సాక్షి, నల్లగొండ : ఎల్‌పీజీ కనెక్షన్ ఉన్నవారికి ఆగస్టు నుంచి కిరోసిన్ కట్ కానుంది. దీపం పథకం కింద గ్యాస్ పొందిన వారికి మాత్రం మినహాయింపును ఇచ్చింది. మిగిలిన ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్లు ఉన్న వారికి ప్రతినెలా ఇచ్చే లీటర్ కిరోసిన్ నిలిచిపోనుంది. ఆగస్టు నెల నుంచి వీరికి కిరోసిన్ కోత విధించాలని పౌర సరఫరాల కమిషనర్ అకున్ సబర్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి ప్రతి నెలా రూ.కోటి వరకు ఆదా కానుంది.
బీపీఎల్ కింద అనర్హులు కూడా రేషన్‌కార్డులతో పాటు ఫుడ్ సెక్యూరిటీ కార్డులు పొందారు. వీటి ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతుండడంతో అర్హులు కాకపోయినా సంక్షేమ పథకాల కోసం కార్డులు పొందారు. అయితే రేషన్ బియ్యం, కిరోసిన్ నల్లబజారుకు తరలుతూ విజిలెన్స్ అధికారులకు పట్టుబడుతున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ పాస్ విధానాన్ని అమలు చేసింది. అయినా అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎల్‌పీజీ ఉన్న వారికి కిరోసిన్ సరఫరా నిలిపివేయనుంది.
సమగ్ర సర్వే ఆధారంగా గుర్తింపు..
జిల్లా వ్యాప్తంగా 4,61,149 కార్డులున్నాయి. ఇందులో 30,814 మంది దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొందారు. 1,44,935 మందికి గ్యాస్ కనెక్షన్లు లేవు వీరిద్దరినీ కలుపుకుంటే 1,75,749 మంది అవుతున్నారు. వీరికి మాత్రమే కిరోసిన్ అందించనున్నారు. ప్రభుత్వం గతంలో నిర్వహించిన సమగ్ర సర్వే ఆధారంగా ఏఏ కుటుంబాలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయో అప్పుడు ఆ కుటుంబాలు సర్వేలో ఇచ్చిన సమాచారం ఆధారంగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారిని గుర్తించారు. అదే విధంగా గ్యాస్ కంపెనీల నుంచి ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నవారి జాబితాను సేకరించి ఈ రెండింటినీ పరిశీలించి అనర్హుల జాబితాను నిర్ణయించారు.
దీపం లబ్ధిదారులకు యథావిధిగా..
దీపం కనెక్షన్ ఉన్న లబ్ధిదారులకు యథావిధిగా కిరోసిన్‌ను అందించనున్నారు. అయితే జిల్లాలో 30,812 మంది దీపం పథకం కింద ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ కనెక్షన్లను పొందారు. వారందరికీ ప్రతి నెలా ప్రభుత్వం ఇచ్చే లీటర్ కిరోసిన్‌ను కొనసాగించనున్నారు.
2,85,400 మందికి కిరోసిన్ కోత
జిల్లాలో ఈ ఆగస్టు నుంచి ఎల్పీజీ కనెక్షన్లు ఉన్న 2,85,400 కుటుంబాలకు కిరోసిన్ ఆగిపోనుంది. వాస్తవంగా రేషన్‌కార్డు ఉన్నవారు కట్టెల పొయ్యి మీద వంట చేస్తేనే ప్రతి నెలా వారికి కిరోసిన్ ఇవ్వాలనేది నిబంధన అయితే ఎల్పీజీ కనెక్షన్లు పొందిన వారికి ప్రభుత్వం గ్యాస్‌కు సబ్సిడీ అందిస్తుంది. అలాంటప్పుడు కిరోసిన్ వారికి అవసరం లేదు. కాబట్టి వారికి కిరోసిన్ కోత విధించాలని నిర్ణయించింది. ప్రతి నెలా కార్డుదారులందరికీ కిరోసిన్ అందించడం వల్ల అది పక్కదారి పడుతోంది.
ఇలా ప్రతి నెలా రూ.కోటి పైగా విలువ చేసే కిరోసిన్ నల్లబజారుకు తరలుతుం దని సమాచారం. అయితే రేషన్ షాపుల్లో బియ్యం తీసుకున్నవారు కిరోసిన్ తీసుకోవడం లేదు. గతంలో కిరోసిన్‌కు ఈ–పాస్ అమలు కాలేదు. దాంతో డీలర్లు ఇష్టానుసారంగా అమ్ముకునేవారు. ప్రస్తుతం కిరోసిన్‌కు కూడా ఈపాస్ విధానం అమలు చేస్తున్నారు. అయితే కొందరు అవసరం లేకున్నా వేలి ముద్ర వేసి తిరిగి అమ్ముకుంటున్నట్లు ప్రభుత్వానికి సమాచారం ఉంది. దీనికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం తాజా చర్యలు చేపట్టింది.
బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధరకు విక్రయం..
ప్రభుత్వం కిరోసిన్‌ను సబ్సిడీపై రూ.32.75కు డీలర్‌కు లీటర్ ఇస్తుంది. డీలర్ రూ.33కు లబ్ధిదారునికి ఇస్తాడు. అయితే కిరోసిన్ అవసరం లేకున్నా తీసుకుని బహిరంగ మార్కెట్‌లో రూ.50కి అమ్ముకుంటున్నారు. చాలా చోట్ల నల్లబజారులో కిరోసిన్‌ను అధికారులు పట్టుకొని సీజ్ చేశారు. ప్రధానంగా డీజిల్ ధర ఎక్కువగా ఉండ డం, కిరోసిన్ ధర తక్కువగా ఉండడం వల్ల కిరోసి న్‌ను లారీలు, జీపులు, ఆటోలు తదితర వాహనా లకు వాడుతున్నారు. దీంతో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కిరోసిన్ అంతా నల్లబజారుకు తరలిపోయి ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది.
ప్రతినెలా రూ.కోటి ఆదా..
ప్రభుత్వం ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్లు ఉన్న 2,85,400 మంది కార్డుదారులకు ఆగస్టు నుంచి కిరోసిన్‌ను నిలిపివేస్తుంది. దీంతో ప్రతి నెలా రూ.కోటి వరకు ప్రభుత్వానికి ఆదా అవుతుంది. సంవత్సరానికి రూ.11.30 కోట్ల వరకు మిగులుతాయి.
Comments
Please login to add a commentAdd a comment