ఆ పార్టీల పొత్తు ప్రమాదకరం
- టీడీపీ-బీజేపీ చెట్టాపట్టాలతో రాష్ట్రానికి తీరని నష్టం
- ఒట్టు తీసి గట్టు పెట్టిన చంద్రబాబు
- నారాయణకు మద్దతిచ్చే ప్రసక్తే లేదు
- సీపీఎం, వైఎస్సార్‌సీపీల కూటమి విజయం తథ్యం
- తెలంగాణ రాష్ట్ర సీపీఎం సారధి తమ్మినేని వీరభద్రం
మేకల కళ్యాణ్‌చక్రవర్తి, ఖమ్మం
కాంగ్రెస్ - సీపీఐ, తెలుగుదేశం - బీజేపీల మధ్య కుదిరిన పొత్తులు అనైతికం. వారి పొత్తులు ఫలప్రదం కావు. జాతీయ వైఖరికి భిన్నంగా సీపీఐ నేతలు కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకున్నారు. అందుకే సీపీఐకి కూడా మద్దతు ఇవ్వడం లేదు. వైఎస్సార్‌సీపీ, సీపీఎంల మధ్య కుదిరిన అవగాహన ఖమ్మం జిల్లాలో మంచి ఫలితాలను ఇస్తుందన్నారు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ‘సాక్షి’కి ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే.
జాతీయ విధానానికి భిన్నం
కాంగ్రెస్, సీపీఐల పొత్తు గురించి చెప్పాలంటే అది కమ్యూనిస్టుల జాతీయ విధానానికి భిన్నమైనది. కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని సీపీఎం, సీపీఐ, ఆర్‌ఎస్పీ, ఫార్వర్డ్‌బ్లాక్‌లు నిర్ణయించాయి. దానికి విఘాతం కలిగిస్తూ సీపీఐ కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికలలో పోటీచేస్తుండటం దురదృష్టకరం. వీరి పొత్తు సఫలం కాదు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రతిష్ట దిగజారుతోంది. తెలంగాణ ఇవ్వడం కాంగ్రెస్ గొప్పతనమని ప్రజలు భావించడం లేదు. ఆ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం సీపీఐకే నష్టం.
నారాయణకు మద్దతివ్వకపోవడం సమర్థనీయం
ఖమ్మం పార్లమెంటుకు సీపీఐ అభ్యర్థిగా బరిలో ఉన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణకు మద్దతు ఇవ్వకూడదన్న మా వైఖరి సమర్థనీయమే. ఎందుకంటే నారాయణా, ఇంకో వ్యక్తి అనేదాన్ని బట్టి మేం మద్దతివ్వడం, ఇవ్వకపోవడం ఉండదు. వాళ్లు కాంగ్రెస్ కూటమిలో భాగస్వామి అయ్యారు. మేం ఆ కూటమికి మద్దతివ్వం. అందుకే నారాయణకు మద్దతివ్వడమనే ప్రశ్న కూడా ఉత్పన్నం కాదు. కాంగ్రెస్ కూటమిని ఓడించడమే మా లక్ష్యం.
టీడీపీది రాజకీయ అవకాశ వాదం
టీడీపీ, బీజేపీల పొత్తు ఈ రాష్ట్రానికి హానికరం. ఫాసిస్టు లక్షణాలున్న మతతత్వ పార్టీ బీజేపీ. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా చంద్రబాబు బీజేపీకే మేలు చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో పునాది లేని బీజేపీ మన రాష్ట్రంలో వేళ్లూనుకునేందుకు ఈ పొత్తు ఉపయోగపడుతుందన్నది మా భావన. ఈ పాపం టీడీపీ చరిత్రలో మిగిలిపోతుంది. గతంలో కూడా బాబు బీజేపీకి మద్దతిచ్చారు. గుజరాత్‌లో అల్లర్లు జరిగిన తర్వాత నరేంద్రమోడీ సీఎం కుర్చీకే పనికి రాడని, బీజేపీతో ఇంకెప్పుడూ పొత్తు పెట్టుకోనని చంద్రబాబు ప్రజలకు చెప్పారు. కానీ ఆ ఒట్టు తీసి గట్టుమీద పెట్టి రాజకీయ అవకాశవాదంతో వ్యవహరించాడు. తన అధికారం కోసం చేస్తున్న జిమ్మిక్కు తప్ప నష్టదాయకమైన ఈ పొత్తును ప్రజలు అంగీకరించరు.
అది ప్రత్యర్థుల ప్రచారం
జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక శక్తులతో క లిసి ఎన్నికలకు వెళ్లాలన్న సీపీఎం పొలిట్‌బ్యూరో నిర్ణయం మేరకే వైఎస్సార్ సీపీతో అవగాహన కుదిరింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో వైఎస్సార్‌సీపీతో అవగాహన కుదుర్చుకున్నారు. మహాజన సోషలిస్టు పార్టీతో కూడా ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో కలిసి పనిచేస్తున్నాం. కానీ వైఎస్సార్‌సీపీ, సీపీఎం శ్రేణుల మధ్య కొంత అంతరం ఉందని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. వారు ఎంత ప్రచారం చేసినా మా రెండు పార్టీల కూటమి విజయం తథ్యం. మేం కలిసికట్టుగా ముందుకెళ్లి జిల్లాలోని అన్ని స్థానాల్లో విజయదుందుభి మోగించడం ఖాయం.
ఇప్పుడు మా సిద్ధాంతాలు చెబితే ఎలా
ఆంధ్రప్రదేశ్ విడిపోవడం వాస్తవం. వాస్తవాన్ని బట్టి వ్యవహరించాలే తప్ప మా సిద్ధాంతం చెప్పి వెళ్లడం కుదరదు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమమే సీపీఎం ముందున్న కర్తవ్యం. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రజలు పెట్టుకున్న ఆశలు, ఆకాంక్షలను నిజం చేయాలి. అందుకు మూడు అంశాలు ఎంచుకున్నాం. సమగ్రాభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం అనే మూడు సూత్రాల విజన్‌తో ముందుకెళ్లాలని నిర్ణయించాం. ఎస్సీలను సీఎం చేస్తాం, బీసీలను సీఎం చేస్తామనడం సామాజిక న్యాయం కాదు. ఇలాంటి వాగ్దానాల్లో ఓట్లు కొల్లగొట్టడమే తప్ప చిత్తశుద్ధి కనిపించదు. అన్ని వర్గాల పేదలకు న్యాయం జరిగేలా కార్యక్రమం ఉండాలి.
సామరస్యం, సమన్వయం అవసరం
రెండు రాష్ట్రాలు ఏర్పడిన తరుణంలో రెండు రాష్ట్రాలు, రెండు ప్రాంతాల మధ్య సమన్వయం, సామరస్యం కీలకం, ఇక తగాదాలు పడాల్సిన పనిలేదు. ఒకరినొకరు సహకరించుకోవాలి. కొన్ని వనరులు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయి. అక్కడ ఉన్న పొడవైన సముద్రతీరాన్ని , అధిక విద్యుత్‌ను మనం వినియోగించుకోవచ్చు. మన బొగ్గును వారు తీసుకెళ్లొచ్చు. కానీ సామరస్యం లేకుండా ఇది సాధ్యం కాదు. ఇరు రాష్ట్రాల మధ్య సామరస్య వారధిగా సీపీఎం పనిచేస్తుంది.