ప్రభుత్వ బడికి రారండి..
ప్రభుత్వ బడులకు పిల్లలను పంపించడంటూ ఉపాధ్యాయులు, విద్యాశాఖాధికారులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. గ్రామాల్లో ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఉచిత విద్య, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్నభోజనం వంటి ఎన్నో సదుపాయాలు సర్కారీ స్కూళ్లలో కల్పిస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. బడిఈడు ఉన్న పిల్లలందరినీ తప్పనిసరిగా గ్రామాల్లోని ప్రాథమిక, జెడ్పీ స్కూల్స్‌లో చేర్పించాలని సూచిస్తున్నారు. గవర్నమెంటు బడుల్లో అర్హులైన ఉపాధ్యాయులు, కంప్యూటర్ ల్యాబ్‌లు, ఇంగ్లీషు మీడియం వంటి ఎన్నో అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రైవేటు పాఠశాలల కంటే మెరుగైన ఫలితాలు ప్రభుత్వ స్కూల్స్‌లోని విద్యార్థులు సాధిస్తున్నారని పేర్కొంటున్నారు.
గ్రామాల్లో ఉపాధ్యాయులు ఇంటింటి ప్రచారం
గూడూరు టౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని ఎంఈవో దిలీప్‌కుమార్ తెలిపారు. జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో శనివారం ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను సొంత భవనాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. అర్హులైన ఉపాధ్యాయులు బోధిస్తున్నారని పేర్కొన్నారు.
కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం, విశాలమైన మైదానం, క్రీడ సామగ్రి ఉన్నాయన్నారు. ప్రతి నెలా విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయిస్తామని పేర్కొన్నారు. ఉచిత విద్య, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలు జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఎన్‌సీసీ ఉందన్నారు. టెన్త్‌లో 9.8, 9.2 జీఏపీతో మంచి మార్కులు సాధించారని తెలిపారు. హెచ్‌ఎం ఇస్మాయిల్, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, వీవీ కుమార్, వెంకటరమణయ్య, భాస్కర్‌రెడ్డి, ఎమ్మార్పీ భాను సిబ్బంది పాల్గొన్నారు.
తల్లిదండ్రులకు అవగాహన
వాకాడు: వాకాడు ఎస్సీ కాలనీలో యూపీ స్కూల్‌కు చెందిన ప్రధానోపాధ్యాయుడు కోట సుబ్రహ్మణ్యం తమ పాఠశాలకు చెందిన విద్యార్థులతో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. కొందరు విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్ళి వివిధ పాఠ్యాంశాలు, ప్రపంచ చిత్ర పటాలపై అవగాహనకల్పించారు.
తోటపల్లిగూడూరు : ప్రభుత్వం నుంచి తీసుకునే జీతాలకు తగిన విధంగా కష్టం చేయాలని భావించే ఉద్యోగుల్లో ఇంగిలాల బాలకృష్ణ ఒకరు. పేడూరు పంచాయతీ కృష్ణారెడ్డిపాళెం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నారు. ఇదే పాఠశాలలో తొమ్మిదేళ్ల నుంచి పనిచేస్తున్న బాలకృష్ణ చిన్నారుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పిస్తున్నారు.
ఈ నెల 15వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్న దృష్ట్యా బడి ఈడు పిల్లలను తమ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలంటూ గ్రామంలో ఇంటింటికీ తిరుగుతున్నారు. బడిఈడు పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరుతున్నారు. ప్రైవేటు పాఠశాలల మోజులో పడకుండా అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్చాలని సూచిస్తున్నారు.
ఆయన నిర్వహిస్తున్న ప్రచారానికి తల్లిదండ్రుల నుంచి స్పందన లభిస్తోంది. తప్పనిసరిగా తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలోనే చేర్పిస్తామని చెబుతున్నారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా జనరల్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం, సీఆర్‌పీ కాయల రమణమ్మ, అంగన్‌వాడీ కార్యకర్త సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.