
బడికి ‘ప్రైవేటు’ గండం!
* విద్యా హక్కు చట్టమే సర్కారీ స్కూళ్లకు గొడ్డలిపెట్టు
* ‘ప్రైవేటు’లో ఉచిత విద్య నిబంధనతో శరాఘాతం
* పేద పిల్లలకు 25% సీట్లు కేటాయించాలంటున్న చట్టం
* వారికి రాష్ట్ర సర్కారు ఫీజు రీయింబర్స్‌మెంట్
* అమలుకు కేంద్రం ఒత్తిడి.. కొత్త విధానంపై కసరత్తు
* ఒకే ప్రాంతంలోని సర్కారీ స్కూళ్లను కలిపేసే యోచన
* ఇప్పటికే ప్రభుత్వ బడుల్లో పడిపోతున్న విద్యార్థుల సంఖ్య
* ‘ప్రైవేటు’ గండంపై ఉపాధ్యాయ సంఘాల్లో ఆందోళన
సర్కారీ స్కూళ్లకు మరో మప్పు ముంచుకొచ్చింది! పాలకుల నిర్లక్ష్యానికి తోడు పడిపోతున్న విద్యార్థుల శాతంతో సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రభుత్వ పాఠశాలలకు విద్యాహక్కు చట్టమే శాపంగా మారింది. ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం విద్యార్థులకు ఉచిత విద్య అందించాలన్న నిబంధనే శరాఘాతం కానుంది. ఈ ‘ప్రైవేటు’ గండంతో ప్రభుత్వ పాఠశాలల మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముంది. ప్రైవేటు స్కూళ్లలో 25% సీట్లను పేద విద్యార్థులకు కేటాయించి, వారికి ఉచిత విద్యను(రీయింబర్స్‌మెంట్ ద్వారా) అందించాలన్న విద్యాహక్కు చట్టం నిబంధన అమలైతే ఉపద్రవం తప్పదు. ప్రైవేటును ప్రోత్సహించేలా ఉన్న ఈ విధానంతో సర్కారీ స్కూళ్లు మూతపడే ప్రమాదముంది. విద్యా హక్కు చట్టంలోని ఆ నిబంధనను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని కేంద్రం నుంచి ఒత్తిడి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తోంది. ప్రైవేట్ స్కూళ్లలో పేద పిల్లలకు రీయింబర్స్‌మెంట్‌తో ఉచిత విద్యను అందించే విధానంపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు కొత్త నిబంధనల రూపకల్పనపై రాష్ర్ట ప్రభుత్వం దృష్టిసారించింది.
- సాక్షి, హైదరాబాద్
ప్రైవేటులో 25% ఉచిత సీట్లు
విద్యా హక్కు చట్టం-2010లోని సెక్షన్ 12(సి) ప్రకారం ప్రైవేటు స్కూళ్లలోని 25 శాతం సీట్లను పేద పిల్లలకు కేటాయించాలి. వికలాంగులు, అనాథలు, హెచ్‌ఐవీ బాధిత విద్యార్థులకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, రూ. 60 వేల లోపు వార్షికాదాయం కలిగిన అన్ని వర్గాల వారికి 6 శాతం చొప్పున సీట్లు కేటాయించాలన్న నిబంధన ఉంది. దీని అమలుపై గతంలోనే రాష్ర్ట ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే దీనివల్ల సర్కారీ బడులు దెబ్బతింటాయని ప్రభుత్వ వర్గాలతో పాటు ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. మరోవైపు ప్రైవేటు స్కూళ్లకు రీయింబర్స్‌మెంట్ రూపంలో చెల్లించాల్సిన ఫీజులను రాష్ట్రాలే పూర్తిగా భరించాలని కేంద్రం స్పష్టం చేయడంతో ఆర్థిక భారం దృష్ట్యా కొత్త నిబంధన అమలును అప్పట్లో పక్కనపెట్టారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో మళ్లీ దానిపై కసరత్తు మొదలైంది. దీంతో సర్కారీ స్కూళ్ల మనుగడే ప్రశ్నార్థకమవుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అమలుపై లోతుగా అధ్యయనం
విద్యా హక్కు చట్టం కొన్నేళ్ల కిందటే అమల్లోకి వచ్చినా అందులోని కొన్ని నిబంధనలను అప్పటి ప్రభుత్వాలు అమలు చేయలేదు. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు కిలోమీటర్ పరిధిలో, ప్రాథమికోన్నత స్థాయి విద్యార్థులకు 3 కి.మీ. పరిధిలో పాఠశాలలను అందుబాటులో ఉంచాలన్న నిబంధనను పెద్దగా పట్టించుకోలేదు. ప్రతి స్కూల్లో ఒక టీచర్ కచ్చితంగా ఉండాలని, ప్రతి 30 మంది విద్యార్థులకు ఓ టీచర్ ఉండాలన్న నిబంధననూ పాటించలేదు. ఒకరకంగా ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థను పాలకులే దెబ్బతీశారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో పాత నిబంధనలు కాక కొత్తగా నిబంధనలు రూపొందించుకొని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది.
ఇందులో భాగంగానే ప్రైవేటు స్కూళ్లలోని 25 శాతం సీట్లలో పేద పిల్లలకు ప్రవేశాలు కల్పించడంపై కసరత్తు చేస్తోంది. ఒకే ప్రాంతంలోని వివిధ కాలనీల్లో ఉండే సర్కారీ బడులను కలిపి ఒకేచోట పాఠశాలను కొనసాగించే విధానంపై అధ్యయనం చేస్తోంది. దీనివల్ల రాష్ర్టవ్యాప్తంగా ఐదా రు వందల స్కూళ్లకు మూసివేత ప్రమా దం ముంచుకురానుంది. విద్యా హ క్కు చట్టం నిబంధనల ప్రకారం ఆవాస ప్రాంతానికి కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్ల పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాల లేకపోతే ప్రభుత్వమే ఆ విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పించి మరో ప్రాంతంలోని స్కూళ్లకు తరలించాల్సి ఉంటుంది. ఈ నిబంధనను ఉపయోగించుకొని ఒక ప్రాంతంలోని వివిధ కాలనీల్లో ఉన్న స్కూళ్లను తొలగించి (వాటిలోని విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పించడం ద్వారా) ఒకే స్కూల్‌ను కొనసాగించే ఆలోచనలు జరుగుతున్నాయి.
అమలైతే ఇదీ పరిస్థితి
రాష్ట్రంలో దాదాపు 15 వేల ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి. వాటిల్లో ప్రారంభ తరగతిలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య దాదాపు 3 లక్షలు ఉంటుంది. 25 శాతం మందికి రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలంటే.. దాదాపు 75 వేల మంది విద్యార్థుల ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో చేరే వారితో దీన్ని అమలు చేస్తే.. ఆ విద్యార్థులు 8వ తరగతి పూర్తి చేసే వరకు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఏటా ఒకటో తరగతిలో చేరే వారిలో 25 శాతం పిల్లలకూ ఫీజులు కట్టాలి. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ఏటా రూ. 6 వేల వరకు వెచ్చిస్తోంది. దీని ప్రకారం ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం విద్యార్థులకు తొలి ఏడాది రూ. 45 కోట్లు చెల్లించాలి. ఇది ఏటా పెరుగుతూ 8 ఏళ్ల తర్వాత ప్రతి సంవత్సరం రూ. 360 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది.
ప్రభుత్వ స్కూళ్ల మనుగడ కష్టం
ప్రభుత్వ పాఠశాలల మనుగడ మరింత ప్రమాదంలో పడుతుంది. సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉన్న ప్రభుత్వ స్కూళ్లలోనే విద్యార్థులు చేరేలా వారిని ప్రోత్సహించాలి. ఎలాంటి శిక్షణ లేకుండానే బోధన నిర్విహ ంచే ఉపాధ్యాయులు ఉండే ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులు చేరేలా ప్రభుత్వమే పరోక్షంగా ప్రోత్సహించడం సరికాదు.
- వెంకట్‌రెడ్డి,
పీఆర్టీయూ-టీఎస్ అధ్యక్షుడు
చాలా స్కూళ్లు మూతే
ఇప్పటికే ప్రైవేట్ స్కూళ్లతో ప్రభుత్వ స్కూళ్లకు ముప్పు పొంచి ఉంది. చట్టంలో నిబంధన ఉండటం నిజమే అయినప్పటికీ దాన్ని అమలు చేయడం సరికాదు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలు క్రమంగా కనుమరుగవుతాయి. ముందుగా అదే చట్టంలో పేర్కొన్నట్టు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన విద్య తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలి.
- రాజిరెడ్డి, ఎస్టీయూ అధ్యక్షుడు
బడిని బలోపేతం చేయాలి
ప్రైవేటీకరణను ప్రోత్సహించే విధానాలు సరికాదు. అలాంటి వాటిని అమలు చేయకుండా సర్కారీ విద్యను బలోపేతం చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించే విధానాలు తీసుకురావాలి. రీయింబర్స్‌మెంట్ కింద ప్రైవేటు స్కూళ్లలోని 25 శాతం సీట్లలో ప్రవేశాలు కల్పిస్తే ఇది మరో ఇంజనీరింగ్ విద్యా వ్యవస్థలా తయారవుతుంది.
- రవి,
టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి