లాక్‌డౌన్‌ తొలగించినా కోలుకోలేం.. | Gold Business Loss With Lockdown in Hyderabad | Sakshi
Sakshi News home page

ఇప్పట్లో కోలుకోలేం..

Published Mon, May 11 2020 12:12 PM | Last Updated on Mon, May 11 2020 12:12 PM

Gold Business Loss With Lockdown in Hyderabad - Sakshi

డ్రాగన్‌ దేశంలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌–19 (కరోనా) మహమ్మారి మానవ జీవన విధానాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రాణాలను హరిస్తూనే అన్ని రంగాలనూ నిర్వీర్యం చేస్తోంది. కోవిడ్‌ ప్రభావానికి బంగారు ఆభరణాల తయారీ రంగం కోలుకోలేని విధంగా దెబ్బతింది. ఈ వ్యాపారంపై ఆధారపడి బతుకులు వెళ్లదీస్తున్న ఎంతో మంది జువెల్లర్స్‌తో పాటు కిందిస్థాయి సిబ్బంది, ఆభరణాలు తయారు చేసే స్వర్ణకారుల జీవన విధానం కుదేలైంది.

చార్మినార్‌: కరోనా లాక్‌డౌన్‌తో గ్రేటర్‌లో బంగారం వ్యాపారం సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడింది. నగల విక్రయాలతోపాటు తయారీ పరిశ్రమకు కూడా ఇప్పుడు కష్టకాలం వచ్చింది. నగరంలో దాదాపు రెండు వేల జ్యువెలరీ షోరూంలు..బులియన్‌ మార్కెట్లు సైతం ఉన్నాయి. ప్రతి రోజూ రూ.వందల కోట్లలో బిజినెస్‌ సాగుతుండేది. రాష్ట్రం నలుమూలలనుంచి వ్యాపారులు, వినియోగదారులు పెద్ద సంఖ్యలో ఆభరణాలు, గోల్డ్‌ బిస్కెట్ల కొనుగోలుకు ఇక్కడికి వస్తుంటారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పుడు ఈ లావాదేవీలన్నీనిలిచిపోయాయి. ముఖ్యంగా వేసవిలో శుభకార్యాలన్నీ నిలిచిపోవడంతో ఈ ఏడాది ఇకకొనుగోళ్లు కష్టమే అంటున్నారు. ఇతరత్రా సమస్యల్లో చిక్కుకుపోయిన జనం బంగారంకొనడానికి ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఈ కారణంగా ఏడాదిపాటు బంగారం వ్యాపారానికి కష్టకాలమే అని జ్యువెలరీ షోరూంల అధినేతలు అంటున్నారు. పాతబస్తీలో షోరూంలతోపాటు నగలు తయారు చేసే కార్ఖానాలు చాలా ఉన్నాయి. వేలాది మంది కార్మికులు ఇక్కడ పని చేస్తుంటారు. ఇక షోరూంలలోనూ వేలాది మంది పనిచేస్తుంటారు. వీరంతా ఇప్పుడు ఉపాధి కోల్పోయి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.

లాక్‌డౌన్‌తో బంగారు ఆభరణాల తయారీ వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మందికి ఉపాధి కనుమరుగైంది. ఆ రంగానికి పూర్వ వైభవం వచ్చే అంశం కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఇప్పటికే లాక్‌డౌన్‌తో ఎంతో కష్టంగా ఉన్న వ్యాపారులు, సిబ్బందికి... భవిష్యత్‌ మరింత గడ్డుకాలంగా కనిపిస్తోంది. బులియన్‌ మార్కెట్‌లో ముడిసరుకు (రా మెటీరియల్‌) బంగారం విక్రయించే వారితోపాటు జువెల్లరీ షో రూంల యజమానులు ఎలాగోలాగా నెట్టుకొస్తుండగా... ఆభరణాలు తయారు చేసే స్వర్ణకారులు (కారీగార్‌), పాలిష్‌ చేసే వారు, మిషన్‌ కటింగ్, డై కట్టింగ్, డైమండ్, స్టోన్స్‌ సెట్టర్స్, జువెల్లరీ డిజైన్‌ చేసే వారు, మిషన్‌ మెన్‌లు, జువెల్లరీ షో రూంలలో పని చేసే వర్కర్స్‌.. ఇలా కిందిస్థాయిలో పని చేసే కార్మికులు పని లేక పడరాని పాట్లు పడుతున్నారు. గతంలో రోజూ లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు తయారు చేసే కార్మికులకు ప్రస్తుతం పట్టుమని పది రూపాయలు కూడా కన్పించడం లేదనడం అతిశయోక్తికాదు.

నిత్యం రూ. వందల కోట్లలోనే వ్యాపారం...
నగరంలో 2 వేలకుపైగా బంగారం, వెండి, ముత్యాల వ్యాపార దుకాణాలున్నాయి. రా మెటీరియల్‌ (విడిగా బంగారం, బంగారు బిస్కెట్స్‌) విక్రయించే బులియన్‌ మార్కెట్లు దాదాపు 50కి పైగానే ఉన్నాయి. సీజన్, అన్‌ సీజన్‌లపై బంగారం వ్యాపారం కొనసాగుతుంది. వివాహాది శుభకార్యాలప్పుడు బంగారం వ్యాపార లావాదేవీలు జోరుగా కొనసాగుతాయి. సీజనల్‌లో ఒక్కో బులియన్‌ మార్కెట్‌లో రోజుకు 10 నుంచి 20 కిలలో బంగారం విక్రయాలు జరుగుతాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అంటే కిలో బంగారానికి సుమారు రూ. 40 లక్షలైతే... 10 కిలోలకు రూ. 4 కోట్లు అవుతుంది. ఇలా 100 కిలోల బంగారం విక్రయిస్తే.. రమారమి రూ. 40 కోట్లమేర వ్యాపార లావాదేవీలు జరుగుతాయంటున్నారు. ఇక నగరంలోని అన్ని బులియన్‌ మార్కెట్‌లలో విక్రయించే విడి బంగారం లావాదేవీలు రూ. వందల కోట్లలోనే ఉంటాయి. రా మెటీరియల్‌ ఖరీదు చేసే బంగారం దుకాణాల యజమానులు ఆయా ఆర్డర్స్‌ వారీగా ఆభరణాలను తయారు చేయడానికి స్వర్ణకారులకు అందజేస్తారు. గ్రేటర్‌లో దాదాపు అన్ని జోన్లలో జువెల్లరీ దుకాణాలున్నాయి. ఆయా షో రూంలపై ఆధారపడి జీవిస్తున్న కిందిస్థాయి సిబ్బంది వేల సంఖ్యలో ఉన్నారు. లాక్‌డౌన్‌లో వీరిలో కొంత మందికి పూర్తీగా నెలసరి వేతనం ఇస్తుండగా... మరికొంత మందికి సగం జీతం, మరికొంత మందికి నో వర్క్‌.. నో పేమెంట్‌ అంటున్నట్లు తెలుస్తోంది. నగరంలో తయారయ్యే వివిధ రకాల బంగారు ఆభరణాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గిరాకీ ఉంది. ఆకట్టుకునేలా చేతితో తయారు చేసే ఆభరణాలను ఎక్కువగా ఇష్టపడి ఖరీదు చేసే వారున్నారు. రంగురంగుల స్టోన్స్, పచ్చలు, కెంపులు, డైమండ్స్‌ పొదిగిన బంగారు ఆభరణాలకు విదేశాల్లోఆదరణ ఉంది. దీంతో ఇక్కడి షో రూంల నిర్వాహకులు విదేశాల్లో జరిగే ఎగ్జిబిషన్‌ షోలలో పాల్గొంటారు.

