3.20 లక్షల మంది విద్యార్థులకు నెలకు 1,429 మెట్రిక్ టన్నుల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగా ప్రతినెలా చివరి వారంలోనే అన్ని స్కూళ్లకు సన్నబియ్యం చేర్చాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలో మొత్తం 15 మండల్ లెవల్ స్టాక్(ఎంఎల్‌ఎస్) పాయింట్లుండగా, అక్కడి వరకు పౌరసరఫరాల శాఖ సన్నబియ్యాన్ని చేరవేస్తోంది. ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి పాఠశాలల వరకు బియాన్ని సరఫరా చేసే భారాన్ని నిన్నటి వరకు రేషన్ డీలర్లే భరించారు. బియ్యం రవాణాలో డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని, పాఠశాలలకు చేరే సరికి ఒక్కో బస్తా నుంచి గరిష్టంగా ఐదు కిలోల వరకు దారి మళ్లిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది.
బియ్యం రవాణా బాధ్యతను ఎంఈవోలకు అప్పగించింది. రవాణా ఛార్జీల నిమిత్తం ఒక్కో క్వింటాలుకు రూ.9.90 పైసలు చెల్లిస్తోంది. అంతకుమించి భారం పడినట్లయితే ఖాళీ గన్నీ సంచులు విక్రయించుకోవాలని సూచించింది. ఒకవేళ గన్నీ సంచులు విక్రయించినా సరిపోనట్లయితే మిగిలిన భారాన్ని సంబంధిత పాఠశాలల గ్రాంట్ల నుంచి ఖర్చు చేసుకునే వెసులుబాటు కల్పించింది. రవాణా ఛార్జీల చెల్లింపుల్లో ఎంఈఓలపై ఏమాత్రం భారం పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇన్ని వెసులుబాట్లు కల్పిస్తున్నప్పటికీ.. కాసులకు కక్కుర్తికి అలవాటుపడ్డ కొందరు ఎంఈఓలు ఈ భారాన్ని ప్రైవేటు పాఠశాలలపై మోపి ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులను తమ జేబులో వేసుకునే పనిలో పడ్డారు.
డబ్బులిస్తారా..
తల నొప్పులు తెచ్చుకుంటారా?
డబ్బుల వ్యవహారం కావడంతో అధికారులు చాలా జాగ్రత్త పడుతున్నారు. నేరుగా పాఠశాలలకు ఫోన్లు చేసి డబ్బులు అడిగితే దొరికిపోతామనే ఉద్దేశంతో ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ ప్రతినిధులను రంగంలోకి దింపారు. ఇప్పటికే పలు మండలాల్లో వసూళ్ల పర్వాన్ని పూర్తి చేయగా, మరికొన్ని చోట్ల కొనసాగుతోంది. రెండ్రోజుల క్రితం జగిత్యాల డివిజన్‌లోని ఓ మండల కేంద్రంలో పాఠశాలల యాజమాన్యాలతో అసోసియేషన్ నియోజకవర్గస్థాయి అధ్యక్షుడు సమావేశమై సదరు ఎంఈఓ చేసిన ప్రతిపాదనను యాజమాన్యాల ముందుంచారు.
‘సన్నబియ్యాన్ని ప్రభుత్వ స్కూళ్లకు పంపే బాధ్యతను ఎంఈఓ గారికి అప్పగించారు. మనం స్కూల్ బస్సులను పంపిస్తే వాటిలో సన్నబియ్యం బస్తాలను సరఫరా చేస్తామని ఎంఈవోగారు ప్రతిపాదించారు. నేనైతే ఆ ప్రతిపాదనను వ్యతిరేకించా. బియ్యం బస్తాలను స్కూల్ వ్యాన్లో వేస్తే సీట్లు పాడైపోతయని చెప్పిన. కావాలంటే రవాణా ఖర్చు ఎంతవుతుందో చెబితే తలా కొంత వేసుకుని చెల్లిస్తమని చెప్పిన. ఎంఈఓగారు సరేనన్నారు.
ఒక్కో పాఠశాల నుంచి విద్యార్థుల సంఖ్యను బట్టి రూ.500 నుంచి రూ.1500 వరకు తీసుకోమని చెప్పిండ్రు. మీ అందరికీ ఇప్పటికే ఈ విషయాన్ని చెప్పిన. ఇప్పటి వరకు పది మంది మాత్రమే డబ్బులిచ్చిండ్రు. మిగిలిన వాళ్లు కూడా ఇస్తే ఎంఈవోగారికి ఇచ్చేద్దాం. లేకుంటే లేనిపోని తలనొప్పులు వస్తాయి’ అని ప్రతిపాదించారు. కొన్ని యాజమాన్యాలు ఈ ప్రతిపాదనపట్ల అభ్యంతరం వ్యక్తం చేశాయి. ‘సన్నబియ్యం రవాణా ఛార్జీలు ప్రభుత్వమే చెల్లిస్తోంది కదా! మనమెందుకు భరించాలి? అయినా డబ్బులు కావాలంటే ఎంఈఓగారే నేరుగా అడగొచ్చు కదా! ఒక్కొక్కసారి ఒక్కో పేరు చెప్పి డబ్బులివ్వమంటే ఎట్లా? ఒకేసారి ఒక్కో స్కూలు తరపున వెయ్యో...రెండు వేలో ఇచ్చేస్తాం. మళ్లీ ఏడాది దాకా మమ్ముల్ని ఏమీ అడగొద్దని, ఎలాంటి ఇబ్బందులు పెట్టొద్దని చెప్పండి’ అని చెప్పారు.
వెంటనే జోక్యం చేసుకున్న అసోసియేషన్ ప్రతినిధి ‘ఎంఈఓగారు అడిగినట్లు ఇస్తే మనకే మంచిది. లేకుంటే తలనొప్పులు తెచ్చుకున్నట్లే. నిబంధనల పేరుతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది’ అని చెప్పడంతో చేసేదేమీలేని ప్రైవేటు స్కూళ్ల నిర్వాహకులు విద్యార్థుల సంఖ్య మేరకు డబ్బులు సర్దుబాటు చేశారు. ఆ సమావేశంలో నలభై మంది యాజమానులు పాల్గొనగా రూ.25 వేలు జమ చేసి అసోసియేషన్ ప్రతినిధికి అందజేశారు. ఒక్క మండలం నుంచే ఇంత డబ్బు వసూలైందంటే... జిల్లావ్యాప్తంగా 1637 ప్రైవేటు పాఠశాలున్న నేపథ్యంలో ఇంకెంత సొమ్మును వసూలు చేశారోనని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు చర్చించుకోవడం గమనార్హం.
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు సన్నబియ్యాన్ని పంపిణీ చేసే ప్రక్రియ జనవరి నెలాఖరులోనే పూర్తయిందని డీఈ ఓ లింగయ్య చెప్పారు. సన్నబియాన్ని ఎంఎల్‌ఎస్ పా యింట్ నుంచి పాఠశాల వరకు సరఫరా చేసే బాధ్యతను ప్రస్తుతం ఎంఈఓలకు అప్పగించినప్పటికీ అందుకయ్యే రవాణా ఖర్చులను ప్రభుత్వమే చెల్లిస్తోందని స్పష్టం చేశారు. ప్రైవేటు పాఠశాలల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు మా దృష్టికి రాలేదు. ఒకవేళ ఎవరైనా ఫిర్యా దు చేస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
పైసలియ్యుండ్రి
Published Fri, Feb 6 2015 2:55 AM | Last Updated on Sat, Sep 2 2017 8:50 PM
Advertisement