c v anand
-
బాధ్యతలు చేపట్టిన పెద్ది సుదర్శన్‌రెడ్డి
సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్‌కు మంత్రుల శుభాకాంక్షలు సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీని అంటిపెట్టుకుని కష్టనష్టాల్లో పనిచేసిన ప్రతీ ఉద్యమకారుడిని, కార్యకర్తను గుర్తుపెట్టుకుని సీఎం కేసీఆర్ అవకాశాలు కల్పిస్తున్నారని పలువురు మంత్రులు పేర్కొన్నారు. వరంగల్‌కు చెందిన పార్టీ సీనియర్‌నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి శనివారం రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సుదర్శన్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చురుకైన పాత్ర పోషించిన వారికి సీఎం సముచిత స్థానం కల్పిస్తున్నారని, అందులో భాగంగానే సీనియర్ నేత సుదర్శన్‌రెడ్డికి కీలకమైన పదవి లభించిందని, దీంతో సీఎం కేసీఆర్ ఉద్యమ నేతలకు సరైన గుర్తింపు ఇస్తారన్న సంగతిని రుజువు చేశారని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ ఆశించిన స్థాయిలో సంస్థను తీర్చి దిద్దాలని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, నిబద్దతతో పనిచేయాలని మంత్రి జగదీశ్‌రెడ్డి సూచిం చారు. ఉద్యమకారులను గుర్తుపెట్టుకుని సముచితస్థానం కల్పించడం ఆనందం కలిగిస్తోందని, మొదటి నుంచీ పనిచేసిన వారికి తప్పక అవకాశాలు వస్తాయని ఎంపీ కవిత అన్నారు. డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, చందూలాల్, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు బి.వినోద్‌కుమార్, సుమన్, సీతారాంనాయక్, సివిల్ సప్లైస్ కమిషనర్ సీవీ ఆనంద్ పాల్గొన్నారు. -
ఐపీఎల్ మ్యాచ్‌లకు భారీ భద్రత
ఉప్పల్ స్టేడియంలో జరగబోయే ఐపీఎల్ మ్యాచ్‌లకు భారీ భద్రత కల్పించనున్నట్లు సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ నెల 16, 18, 23, 26, 30 మే 6, 12 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయని ఆయన చెప్పారు. మొత్తం రెండువేల మంది సిబ్బందిని భద్రతకు వినియోగించుకోనున్నట్లు వెల్లడించారు. ఇందులో 1,129 సిటీ పోలీసులతోపాటు 270 ట్రాఫిక్, 2 అక్టోపస్ బృందాలు, 5 ప్లటూన్ల సాయుధ దళాలు, వివిధ విభాగాలకు చెందిన 250 మంది, ఫైర్ సిబ్బంది రెండు బృందాలు, ప్రైవేటు సెక్యూరిటీ సంస్థల నుంచి 200 మంది ఇందులో ఉంటారని వివరించారు. -
నేరగాళ్లపై నిత్యం నిఘా నేత్రం
