సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జంట పోలీసు కమిషనరేట్ల పరిధిలో త్వరలో 2000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఏఏ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలనే విషయంపై కమిషనర్లు మహేందర్‌రెడ్డి, ఆనంద్ నిఘావర్గాలతో సర్వే చేయిస్తున్నారు. పాతబస్తీలో ఎక్కువ సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిసింది.
గత రెండు దశాబ్దాల కాలంలో నగరంలో హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాలతో పాటు అత్యంత సమస్యాత్మక ప్రాంతాలలో కెమెరాలు ఏర్పాటు చేస్తే బాగుం టుందని నిఘా వర్గాలు కమిషనర్లకు సూచించాయి. శివార్లలో కాలనీలు, బస్తీలు విస్తరించడంతో రెండు కమిషనరేట్ల పరిధిలో గతంలో కంటే సమస్యాత్మక ప్రాంతాలు పెరిగాయి. మత ఘర్షణలు, అల్లర్లు, రౌడీమూకల దాడులు జరిగిన ప్రాంతాలు కూడా వీటిలో ఉన్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటుతో నగరంలో ఎక్కడ ఏ చిన్న గొడవ జరిగినా.. ఎందుకు జరిగింది? కారకులు ఎవరు అనేది సులభంగా తెలిసిపోతుంది. సీసీ కెమెరాల్లోని ఫుటేజీ నిందితుడికి శిక్షపడేందుకు కూడా దోహదపడుతుంది.
గతంలో ఏదైనా గొడవ జరిగితే స్థానిక యువకులను అనుమానితులుగా స్టేషన్‌కు పిలిచి విచారణ పేరుతో వేధించేవారు. సీసీ కెమెరాలు అందుబాటులోకి వస్తే నిందితుడి గుర్తింపు వెంటనే జరిగిపోవడంతో పాటు అమాయకులను వే ధించడం ఆగిపోతుంది. సీసీ కెమెరాల్లో ప్రతి చిన్న విషయం రికార్డు అయిపోతుంటుంది కాబట్టి ఎవ్వరూ నేరం చేయడానికి సాహసించరని, దీంతో నేరాలు అదుపులోకి వస్తాయని పోలీసులంటున్నారు. ఆయా ప్రాంతాలలో ఏర్పాటు చేసే సీసీ కెమెరాల ద్వారా వచ్చే ఫుటేజీల పర్యవేక్షణకు జోన్‌ల వారీగా ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను సైతం ఏర్పాటు చేయనున్నారు.
ఇప్పటికే నగరంలో ప్రధాన కూడళ్లలో ఉన్న సీసీ కెమెరాలను అనుసంధానం చేస్తూ బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ నుంచి నిత్యం ఆయా కూడళ్లలో వాహనాల రద్దీని పరిశీలించి, ట్రాఫిక్ క్లియరెన్స్‌కు సహకరిస్తుంటారు. అలాగే, ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న కెమెరాల ద్వారా ఎక్కడైన గొడవలు జరుగుతుంటే గుర్తించి వెంటనే అదుపులోకి తెచ్చేయవచ్చు. వచ్చే రెండు మూడు నెలల్లో నగరంలో పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు ఉపయోగంలోకి తీసుకొస్తామని అధికారులంటున్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ సీసీ కెమెరాలతో పాటు హోటళ్లు, దుకాణాలు, షాపింగ్‌మాల్స్, సినిమా థియేటర్లు, ఆసుపత్రుల వద్ద కెమెరాలు ఏర్పాటు చేసేలా యజమానులుపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ఇటు ప్రైవేట్, అటు ప్రభుత్వం తరఫున సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తయితే నగర జీవి అనుక్షణం మూడో కన్ను నీడలో పయనించకతప్పదు.
త్వరలో 2000 నిఘా నేత్రాలు
Published Sun, Jul 13 2014 12:59 AM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM
Advertisement
Advertisement