అవసరమైతే 40 రోజులు చర్చిస్తాం:కేసీఆర్
హైదరాబాద్ : శాసనసభలో అన్ని సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే రైతు సమస్యలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. అయితే స్పీకర్ మధుసుదనా చారి ముందుగా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. బీఏసీ నిర్ణయం ప్రకారం ప్రశ్నోత్తరాలు చేపట్టిన తర్వాత మిగతా అంశాలపై చర్చిద్దామని స్పీకర్ సూచించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని ఏ సమస్యపైన అయినా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విపక్షాలు ఆందోళన చేయటం తగదన్నారు. రైతుల ఆత్మహత్యలపై కూడా చర్చిస్తామని... ఇదే పద్ధతి అనుకుంటే ఏమీ చేయలేమన్నారు. వారం...పది రోజులు కాదని... అవసరం అయితే 40 రోజుల పాటు అన్ని సమస్యలు చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమన్నారు.
చర్చకు తాము సిద్ధమన్నా విపక్షాలు తీరు మార్చుకోకుంటే ...వారి విజ్ఞతకే వదిలేస్తామన్నారు. అయినా విపక్షాలు తమ పట్టువీడలేదు. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాంతో సభా కార్యక్రమాలకు అంతరాయం కలగటంతో స్పీకర్ అసెంబ్లీని పదినిమిషాల పాటు వాయిదా వేశారు.