- జంట కమిషనరేట్లలో వేల సీసీ కెమెరాలు - కమ్యూనిటీ భాగస్వామ్యంతోనూ ఏర్పాటు - ఆధునిక సాఫ్ట్వేర్స్ అనుసంధానిస్తున్న వైనం హైదరాబాద్ జంట కమిషనరేట్ల పరిధిలో పోలీసు విభాగం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సంఖ్య 500... ప్రజా భద్రతా చట్టం అమలులోకి వచ్చిన తరవాత పోలీసులు తీసుకున్న చర్యల ఫలితంగా కమ్యూనిటీల వారీగా ఏర్పాటైనవి ఐదు వేల పైనే. వీటన్నింటినీ ఆయా కమిషనరేట్లలో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్‌కు (సీసీసీ) అనుసంధానం చేశారు. ఫలితంగా నిఘా పెరగడమే కాదు.. అనేక కీలక కేసులు కొలిక్కి రావడంలోనూ ఉపకరించాయి. ఈ కెమెరా వ్యవస్థకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సైతం జోడించే పనిలో ఉన్నారు హైదరాబాద్, సైబరాబాద్ అధికారులు. ఏమాత్రం 'తేడా' రాకుండా చర్యలు... 2014లో అమలులోకి వచ్చిన ప్రజా భద్రతా చట్టాన్ని కమిషనరేట్ల అధికారులు పక్కాగా అమలు చేస్తున్నారు. వ్యాపార సముదాయాలు, వాణిజ్య ప్రాంతాల్లో వ్యక్తిగతంగా, కమ్యూనిటీ మొత్తం కలిసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడాన్ని కచ్చితం చేశారు. పోలీసుస్టేషన్ల వారీగా బాధ్యతలు అప్పగించిన కమిషనర్లు... ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు వీటి ఆవశ్యకతనూ వివరిస్తూ ఎవరివారు ముందుకు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఏర్పాటవుతున్న కమ్యూనిటీ కెమెరాలను ఎవరికి నచ్చిన మోడల్, సామర్థ్యం కలిగినని వారు ఏర్పాటు చేసుకుంటే సీసీసీతో అనుంధానం, పర్యవేక్షణలో ఇబ్బందులు ఎదురవుతాయి. అలా కాకుండా యూనిఫామిటీ కోసమూ పోలీసులు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసు విభాగమే ప్రముఖ కంపెనీతో సంప్రదింపులు జరిపింది. సీసీ కెమెరాలకు ఉండాల్సిన స్పెసిఫికేషన్స్‌ను నిర్దేశించి అంతా వాటినే ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకుంటోంది. దీంతో అన్నీ ఒకే రకమైన కెమెరాలు సమకూరుతున్నాయి. అవి ఇవీ అన్నీ కలిపేస్తూ... ఇప్పటికే జంట కమిషనరేట్లలో పోలీసు, ట్రాఫిక్ విభాగాలు ఏర్పాటు చేసిన కెమెరాలు సీసీసీతో అనుసంధానించి ఉన్నాయి. వీటి సంఖ్య పరిమితం కావడంతో అన్నిచోట్లా నిఘా సాధ్యం కావట్లేదు. దీన్ని పరిగణలోకి తీసుకున్న ఉన్నతాధికారులు ఓ వ్యాపార సముదాయం, వాణిజ్య కూడళ్ళతో పాటు దుకాణాల్లోనూ ఏర్పాటు చేస్తున్న వాటినీ సీసీసీతో అనుసంధానిస్తున్నారు. దుకాణం లోపల భాగం మినహా బయటకు ఉన్న కెమెరాలు, కాలనీలు, పబ్లిక్‌ప్లేసుల్లో ఉన్న అన్నింటినీ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా సీసీసీలతో అనుసంధానిస్తున్నారు. దీంతో పోలీసు విభాగానికి చెందిన కెమెరాలూ ప్రధానంగా ట్రాఫిక్ కోణంలో ఉన్నా... అనుసంధానించినవి నిఘా, శాంతిభద్రతల పర్యవేక్షణకు ఉపకరిస్తున్నాయి. రానున్న రెండేళ్ళల్లో జంట కమిషనరేట్లతో పోలీసు, కమ్యూనిటీ అన్ని కలిపి లక్ష సీసీ కెమెరాలు ఉండాలన్న లక్ష్యంతో ఇరు కమిషనర్లు ముందుకు వెళ్తున్నారు. ఈ కలసాకారమైతే అలాంటి నిఘాతో కూడిన నగరంగా సిటీ దేశంలోనే ప్రముఖ స్థానాన్ని ఆక్రమించనుంది. పర్యవేక్షణకూ సాంకేతిక పరిజ్ఞానం... ఇప్పటికు ఈ కెమెరాల ద్వారా రికార్డు అవుతున్న ఫీడ్ అనేక కేసుల్ని కొలిక్కి తీసుకురావడంతో ఉపకరిస్తోంది. దీనికోసం ఈ వీడియోలను సమర్థంగా అభివృృద్ధి చేయడానికి ఎన్‌హ్యాన్స్‌మెంట్ సాఫ్ట్వేర్స్ వాడుతున్నారు. రానున్న రోజుల్లో మరికొన్ని రకాలైన వాటినీ అమలులోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. నగరంలో వేల సంఖ్యలో ఉన్న కెమెరాలను సీసీసీ ఉండే పరిమిత సిబ్బంది నిత్యం పర్యవేక్షించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే దీనికోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు రెండో దశలో పటిష్ట నిఘా కోసం ఎనలటిక్స్‌గా పిలిచే సాఫ్ట్వేర్స్ అభవృద్ధి చేస్తున్నారు. అవి ఎలా పని చేస్తాయంటే... - నగరంలోని అన్ని కెమెరాలు అనుసంధానించి ఉండే సీసీసీలోని సర్వర్‌ను కంప్యూటర్లకు అనుసంధానిస్తారు. - ఈ సర్వర్లలో ఎనలటిక్స్‌గా పిలిచే ప్రత్యేక సాఫ్ట్వేర్స్ నిక్షిప్తం చేసే ఏర్పాటు చేస్తున్నారు. - వీటిలో ఉండే ప్రొగ్రామ్స్ ఆధారంగా సర్వర్ అన్ని కెమెరాలను పర్యవేక్షిస్తూ, నిర్దేశిస్తుంటుంది. - వన్ వేలతో పాటు ఇతర మార్గాల్లోనూ వ్యతిరేక దిశలో (రాంగ్‌రూట్)లో వస్తున్న వాహనాలను, నో పార్కింగ్, నో ఎంట్రీల్లోని వాహనాలను సాఫ్ట్వేర్ ఆధారంగా కెమెరాలు గుర్తిస్తాయి. - ఆ విషయాన్ని తక్షణం సీసీసీలోని భారీ డిజిటల్ స్కీన్‌పై పాప్అప్ రూపంలో ఇచ్చి అక్కడి సిబ్బందిని అప్రమత్తం చేస్తాయి. - పాప్అప్లో ఉండే వివరాల ఆధారంగా సమీపంలోని పోలీసుల్ని సీసీసీలోని సిబ్బంది అప్రమత్తం చేస్తారు. - ఓ ప్రాంతంలో హఠాత్తుగా గలాభా చోటు చేసుకుని ఎక్కువ మంది ఓ చోట గుమిగూడినా, ఏదైనా ప్రమాదం చోటు చేసుకుని వాహనాలు ఆగిపోయినా ఇవి గుర్తిస్తాయి. - నగరంలో నిర్దేశించిన ప్రాంతాల్లో ఏదైనా వస్తువు, వాహనం నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు ఆగి ఉన్నా... ఈ విషయం పాప్అప్ రూపంలో సీసీసీలోని సిబ్బందికి తెలుస్తుంది. - రాత్రి వేళల్లో మూసివేసి ఉండే ప్రార్థనా స్థలాలు, నిర్మానుష్య ప్రాంతాల్లోకి ఎవరైనా ప్రవేశించినా ఆ విషయాన్ని కెమెరాలు తక్షణం గుర్తించి పాప్అప్ ఇస్తాయి. - ఈ ఎనలటిక్స్‌లో శాంతిభద్రతల పర్యవేక్షణ, నేరాల నిరోధానికీ ఉపకరించేలా డిజైన్ చేస్తున్నారు. కొలిక్కి వచ్చిన ‘కేస్ స్టడీస్’... - అబిడ్స్ పరిధిలో ఆరు నెలల బాలుడుని దుండగులు అపహరించారు. సీసీ కెమెరాల్లోని ఫీడ్‌ను ఎన్‌హ్యాన్స్ చేసిన నేపథ్యంలో కిడ్నాపర్లు వాడిన ఆటో నెంబర్ తెలిసి దుండగులు చిక్కడంతో పాటు బాబు రెస్క్యూ అయ్యాడు. - మారేడ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో తన ఆటోలో ప్రయాణించిన ప్రయాణికురాలి నుంచి నగలున్న బ్యాగ్‌ను ఆటోడ్రైవర్ అపహరించాడు. అనేక ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫీడ్‌ను అధ్యయనం చేసిన పోలీసులు కేసును కొలిక్కి తీసుకురాగలిగారు. - దేశ వ్యాప్తంగా సంచలనంసృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అభయపై సామూహిక అత్యాచారం కేసు మాదాపూర్ పరిధిలో జరిగింది. సీసీ కెమెరాల్లో చిక్కిన ఫీడ్ ఆధారంగానే ఆమె ప్రయాణించిన కారును గుర్తించి నిందితుల్ని పట్టుకోగలిగారు. - శంషాబాద్ మండలంలోని పెద్దగోల్కొండలో బందిపోటు దొంగతనం చోటు చేసుకుంది. బాధితుడి ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ ఆధారంగానే ఆ నేరం చేసింది పెద్దింటిగొల్ల గ్యాంగ్‌గా గుర్తించి, అరెస్టు చేశారు. ప్రజల స్పందన మరువలేం: నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటు విషయంలో మా పిలుపునకు స్పందించి, ప్రజలు ఇస్తున్న సహకారం మరువలేనిది. కేవలం వ్యాపార, వాణిజ్య వర్గాలే కాకుండా కాలనీలతో పాటు సామాన్య ప్రజలు సైతం ముందుకు వస్తున్నారు. ఎవరికి వారు తమ బాధ్యతగా భావించి వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని రకాలైన ప్రజలకు ఉపకరించే, నేరగాళ్లను కట్టడికి ఉపయుక్తమయ్యే సాంకేతిక పరిజ్ఞానాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. ఈ ఏడాది హైదరాబాద్ పోలీసులు 'ఇయర్ ఆఫ్ టెక్నాలజీ'గా మారుస్తాం. - ఎం.మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ కొత్వాల్ అవగాహన కలిగించటంలో విజయవంతం: నేరాల నిరోధించడం, కేసులు కొలిక్కి తీసుకురావడంతో సీసీ కెమెరాల పాత్ర కీలకంగా మారింది. వీటిని ఏర్పాటు చేసుకోవడం ఓ సామాజిక బాధ్యత అనే అంశాన్ని ప్రజల్లోకి సమర్థంగా తీసుకువెళ్ళడంలో విజయవంతమయ్యాం. ఈ కారణంగానే ఓపక్క పోలీసు విభాగం... మరోపక్క సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌తో పాటు ప్రజలూ ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కమిషనరేట్ వ్యాప్తంగా ఎక్కడిక్కడ మినీ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి పర్యవేక్షణ బాధ్యతల్లో ప్రజల్నీ భాగస్వాముల్ని చేస్తున్నాం. - సీవీ ఆనంద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ -
స్నేక్ గ్యాంగ్ దయానీ సోదరులు అరెస్ట్
-
స్నేక్ గ్యాంగ్ దయానీ సోదరులు అరెస్ట్
హైదరాబాద్: నేరస్థుల్లో భయం కల్పించేందుకే పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలోని సాయినగర్‌లో గత అర్థరాత్రి నుంచి సోదాలు నిర్వహించినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. దాదాపు 420 మంది పోలీసులతో 800 నివాసాలను సోదా చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా పాములతో బెదిరించి మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న స్నేక్ గ్యాంగ్ ప్రధాన నిందితుడు దయానీ ఇంట్లో సోదా చేసినట్లు తెలిపారు. దయానీ సోదరులు అమీద్, కాలీజ్తోపాటు మరో ఐదుగురు అనుచరులను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. స్నేక్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న కొంతమందిని గుర్తించామని చెప్పారు. వారిని సాధ్యమైనంత త్వరలో పట్టుకుంటామన్నారు. స్నేక్‌గ్యాంగ్ కేసులో ఇప్పటివరకు ఐదు ఫిర్యాదులు అందాయన్నారు. -
మహిళల భద్రత కోసం పంచసూత్ర ప్రణాళిక
సైబరాబాద్, న్యూస్‌లైన్: మహిళల భద్రత కోసం పంచసూత్ర ప్రణాళికను అమలు చేస్తున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. కమిషనరేట్ ఆవరణలో శుక్రవారం ఆయన ‘మై వెహికిల్ ఈజ్ సేఫ్‘ స్టికర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆనంద్ మాట్లాడుతూ...అభయ ఘటన అనంతరం అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సైబరాబాద్ పరిధిలో తిరిగే క్యాబ్‌ల యజమానులు, డ్రైవర్లు తమ పూర్తి వివరాలను పోలీసుల వద్ద నమోదు చేసుకోవాలని మార్చి 1న నోటిఫికేషన్‌ను జారీ చేశామన్నారు. దీనికి స్పందించి 2 వేల మంది తమ వివరాలను పొందుపర్చుకున్నారని, వీరందరికీ ‘మై వెహికిల్ ఈస్ సేఫ్’ స్టికర్ అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జాయింట్ సీపీ గంగాధర్, ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతి పాల్గొన్నారు. నమోదు చేసుకోని వారికి జరిమానా... కమిషనరేట్ పరిధిలో 10 వేల క్యాబ్‌ల వరకు తిరుగుతున్నట్టు గుర్తించామని, వీటిలో 2 వేల మంది మాత్రమే తమ వివరాలు పోలీసుల వద్ద నమోదు చేసుకున్నారని కమిషనర్ ఆనంద్ తెలిపారు. రిజిస్ట్రేషన్ గడువు మే 1తో ముగిసిందని, వివరాలు నమోదు చేసుకొని క్యాబ్‌లకు రూ. 500 జరిమానా విధిస్తామన్నారు. సోమవారం నుంచి శనివారం వరకు.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య కూకట్పల్లి ట్రాఫిక్ ఠాణాలో క్యాబ్ డ్రైవర్లు తమ వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు. స్టిక్కర్లో పూర్తి వివరాలు.... సైబరాబాద్ పోలీసులు జారీ చేస్తున్న ‘మై వెహికిల్ ఈజ్ సేఫ్’ స్టిక్కర్లో క్యూ ఆర్ కోడ్ (క్విక్ రె స్పాన్స్ కోడ్). అందులో క్యాబ్ యజమాని, డ్రైవర్ వివరాలు, క్యాబ్‌కు సంబంధించిన పత్రాల పూర్తి వివరాలు ఉంటాయి. స్టికర్‌పై వాహనం, దానికి కేటాయించిన ఐడీ నెంబర్లను పెద్ద అక్షరాల్లో ప్రింట్ చేశారు. ఈ స్టికర్ల గడువు ఏడాది ఉంటుంది. ఆపై రెన్యూవెల్ చేసుకోవాలి. స్టిక్కర్ ఉన్న వాహనాల్లోనే ప్రయాణించాలి... సైబరాబాద్ పరిధిలో క్యాబ్‌ల్లో ప్రయాణించే మహిళలు, యువతులు, ఐటీ ఉద్యోగినిలు ‘మై వెహికిల్ ఈజ్ సేఫ్’ స్టికర్ ఉన్న వాటిలోనే వెళ్లాలని కమిషనర్ కోరారు. క్యాబ్ ఎక్కే ముందు స్టికర్‌పై ఉన్న వివరాలు తప్పనిసరిగా రాసి పెట్టుకోవాలన్నారు. కాగా, ఓ క్యాబ్ డ్రైవర్- ‘సార్....మేం తప్పు చేస్తే యాక్షన్ తీసుకుంటున్నారు సరే....మమ్మల్ని క్యాబ్‌లో ఎక్కిన ప్రయాణికులు వేధిస్తే ఏం చేయాలని అని ప్రశ్నించాడు. దీంతో ఒక్కసారిగా అందరూ నవ్వారు. ఫిర్యాదు చేస్తే ఆ ప్రయాణికుడిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ బదులిచ్చారు. -
