నేరగాళ్లపై నిత్యం నిఘా నేత్రం | Regular surveillance eye on offenders | Sakshi
Sakshi News home page

నేరగాళ్లపై నిత్యం నిఘా నేత్రం

Published Tue, Jan 26 2016 6:43 PM | Last Updated on Fri, Sep 7 2018 2:16 PM

Regular surveillance eye on offenders

జంట కమిషనరేట్లలో వేల సీసీ కెమెరాలు
- కమ్యూనిటీ భాగస్వామ్యంతోనూ ఏర్పాటు
- ఆధునిక సాఫ్ట్‌వేర్స్ అనుసంధానిస్తున్న వైనం

హైదరాబాద్

జంట కమిషనరేట్ల పరిధిలో పోలీసు విభాగం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సంఖ్య 500... ప్రజా భద్రతా చట్టం అమలులోకి వచ్చిన తరవాత పోలీసులు తీసుకున్న చర్యల ఫలితంగా కమ్యూనిటీల వారీగా ఏర్పాటైనవి ఐదు వేల పైనే. వీటన్నింటినీ ఆయా కమిషనరేట్లలో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్‌కు (సీసీసీ) అనుసంధానం చేశారు. ఫలితంగా నిఘా పెరగడమే కాదు.. అనేక కీలక కేసులు కొలిక్కి రావడంలోనూ ఉపకరించాయి. ఈ కెమెరా వ్యవస్థకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సైతం జోడించే పనిలో ఉన్నారు హైదరాబాద్, సైబరాబాద్ అధికారులు.


ఏమాత్రం 'తేడా' రాకుండా చర్యలు...
2014లో అమలులోకి వచ్చిన ప్రజా భద్రతా చట్టాన్ని కమిషనరేట్ల అధికారులు పక్కాగా అమలు చేస్తున్నారు. వ్యాపార సముదాయాలు, వాణిజ్య ప్రాంతాల్లో వ్యక్తిగతంగా, కమ్యూనిటీ మొత్తం కలిసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడాన్ని కచ్చితం చేశారు. పోలీసుస్టేషన్ల వారీగా బాధ్యతలు అప్పగించిన కమిషనర్లు... ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు వీటి ఆవశ్యకతనూ వివరిస్తూ ఎవరివారు ముందుకు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇలా ఏర్పాటవుతున్న కమ్యూనిటీ కెమెరాలను ఎవరికి నచ్చిన మోడల్, సామర్థ్యం కలిగినని వారు ఏర్పాటు చేసుకుంటే సీసీసీతో అనుంధానం, పర్యవేక్షణలో ఇబ్బందులు ఎదురవుతాయి. అలా కాకుండా యూనిఫామిటీ కోసమూ పోలీసులు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసు విభాగమే ప్రముఖ కంపెనీతో సంప్రదింపులు జరిపింది. సీసీ కెమెరాలకు ఉండాల్సిన స్పెసిఫికేషన్స్‌ను నిర్దేశించి అంతా వాటినే ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకుంటోంది. దీంతో అన్నీ ఒకే రకమైన కెమెరాలు సమకూరుతున్నాయి.


అవి ఇవీ అన్నీ కలిపేస్తూ...
ఇప్పటికే జంట కమిషనరేట్లలో పోలీసు, ట్రాఫిక్ విభాగాలు ఏర్పాటు చేసిన కెమెరాలు సీసీసీతో అనుసంధానించి ఉన్నాయి. వీటి సంఖ్య పరిమితం కావడంతో అన్నిచోట్లా నిఘా సాధ్యం కావట్లేదు. దీన్ని పరిగణలోకి తీసుకున్న ఉన్నతాధికారులు ఓ వ్యాపార సముదాయం, వాణిజ్య కూడళ్ళతో పాటు దుకాణాల్లోనూ ఏర్పాటు చేస్తున్న వాటినీ సీసీసీతో అనుసంధానిస్తున్నారు. దుకాణం లోపల భాగం మినహా బయటకు ఉన్న కెమెరాలు, కాలనీలు, పబ్లిక్‌ప్లేసుల్లో ఉన్న అన్నింటినీ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా సీసీసీలతో అనుసంధానిస్తున్నారు.

దీంతో పోలీసు విభాగానికి చెందిన కెమెరాలూ ప్రధానంగా ట్రాఫిక్ కోణంలో ఉన్నా... అనుసంధానించినవి నిఘా, శాంతిభద్రతల పర్యవేక్షణకు ఉపకరిస్తున్నాయి. రానున్న రెండేళ్ళల్లో జంట కమిషనరేట్లతో పోలీసు, కమ్యూనిటీ అన్ని కలిపి లక్ష సీసీ కెమెరాలు ఉండాలన్న లక్ష్యంతో ఇరు కమిషనర్లు ముందుకు వెళ్తున్నారు. ఈ కలసాకారమైతే అలాంటి నిఘాతో కూడిన నగరంగా సిటీ దేశంలోనే ప్రముఖ స్థానాన్ని ఆక్రమించనుంది.


పర్యవేక్షణకూ సాంకేతిక పరిజ్ఞానం...
ఇప్పటికు ఈ కెమెరాల ద్వారా రికార్డు అవుతున్న ఫీడ్ అనేక కేసుల్ని కొలిక్కి తీసుకురావడంతో ఉపకరిస్తోంది. దీనికోసం ఈ వీడియోలను సమర్థంగా అభివృృద్ధి చేయడానికి ఎన్‌హ్యాన్స్‌మెంట్ సాఫ్ట్‌వేర్స్ వాడుతున్నారు. రానున్న రోజుల్లో మరికొన్ని రకాలైన వాటినీ అమలులోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. నగరంలో వేల సంఖ్యలో ఉన్న కెమెరాలను సీసీసీ ఉండే పరిమిత సిబ్బంది నిత్యం పర్యవేక్షించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే దీనికోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు రెండో దశలో పటిష్ట నిఘా కోసం ఎనలటిక్స్‌గా పిలిచే సాఫ్ట్‌వేర్స్ అభవృద్ధి చేస్తున్నారు.

అవి ఎలా పని చేస్తాయంటే...


- నగరంలోని అన్ని కెమెరాలు అనుసంధానించి ఉండే సీసీసీలోని సర్వర్‌ను కంప్యూటర్లకు అనుసంధానిస్తారు.
- ఈ సర్వర్లలో ఎనలటిక్స్‌గా పిలిచే ప్రత్యేక సాఫ్ట్‌వేర్స్ నిక్షిప్తం చేసే ఏర్పాటు చేస్తున్నారు.
- వీటిలో ఉండే ప్రొగ్రామ్స్ ఆధారంగా సర్వర్ అన్ని కెమెరాలను పర్యవేక్షిస్తూ, నిర్దేశిస్తుంటుంది.
- వన్ వేలతో పాటు ఇతర మార్గాల్లోనూ వ్యతిరేక దిశలో (రాంగ్‌రూట్)లో వస్తున్న వాహనాలను, నో పార్కింగ్, నో ఎంట్రీల్లోని వాహనాలను సాఫ్ట్‌వేర్ ఆధారంగా కెమెరాలు గుర్తిస్తాయి.
- ఆ విషయాన్ని తక్షణం సీసీసీలోని భారీ డిజిటల్ స్కీన్‌పై పాప్‌అప్ రూపంలో ఇచ్చి అక్కడి సిబ్బందిని అప్రమత్తం చేస్తాయి.
- పాప్‌అప్‌లో ఉండే వివరాల ఆధారంగా సమీపంలోని పోలీసుల్ని సీసీసీలోని సిబ్బంది అప్రమత్తం చేస్తారు.
- ఓ ప్రాంతంలో హఠాత్తుగా గలాభా చోటు చేసుకుని ఎక్కువ మంది ఓ చోట గుమిగూడినా, ఏదైనా ప్రమాదం చోటు చేసుకుని వాహనాలు ఆగిపోయినా ఇవి గుర్తిస్తాయి.
- నగరంలో నిర్దేశించిన ప్రాంతాల్లో ఏదైనా వస్తువు, వాహనం నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు ఆగి ఉన్నా... ఈ విషయం పాప్‌అప్ రూపంలో సీసీసీలోని సిబ్బందికి తెలుస్తుంది.
- రాత్రి వేళల్లో మూసివేసి ఉండే ప్రార్థనా స్థలాలు, నిర్మానుష్య ప్రాంతాల్లోకి ఎవరైనా ప్రవేశించినా ఆ విషయాన్ని కెమెరాలు తక్షణం గుర్తించి పాప్‌అప్ ఇస్తాయి.
- ఈ ఎనలటిక్స్‌లో శాంతిభద్రతల పర్యవేక్షణ, నేరాల నిరోధానికీ ఉపకరించేలా డిజైన్ చేస్తున్నారు.
కొలిక్కి వచ్చిన ‘కేస్ స్టడీస్’...
- అబిడ్స్ పరిధిలో ఆరు నెలల బాలుడుని దుండగులు అపహరించారు. సీసీ కెమెరాల్లోని ఫీడ్‌ను ఎన్‌హ్యాన్స్ చేసిన నేపథ్యంలో కిడ్నాపర్లు వాడిన ఆటో నెంబర్ తెలిసి దుండగులు చిక్కడంతో పాటు బాబు రెస్క్యూ అయ్యాడు.
- మారేడ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో తన ఆటోలో ప్రయాణించిన ప్రయాణికురాలి నుంచి నగలున్న బ్యాగ్‌ను ఆటోడ్రైవర్ అపహరించాడు. అనేక ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫీడ్‌ను అధ్యయనం చేసిన పోలీసులు కేసును కొలిక్కి తీసుకురాగలిగారు.
- దేశ వ్యాప్తంగా సంచలనంసృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అభయపై సామూహిక అత్యాచారం కేసు మాదాపూర్ పరిధిలో జరిగింది. సీసీ కెమెరాల్లో చిక్కిన ఫీడ్ ఆధారంగానే ఆమె ప్రయాణించిన కారును గుర్తించి నిందితుల్ని పట్టుకోగలిగారు.
- శంషాబాద్ మండలంలోని పెద్దగోల్కొండలో బందిపోటు దొంగతనం చోటు చేసుకుంది. బాధితుడి ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ ఆధారంగానే ఆ నేరం చేసింది పెద్దింటిగొల్ల గ్యాంగ్‌గా గుర్తించి, అరెస్టు చేశారు.


ప్రజల స్పందన మరువలేం:
నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటు విషయంలో మా పిలుపునకు స్పందించి, ప్రజలు ఇస్తున్న సహకారం మరువలేనిది. కేవలం వ్యాపార, వాణిజ్య వర్గాలే కాకుండా కాలనీలతో పాటు సామాన్య ప్రజలు సైతం ముందుకు వస్తున్నారు. ఎవరికి వారు తమ బాధ్యతగా భావించి వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని రకాలైన ప్రజలకు ఉపకరించే, నేరగాళ్లను కట్టడికి ఉపయుక్తమయ్యే సాంకేతిక పరిజ్ఞానాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. ఈ ఏడాది హైదరాబాద్ పోలీసులు 'ఇయర్ ఆఫ్ టెక్నాలజీ'గా మారుస్తాం.
- ఎం.మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ కొత్వాల్


అవగాహన కలిగించటంలో విజయవంతం:
నేరాల నిరోధించడం, కేసులు కొలిక్కి తీసుకురావడంతో సీసీ కెమెరాల పాత్ర కీలకంగా మారింది. వీటిని ఏర్పాటు చేసుకోవడం ఓ సామాజిక బాధ్యత అనే అంశాన్ని ప్రజల్లోకి సమర్థంగా తీసుకువెళ్ళడంలో విజయవంతమయ్యాం. ఈ కారణంగానే ఓపక్క పోలీసు విభాగం... మరోపక్క సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌తో పాటు ప్రజలూ ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కమిషనరేట్ వ్యాప్తంగా ఎక్కడిక్కడ మినీ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి పర్యవేక్షణ బాధ్యతల్లో ప్రజల్నీ భాగస్వాముల్ని చేస్తున్నాం.

- సీవీ ఆనంద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement