
సాక్షి, హైదరాబాద్
పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. 2018 మార్చి 15 నుంచి 31వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ప్రభుత్వం ఆమోదించిన పరీక్షల షెడ్యూలును గురువారం ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించింది. గతేడాదిలాగే ఈసారి కూడా ఓరియంటల్ ఎస్సెస్సీ భాషా పేపర్లు, ఒకేషనల్ ఎస్సెస్సీకి సంబంధించిన పేపర్ల పరీక్షలను ముందుగా నిర్వహించి, తర్వాత ప్రధాన టెన్త్ సబ్జెక్టుల పరీక్షలను నిర్వహించేలా టైం టేబుల్ రూపొందించారు. మార్చి 15 నుంచి 17 వరకు ఓరియంటల్ ఎసెస్సీ, ఓఎస్సెస్సీ, ఒకేషనల్ కోర్సుల పరీక్షలు, 19 నుంచి ప్రధాన టెన్త్ పరీక్షలు నిర్వహించేలా షెడ్యూలు ఖరారు చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సుధాకర్ తెలిపారు. ఆబ్జెక్టివ్ పేపరును పరీక్షాసమయం చివరి అరగంటలో ఇస్తారని పేర్కొన్నారు.