‘నా వాహనం సురక్షితం’ క్యాబ్‌లోనే ప్రయాణించండి
మార్చి 1 నుంచి క్యాబ్‌లకు పోలీసు రిజిస్ట్రేషన్ నంబర్లు.... లేదంటే వాహనం సీజ్ సాక్షి, సిటీబ్యూరో: హైటెక్ సిటీలో తిరిగే ప్రతి క్యాబ్ కూడా పోలీసుల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రత్యేక నంబర్‌ను పొందాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 1 నుంచి పోలీసు రిజిస్ట్రేషన్ మొదలవుతుందని అందులో పేర్కొన్నారు. ఈ సందర్భం గా కమిషనర్ కార్యాలయంలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్యాబ్‌ల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి వివరాలను ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతి వివరించారు. పోలీసులు జారీ చేసే నా వాహనం సురక్షితం అనే స్టిక్కర్ ఉన్న క్యాబ్‌లోనే మహిళా ఉద్యోగులు ప్రయాణించాలని ఆయన సూచించారు. పోలీసు రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా తిరిగే క్యాబ్‌లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ అదనపు డీసీపీ పులిందర్రెడ్డి, సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రధాన కా ర్యదర్శి శ్రీనివాస్‌రెడ్డిలు పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ ఇలా... ఐటీ కారిడార్‌లోని ఉద్యోగులను తరలించే ప్రతి క్యాబ్ పోలీసు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇందుకోసం వాహనం, డ్రైవర్, యజమాని వివరాలు నింపేందుకు ప్రత్యేక ఫారాలను తయారు చేశారు. వాహనం రిజిస్ట్రేషన్ కాగితాలు, ఫిట్నెస్, పొల్యుషన్, ఇన్సూరెన్స్ కాగితాలు సమర్పించాలి. అలాగే డ్రైవర్ వివరాల కోసం అతని ఫోటో, చిరునామా తెలిపే రేషన్, ఓటర్, ఆధార్‌లో ఏదైనా ఒక కార్డు, సెల్‌నంబర్ ఇవ్వాలి. ఇక వాహన యజమాని వివరాలకై చిరునామా తెలిపే ఏదేని ప్రభుత్వ కార్డు, సెల్‌నంబర్ ఇవ్వాల్సి ఉంది. ఫారాలు కూకట్పల్లి ట్రాఫిక్ ఠాణాలో లభిస్తాయి. మార్చి 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతుంది. ప్రతి ఏటా క్యాబ్‌లు పోలీసుల వద్ద రెన్యూవల్ చేయించుకోవాలి.రిజిస్ట్రేషన్ కోసం రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. క్యాబ్ వివరాలు క్షణాల్లో... క్యాబ్‌లకు పోలీసులు ప్రత్యేకంగా క్యూర్ నంబర్‌ను కేటాయిస్తారు. డ్రైవర్ ఫోటో, వివరాలతో కూడిన స్టిక్కర్‌ను వాహనం లోపల, బయటి వ్యక్తులకు కనిపించేలా అతికించాలి. స్టిక్కర్లో ఉన్న కోడ్ నంబర్‌ను మొబైల్ యాప్ ద్వారా ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ సెల్‌నంబర్ 8500411111కు ఎస్ఎంఎస్ చేస్తే క్షణాల్లో వాహనం, డ్రైవర్ పూర్తి వివరాలు అందుతాయి. ఇలా పోలీసుల వద్ద రిజిస్ట్రేషన్ అయిన క్యాబ్‌ల వివరాలన్నీ త్వరలో ట్రాఫిక్ పోలీసు వెబ్సెట్లో పొందుపరుస్తారు. దాంతో క్యాబ్ డ్రైవర్లు నేరాలకు పాల్పడరని అధికారులు ఆశిస్తున్నారు. -
ఏటీఎంల వద్ద గార్డులుండాల్సిందే : సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: బెంగళూరులోని ఓ బ్యాంకు ఏటీఎంలో మహిళపై దుండగుడు దాడి చేసిన ఘటనపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తీవ్రంగా స్పందించారు. సైబరాబాద్ పరిధిలో సెక్యూరిటీ గార్డులు లేని అన్ని ఏటీఎంల మూసివేతకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్హెచ్ఓ (పోలీస్ ఇన్స్పెక్టర్)లకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి సెంటర్ వద్ద 24 గంటల పాటు సెక్యూరిటీ ఉండే విధంగా గార్డులను నియమించుకోవాలని బ్యాంకు అధికారులకు సూచించారు. అలాగే సీసీ కెమెరాలు కూడా నిత్యం పనిచేసే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు కనీసం వారం రోజుల పాటు ఫుటేజ్‌లను భద్రపరిచేలా జాగ్రత్త వహించాలని కోరారు. ఏటీఎం లోనికి ఎప్పుడైనా కేవలం ఒక్కరు మాత్రమే వెళ్లేలా చూడాలన్నారు. ఒకరు లోపలికి వెళ్లి బయటికి వచ్చిన తరువాతనే మరోవ్యక్తి లోనికి వెళ్లేలా డోర్ వద్ద ప్రత్యేక సిస్టంను ఏర్పాటు చేయాలన్నారు. వీటిలో ఏ ఒక్కటి ఏర్పాటు చేయకున్నా అలాంటి ఏటీఎంను మూసివేస్తామని కమిషనర్ హెచ్చరించారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్, శంషాబాద్, మల్కాజిగిరి, బాలనగర్, మాదాపూర్ జోన్లలో వివిధ బ్యాంకులకు చెందిన మొత్తం 1,038 ఏటీఎం సెంటర్లను గుర్తించారు. కొన్నిచోట్ల సెక్యూరిటీ గార్డులు ఉన్నా మరికొన్ని చోట్ల సెక్యూరిటీ లోపాలు స్పష్టంగా కనిపించాయి. ప్రతిరోజూ ఒక్కో ఏటీఎం సెంటర్ నుంచి లక్షలాది రూపాయల మేరకు లావాదేవీలు కొనసాగుతున్నా భద్రతాచర్యలు నామమాత్రంగా ఉన్నాయని కమిషనర్ పేర్కొన్నారు. సెక్యూరిటీ గార్డు లేనందువల్లనే బెంగళూరు ఘటన చోటుచేసుకుందని చెప్పారు. కమిషనర్ ఉత్తర్వులోని ముఖ్యాంశాలు ప్రతి ఏటీఎం సెంటర్లో 24 గంటల పాటు ప్రత్యేక శిక్షణ పొందిన సెక్యూరిటీ గార్డు ఉండాలి సెక్యూరిటీ గార్డు వద్ద తప్పనిసరిగా సెల్‌ఫోన్ ఉండేలా చర్యలు తీసుకోవాలి పోలీసుస్టేషన్ల నంబర్లు వారికి అందుబాటులో ఉంచాలి అత్యంత నాణ్యమైన సీసీ కెమెరాలను నిత్యం పనిచేసేలా ఏర్పాటు చేయాలి ఏటీఎంలో రికార్డైన ఫుటేజీలను నిత్యం పరిశీలించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి ఏటీఎం కార్డు పెడితేనే డోర్ తెరుచుకునే విధంగా చర్యలు తీసుకోవాలి