
నేడు రాజ్‌నాథ్‌తో గవర్నర్ భేటీ
* కేంద్ర హోంశాఖ నుంచి పిలుపు
* ‘ఓటుకు కోట్లు’పై నివేదిక.. సెక్షన్-8పై చర్చించే అవకాశం
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం ఢిల్లీ స్థాయిలో మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో తాజా పరిణామాలను చర్చించేందుకు కేంద్ర హోం శాఖ గవర్నర్‌ను ఢిల్లీకి పిలిపించింది. ఈ మేరకు గవర్నర్ నరసింహన్ గురువారం సాయంత్రం హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆయన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశం కానున్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటేయాలని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయిన విషయం తెలిసిందే.
ఈ బేరసారాల్లో స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రమేయమున్నట్లు స్టీఫెన్‌సన్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు ఈ కేసులో అడ్డంగా దొరికిపోయిన బాబు.. తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లు ట్యాప్ చేసిందంటూ ఎదురుదాడికి దిగారు. ఈ కేసులో గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రధానికి ఫిర్యాదు చేశారు కూడా. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో సెక్షన్-8ను అమలు చేయాలని, శాంతి భద్రతలను గవర్నర్‌కు అప్పగించాలని కొత్త డిమాండ్ లేవనెత్తారు.
ఇక ఈ కేసులో రేవంత్ అరెస్ట్ నుంచి వరుస పరిణామాలన్నింటినీ సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు గవర్నర్‌కు నివేదించారు. ఇదే సమయంలో విభజన చట్టంలోని సెక్షన్-8 ప్రకారం గవర్నర్ ఈ కేసులో జోక్యం చేసుకోవచ్చంటూ అటార్నీ జనరల్ సలహా ఇచ్చినట్లు కథనం ప్రచారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో గవర్నర్ హడావుడి ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఓటుకు కోట్లు’ కేసుకు సంబంధించిన నివేదికతో పాటు ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన పలు అంశాలపై తన నివేదికలను గవర్నర్ హోంశాఖకు అందించనున్నట్లు సమాచారం.
గవర్నర్‌తో సుజనా చౌదరి భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఇక్కడి ఏపీ భవన్‌లో బస చేసిన గవర్నర్ నరసింహన్‌తో గురువారం కేంద్ర మంత్రి సుజనా చౌదరి భేటీ అయ్యారు. వీరి సమావేశం గంట సేపు కొన సాగింది. ఓటుకు కోట్లు అంశం, సెక్షన్-8 అమలు, ఏసీబీ నోటీసులపై చర్చించినట్టు తెలుస్తోంది. సమావేశానంతరం సుజనా చౌదరితో మీడియా మాట్లాడే ప్రయత్నం చేయగా ఆయన నిరాకరిస్తూ వెళ్లిపోయారు.