
ఏటీఎంల వద్ద గార్డులుండాల్సిందే : సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: బెంగళూరులోని ఓ బ్యాంకు ఏటీఎంలో మహిళపై దుండగుడు దాడి చేసిన ఘటనపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తీవ్రంగా స్పందించారు. సైబరాబాద్ పరిధిలో సెక్యూరిటీ గార్డులు లేని అన్ని ఏటీఎంల మూసివేతకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్‌హెచ్‌ఓ (పోలీస్ ఇన్‌స్పెక్టర్)లకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి సెంటర్ వద్ద 24 గంటల పాటు సెక్యూరిటీ ఉండే విధంగా గార్డులను నియమించుకోవాలని బ్యాంకు అధికారులకు సూచించారు. అలాగే సీసీ కెమెరాలు కూడా నిత్యం పనిచేసే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు కనీసం వారం రోజుల పాటు ఫుటేజ్‌లను భద్రపరిచేలా జాగ్రత్త వహించాలని కోరారు.
ఏటీఎం లోనికి ఎప్పుడైనా కేవలం ఒక్కరు మాత్రమే వెళ్లేలా చూడాలన్నారు. ఒకరు లోపలికి వెళ్లి బయటికి వచ్చిన తరువాతనే మరోవ్యక్తి లోనికి వెళ్లేలా డోర్ వద్ద ప్రత్యేక సిస్టంను ఏర్పాటు చేయాలన్నారు. వీటిలో ఏ ఒక్కటి ఏర్పాటు చేయకున్నా అలాంటి ఏటీఎంను మూసివేస్తామని కమిషనర్ హెచ్చరించారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్, శంషాబాద్, మల్కాజిగిరి, బాలనగర్, మాదాపూర్ జోన్‌లలో వివిధ బ్యాంకులకు చెందిన మొత్తం 1,038 ఏటీఎం సెంటర్లను గుర్తించారు. కొన్నిచోట్ల సెక్యూరిటీ గార్డులు ఉన్నా మరికొన్ని చోట్ల సెక్యూరిటీ లోపాలు స్పష్టంగా కనిపించాయి. ప్రతిరోజూ ఒక్కో ఏటీఎం సెంటర్ నుంచి లక్షలాది రూపాయల మేరకు లావాదేవీలు కొనసాగుతున్నా భద్రతాచర్యలు నామమాత్రంగా ఉన్నాయని కమిషనర్ పేర్కొన్నారు. సెక్యూరిటీ గార్డు లేనందువల్లనే బెంగళూరు ఘటన చోటుచేసుకుందని చెప్పారు.
కమిషనర్ ఉత్తర్వులోని ముఖ్యాంశాలు
ప్రతి ఏటీఎం సెంటర్‌లో 24 గంటల పాటు ప్రత్యేక శిక్షణ పొందిన సెక్యూరిటీ గార్డు ఉండాలి సెక్యూరిటీ గార్డు వద్ద తప్పనిసరిగా సెల్‌ఫోన్ ఉండేలా చర్యలు తీసుకోవాలి పోలీసుస్టేషన్ల నంబర్లు వారికి అందుబాటులో ఉంచాలి
అత్యంత నాణ్యమైన సీసీ కెమెరాలను నిత్యం పనిచేసేలా ఏర్పాటు చేయాలి
ఏటీఎంలో రికార్డైన ఫుటేజీలను నిత్యం పరిశీలించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి ఏటీఎం కార్డు పెడితేనే డోర్ తెరుచుకునే విధంగా చర్యలు తీసుకోవాలి