ఉపాధి కోల్పోయిన స్వర్ణకారులు

నగరంలో తెలంగాణ స్వర్ణకారులతోపాటు పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన స్వర్ణకారులు సైతం ఆభరణాల తయారీలో ఉన్నారు. కొన్ని దశాబ్దాలుగా బెంగాల్‌ స్వర్ణకారులు తమ కుటుంబ సభ్యులతో కలసి ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే స్థానిక స్వర్ణకారులకు పోటీగా పనులు చేస్తున్న బెంగాల్‌ స్వర్ణకారులు పాతబస్తీ కేంద్రంగా పని చేస్తున్నారు. పాతబస్తీలోని ఘాన్సీబజార్, చేలాపురా, గుల్జార్‌హౌజ్, మామాజుమ్లా పాటక్, కాలీకబర్, ఉర్దు గల్లీ, బండీకా అడ్డా, మెహెందీ గల్లీ, జూలా తదితర ప్రాంతాల్లో చిన్న చిన్న కుటీర పరిశ్రమల్లాగా ఆభరణాల తయారీ (ఖార్కానా) కేంద్రాలున్నాయి. ఒక్కో కేంద్రంలో 10 నుంచి 20 మంది వరకు పని చేస్తున్నారు. వీరంతా రోజు వారీ వేతనాలపై ఆభరణాల తయారీ చేస్తూ తమ కుటుంబాలను పోషిస్తున్నారు. వీరంతా ఎక్కువగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన బెంగాల్‌ స్వర్ణకారులు. వీరంతా పాతబస్తీకి వలస వచ్చిన కార్మికులు. ప్రస్తుతం లాక్‌డౌన్‌లో వీరికి వర్క్‌ ఆర్డర్స్‌ లేనందున ఆయా కార్కానాల్లో ఉపాధి లేక కాలం వెళ్లదీస్తున్నారు. సొంత ఊర్లకు వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంతో చాలా మంది బెంగాల్‌ స్వర్ణకారులు వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఒక బంగారు ఆభరణం తయారు కావడానికి కారిగార్, పాలిష్‌ చేసే వారు, మిషన్‌ కటింగ్, డై కట్టింగ్, డైమండ్, స్టోన్స్‌ సెట్టర్స్, జువెల్లరీ డిజైన్‌ చేసే వారు, మిషన్‌ మెన్‌లు అవసరం ఉంటారు. వీరంతా పని చేస్తేనే ధగధగ మెరిసే బంగారు ఆభరణం తయారవుతుంది. ఇక వివాహాది శుభకార్యాలు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో వెండి వస్తువుల తయారీకీ బ్రేక్‌ పడింది.

ఇప్పట్లో కోలుకోలేం..:కరోనా కారణంగా బంగారం వ్యాపారానికి గడ్డురోజులు తప్పవేమో. రాబోయే రోజుల్లో లాక్‌డౌన్‌ తొలగించినా ఈ రంగం వెంటనే కోలుకోలేదు. ఏడాది వరకు పరిస్థితుల్లో మార్పులు కనిపించవు. ఈ వేసవి కాలంలో వివాహాది శుభకార్యాలు లేవు. దీంతో ఇక డిమాండ్‌ ఉండదు. 2021లోనే బంగారం వ్యాపారానికి కొంతమేర అవకాశాలుంటాయి. ఈ ఏడాది చివరి నాటికి కూడా ఆశించిన ఫలితాలుండకపోవచ్చు. అన్ని వర్గాల ప్రజలు బంగారం కొనడానికి ముందుకురాలేని దుర్భర ఆర్థిక పరిస్థితులు నెలకొంటున్నాయి.   – నాగ్‌నాథ్‌ మాశెట్టి, బంగారు ఆభరణాల విక్రయదారుడు

స్వర్ణకారులను  ప్రభుత్వం ఆదుకోవాలి
రెండు నెలలుగా ఇంటికే పరిమితమైన స్వర్ణకారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. పేద స్వర్ణకార కుటుంబాలకు తక్షణమే రూ. 10 వేల ఆర్థిక సహాయం అందించాలి. కుటుంబ పోషణ భారంగా మారింది. అప్పులు కూడా లభించని పరిస్థితులున్నాయి. నిత్యావసర వస్తువుల పంపిణీతోపాటు జాతీయ బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణాలను అందజేయాలి.– గోల్కొండ శ్రావణ్‌కుమార్,చార్‌కమాన్‌ స్వర్ణకార యూనియన్‌     ప్రధాన కార్యదర్శి

తగ్గుతుందో.. పెరుగుతుందో..
బంగారం రేటు పెరుగుతుందో... తగ్గుతుందో తెలియదు. ఎండాకాలం పెళ్లిళ్ల సీజన్‌ అయిపోతున్నది. అక్షయ తృతీయ రోజు ఎంతో కొంత బంగారం కొనే అలవాటున్న వారికీ ఈసారి లాక్‌డౌన్‌ ఎదురైంది. అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం ద్వారా లక్ష్మీ దేవీని ఇంట్లోకి ఆహ్వానిస్తాం. ఇది ఆనవాయితీగా వస్తోంది.      – శైలజ, మలక్‌పేట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement