అడ్వకేట్ లింగం నారాయణ
సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న న్యాయవాదులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని అడ్వకేట్ మద్దికుంట లింగం నారాయణ కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో అన్ని న్యాయస్థానాల్లో కార్యకలాపాలు నిలిచిపోవడంతో జూనియర్ లాయర్లు, నిరుపేద న్యాయవాదులు ఎంతో మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పేరుగొప్ప ఊరు దిబ్బ చందంగా న్యాయవృత్తిలో కొనసాగుతున్న వారిలో దాదాపు 80 శాతం మంది న్యాయవాదులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని వెల్లడించారు. దీనికి తోడు లాక్‌డౌన్ కారణంగా కోర్టులు మూతపడటంతో ఇంటి అద్దెలు చెల్లించలేక, కుటుంబ పోషణ భారమై ఎంతో న్యాయవాదులు కష్టాలు పడుతున్నారని తెలిపారు.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో న్యాయవాదులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ముందడుగు వేసిందని, జూనియర్ న్యాయవాదులకు రూ. 5 వేలు చొప్పున సహాయం అందించడానికి మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. తెలంగాణలో కూడా న్యాయవాదులను ఆదుకోవడానికి రూ.10 వేలు చొప్పున తక్షణ సాయంగా అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. మానవతా దృక్పథంలో స్పందించి న్యాయవాదులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని లింగం నారాయణ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment