శ్రీపర్వతారామం వ్యూ
నాగార్జునసాగర్ ప్రాంతం.. బుద్ధ పరిమళంతో విరాజిల్లుతోంది. బుద్ధవనం ప్రాజెక్టు పనులు ఊపందుకోవడంతో పలు దేశాలనుంచి బౌద్ధ భిక్షువుల తాకిడి పెరిగింది. ప్రపంచం లోనే అన్ని ప్రాంతాల బౌద్ధ ఆనవాళ్ల నమూనాల కోసం చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పనులు చూసేందుకు దేశవిదేశాల నుంచి బౌద్ధ యాత్రికులు సాగర్‌బాట పడుతున్నారు.
సాక్షిప్రతినిధి, నల్లగొండ : నాగార్జునసాగర్ వద్ద 275 ఎకరాల్లో బుద్ధవనం ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. బుద్ధుడి జీవిత విశేషమంతా ఈ వనంలో ఆవిష్కరిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.25 కోట్లు విడుదల చేసింది. ఎప్పుడో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు గతంలో నిధుల లేమితో మూలనపడ్డాయి. ఇటీవల బౌద్ధ యాత్రికుల తాకిడి పెరగడంతో పనుల్లో వేగం పెరిగింది. పలు దేశాలకు చెందిన బౌద్ధ సంప్రదాయాలు నెలకొని ఉండేలా ఈ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి.
శ్రీపర్వతారామంలో 8 భాగాలుగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మహాస్తూపం, బుద్ధచరిత వనం, ధ్యానవనం, జాతక పార్కు, స్తూపాపార్కు విభాగాల్లో నిర్మాణాలు ఓకొలిక్కి వచ్చాయి. కృష్ణావ్యాలీ పార్కు (కృష్ణా,గోదావరి నదుల వెంట విరాజిల్లిన బౌద్ధ సంప్రదాయాలకు అనుగుణమైనరీతిలో) ఆచార్యనాగార్జున రిసర్చ్‌సెంటర్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. అంతర్జాతీయ బౌద్ధ సంప్రదాయాలకనుగుణంగా ఈ అధ్యయన కేంద్రంలో ప్రపంచంలోని బౌద్ధ సంప్రదాయ దేశాలన్నింటిని భాగస్వాములను చేస్తున్నారు. ఆయా దేశాల ఆరామాలు, మ్యూజియాలు ఏర్పాటు చేసుకునేందుకు శ్రీపర్వతారామంలో స్థలాలను కేటాయిస్తున్నారు.
టిబెట్ దేశీయులకు 5 ఎకరాలు, బుద్ధిస్ట్ అసోసియన్ ఆఫ్ అమెరికాకు 5 ఎకరాలు, శ్రీలంక దేశీయులకు 5 ఎకరాలు, విపశ్శనకేంద్రానికి 30ఎకరాలు ఇచ్చారు. ఇప్పటికే శ్రీలంక దేశీయులు 27 అడుగుల నమూనా బుద్ధ అవకన విగ్రహం, బుద్ధునిపాదాలు, ధర్మగంట ఏర్పాటు చేశారు. గత డిసెంబర్‌లో డిసెంబర్ 25న శ్రీపర్వతారామాన్ని తైవాన్‌కు చెందిన బౌద్ధులు సందర్శించారు. దీనిలో ఫోగ్యాంగ్‌షాన్ తరహాలో లెర్నింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరిచారు. అలాగే ఇదే నెలలో మలేషియా దేశస్తులు ఈ ప్రాంతానికి వచ్చి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈనెల మొదటి వారంలో స్విట్జర్లాండ్, బర్మా, నేపాల్ దేశీయులు వచ్చారు.
పర్యాటకులకు స్వర్గధామమే ..
నాగార్జునసాగర్ ప్రాజెక్టు దేశంలోనే ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉంది. బుద్ధవనం ప్రాజెక్టు పూర్తయితే విదేశీ యాత్రికుల సంఖ్య కూడా ఇక్కడ పెరగనుంది. బుద్ధుడి ఆనవాళ్లు, జీవిత చరిత్రతో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టు పనులను చూసి విదేశీయులు అబ్బురపడుతున్నారు. ఈ ప్రాజెక్టుతో పాటు బౌద్ధానికి చారిత్రక నిలువుటద్దంగా ఉన్న నాగార్జునకొండలోని మ్యూజియం ప్రపంచంలోనే పెద్దది. నాగార్జునసాగర్, నదీతరం, జలపాతాలు, నల్లమల అభయారణ్యం, నాగార్జునకొండలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. బద్ధవనం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయితే ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందనుంది. నాగార్జునసాగర్ నూతన సొబగులద్దుకొని ప్రపంచంలోనే ప్రముఖ బౌద్ద ఆధ్యాత్మిక కేంద్రం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment