ఎన్నికల హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో తొక్కాయని..
వెంకటాపురం: ఎన్నికల హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో తొక్కాయని, ప్రజాసమస్యలను పట్టించుకోవడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. పార్టీ 18వ డివిజన్ మహాసభల సందర్భంగా స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో మంగళవారం బహిరంగ సభ జరిగింది. ముఖ్య అతిథిగా తమ్మినేని పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న హామీని టీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, రాష్ట్రవ్యాప్తంగా కేవలం 600 మందికి 1500 ఎకరాలు మాత్రమే పంచి చేతులు దులుపుకుందని విమర్శించారు.
అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ పేదలకు ఇళ్లు, పింఛన్లు, ఫీజు రీరుుంబర్స్‌మెంట్ తదితర పథకాలు పూర్తిస్థాయిలో అమలవడం లేదని అన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తామన్న హామీ మాటలకే పరిమితమైందని, ప్రభుత్వ పాఠశాలలకు నిధులు కేటాయించలేదని విమర్శించారు. గిరిజనుల సాగులోగల పోడు భూములకు పట్టాలిచ్చి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకపోతే పోరాటాలకు దిగేందుకు సీపీఎం సిద్ధంగా ఉందన్నారు.
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన సాధనపల్లి ఆనంద్‌ను ఈ సభలో తమ్మినేని సన్మానించారు. ఈ సభలో భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, నాయకులు బి.వెంకట్, ఎజె.రమేష్, బండారు రవికుమార్, మచ్చా వెంకటేశ్వర్లు, యలమంచి రవికుమార్, బ్రహ్మచారి, గడ్డం స్వామి, మర్లపాటి రేణుక , గ్యానం సారయ్య, వంక రాములు, సరియం కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.