ఠాణా.. తందానా..అవినీతి మకిలీలో హైదరాబాద్‌ పోలీసులు | Cyberabad CP Stephen Raveendra Suspends Two Cops | Sakshi
Sakshi News home page

Hyderabad: ఠాణా.. తందానా..అవినీతి మకిలీలో ఖాకీలు

Published Mon, Oct 25 2021 8:12 AM | Last Updated on Mon, Oct 25 2021 8:31 AM

Cyberabad CP Stephen Raveendra Suspends Two Cops - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌/మణికొండ: బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులే భక్షిస్తున్నారు. కేసుల నమోదు, స్టేషన్ల బెయిల్, భూవివాదాలు, సినిమా షూటింగ్‌ అనుమతులు.. ఇలా పోలీసుల అవసరం ఉన్న ప్రతీ చోట వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆయా పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని ఏసీపీ, డీసీపీలూ తమకేమీ తెలియదన్నట్టు వ్యవహరిస్తుండటంతో బాధితులు నేరుగా పోలీస్‌ కమిషనర్లను ఆశ్రయిస్తున్నారు.

ఆరోపణలపై అంతర్గత విచారణ జరిపి సదరు పోలీసులను సస్పెండ్‌ చేస్తున్నా రు. తాజాగా సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని నార్సింగి ఠాణాలో ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐలపై  సీపీ స్టీఫెన్‌ రవీంద్ర సస్పెన్షన్‌ వేటు వేశారు. రెండ్రోజుల క్రితమే ఓ నేరస్తునితో జట్టు కట్టి డబ్బులు వసూలు చేసిన సరూర్‌నగర్‌ ఎస్‌ఐ సైదులును రాచకొండ సీపీ సస్పెన్షన్‌ చేసిన విషయం విదితమే.  
చదవండి: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. సిటీ బస్సు ఇక చిటికలో

పోస్టింగ్‌ల్లో మితిమీరిన రాజకీయ జోక్యం.. 
►ఒక్క పోస్టింగ్‌ దొరికితే చాలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా సంపాదిస్తున్నారనే విమర్శలున్నాయి. అవినీతి, అక్రమాలు బయటపడిన స్థానిక రాజకీయ నేతలు వారిని కాపాడుతున్నారనే ఆరోపణలున్నాయి.  
►రాజకీయ బలం ఉన్న ఇన్‌స్పెక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేక పోలీస్‌ ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఒకవేళ వేటు వేసినా.. తమకున్న రాజకీయ అండదండలతో వేరే చోట లేదా వేరే కమి షనరేట్‌లో పోస్టింగ్‌లు పొందుతున్నారు. నిజాయితీ గల అధికారులకు ఏళ్ల తరబడి ఎదురుచూసినా ఎస్‌హెచ్‌ఓ పోస్టింగ్‌ దక్కడంలేదు.  
►పోస్టింగ్‌ల విషయంలో మితిమీరిన రాజకీయ జోక్యం ఉందనే విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. తమకు నచ్చిన వారికే పోస్టింగ్‌లు ఇప్పిస్తుండటంతో పోలీస్‌ ఉన్నతాధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.
చదవండి: నేటి నుంచే ఇంటర్‌ పరీక్షలు.. ఓపిక ఉంటే అక్కడైనా రాయొచ్చు! 

సెటిల్‌మెంట్లలో.. భూ వివాదాలలో.. 
►నగరంలో రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ పెరగడంతో నేరస్తులతో దోస్తీ కట్టి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇన్‌స్పెక్టర్లు, సెక్టార్‌ ఎస్‌ఐలు కాసులు దండుకుంటున్నారు. 
►అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నార్సింగి పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ మధనం గంగాధర్, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌ఐ) కె. లక్ష్మణ్‌లను విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. 
►గతంలో వీరిద్దరిపై పలు భూ వివాదాలలో సెంటిల్‌మెంట్లు చేసినట్లు విచారణలో తేలింది. కొల్లూరు, జన్వాడ గ్రామాల సరిహద్దు భూ వివాదంలో తలదూర్చి సెటిల్‌మెంట్లకు పాల్పడినట్లు విచారణలో తేలింది. 

దోస్తీ కట్టి.. దొరికిపోయి..  
►రెండు రోజుల క్రితమే సరూర్‌నగర్‌ ఎస్‌ఐ బి.సైదులును రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ సస్పెండ్‌ చేశారు. ఓ కేసు దర్యాప్తులో భాగంగా నేరస్తుడితో సైదులుకు పరిచయం ఏర్పడింది. అనతికాలంలో ఇద్దరూ మంచి స్నేహితులుగా మారారు. 
►ఎస్‌ఐ కుటుంబంతో సహా కలిసి విజయవాడ విహారయాత్రకు వెళ్లాడు. ఆ సమయంలో నిందితుడు ఖరీదైన హోటల్‌లో బస ఏర్పాటు చేశాడు. రవాణా, భోజనం, ఇతరత్రా ఖర్చులను నేరస్తుడే భరించాడు. ఆయా బిల్లులన్నీ భద్రపరుచుకున్నాడు.  
►తిరిగి హైదరాబాద్‌కు వచ్చాక.. అధికారాన్ని వినియోగించుకొని తనను బెదిరించాడని సదరు నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఎస్‌ఐతో దిగిన ఫొటోలు, హోటల్‌ బిల్లులు తదితర ఆధారాలన్నీ జత చేశాడు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి.. చర్యలు తీసుకోవాలని సంబంధిత ఉన్నతాధికారులను ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. విచారణ జరిపిన సంబంధిత అధికారులు ఎస్‌ఐని సస్పెండ్‌ చేశారు. 

‘సమర్పించు’కోకపోతే అనుమతులివ్వరు.. 
►సినిమా షూటింగ్‌లకు పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే వారికి వసూళ్ల వేదికగా మారింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నా, సరైన పత్రాలు ఉన్నా.. పోలీసులకు ‘సమర్పించు’కోకపోతే అనుమతులు రావు. ఇలాంటి సంఘటనలు నార్సింగి, రాయదుర్గం పోలీస్‌ స్టేషన్ల పరిధిలో చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

►ఆయా పీఎస్‌ల పరిధిలో షూటింగ్‌లకు అనువైన ప్రదేశాలు చాలా ఉండటం వీరికి కలిసొచ్చే అంశం. అనుమతులు వచ్చినా, రాకపోయిన స్థానిక పోలీస్‌ స్టేషన్లలో సంప్రదించాల్సిందే. సెక్టార్‌ ఎస్‌ఐతో పాటు బీట్‌ కానిస్టేబుళ్లు, పెట్రోలింగ్‌ సిబ్బంది చేయి తడపనిదే సినిమా షూటింగ్‌ ముందుకు సాగని పరిస్థితి ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. 
►కేవలం లా అండ్‌ ఆర్డరే కాదు ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లలో సదరు అధికారులకు తడపనిదే పని జరగని పరిస్థితి. రాయదుర్గం పరిధిలోకి వచ్చే ఓ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ సినిమా నిర్మాతలకు బహిరంగంగానే వార్నింగ్‌ ఇచ్చినట్లు తెలిసింది. 

స్టేషన్‌ బెయిల్‌ కోసం లంచం.. 
గత నెల 21న స్టేషన్‌ బెయిల్‌ కోసం రూ.25 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు మహేశ్వరం పీఎస్‌ కానిస్టేబుల్‌ యాదయ్య. మహేశ్వరం మండలం పోరండ్ల గ్రామానికి చెందిన దయ్యాల బాల్‌రాజ్‌తో పాటు మరో అయిదుగురిపై భూ వివాదంలో మహేశ్వరం ఠాణాలో కేసు నమోదయింది. స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వడానికి కానిస్టేబుల్‌ యాదయ్య (ఎస్‌ఐ రైటర్‌) రూ.25 లక్షల డిమాండ్‌ చేశాడు. ఎస్‌ఐ శ్రీనివాస్‌ రెడ్డికి రూ.20 లక్షలు, తనకి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement