చేవెళ్ల: రంగారెడ్డి జిల్లాతోపాటు మరో రెండు జిల్లాలకు తాగునీరు, సాగునీటిని అందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక కేజీఆర్ గార్డెన్‌లో సోమవారం నియోజకవర్గ టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాన్ని మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సర్వేకు ముఖ్యమంత్రి నిధులను విడుదల చేశారని, ఇది పూర్తికాగానే ప్రాజెక్టుకు అనుమతి లభిస్తుందన్నారు. చేవెళ్ల, శంకర్‌పల్లి, మొయినాబాద్‌లలో బస్‌డిపోల నిర్మాణానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. సమగ్ర సర్వేకు అందరూ సహకరించాలన్నారు.
తెలంగాణకు ఎయిమ్స్: ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
కేంద్ర ప్రభుత్వం తొలి బడ్జెట్‌లో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎయిమ్స్ (ఆలిండియా మెడికల్ సెన్సైస్)ను ఏర్పాటు చేసిందని, రానున్న బడ్జెట్‌లో తెలంగాణకు కూడా ఎయిమ్స్ ఇచ్చే అవకాశం ఉందని చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ విషయంపై టీఆర్‌ఎస్ ఎంపీలమంతా ఇప్పటికే కేంద్రమంత్రులను కలిసి విన్నవించామని, వారు సానుకూలంగా స్పందించారన్నారు. ఈ భారీ ఆసుపత్రిని చేవెళ్లలోనే ఏర్పాటుచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విన్నవించానన్నారు.
ఇందుకు 200 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని, రూ.1200 కోట్ల వ్యయంతో ఈ ఆస్పత్రి ఏర్పాటు కానుందని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే రత్నం, పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, జిల్లా అధ్యక్షురాలు స్వప్న, రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం మాజీ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి, నియోజకవర్గంలోని పార్టీ మండల అధ్యక్షులు సామ మాణిక్‌రెడ్డి, మల్లేష్, నర్సింహులు తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఎస్.వసంతం, సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు మధుసూదన్‌గుప్తా, జిల్లా నాయకుడు వై.శ్రీరాంరెడ్డి, కొలన్ ప్రభాకర్‌రెడ్డి, రమేష్, సత్యనారాయణ, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతలకు గ్రీన్‌సిగ్నల్
Published Mon, Aug 18 2014 11:56 PM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement