
ఉపాధ్యాయుడితో గొడవ పడుతున్న విద్యార్థుల కుటుంబీకులు, స్థానిక యువకులు
కొండపాక(గజ్వేల్): విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, దూషిస్తున్న ఉపాధ్యాయుడితో బాధిత కుటుంబ సభ్యులు, స్థానిక యువకులు వాగ్వాదానికి దిగారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుకు సిద్ధమయ్యారు. ఈ సంఘటన కొండపాక మండలంలోని కుకునూరుపల్లి హైస్కూల్లో గురువారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గడీల సుధాకర్‌రెడ్డి అనే ఆంగ్ల ఉపాధ్యాయుడు మూడు నెలల క్రితం బదిలీపై కుకునూరుపల్లి హైస్కూల్‌కు వచ్చాడు. నాటి నుంచి 9వ తరగతి విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, దూషిస్తున్నాడని బాధిత చిన్నారులు ఆరోపిస్తున్నారు. పాఠ్యాంశాల్లో అర్థం కాని విషయాలను అడిగితే ఛీదరించుకుంటూ, అవహేళనగా మాట్లాడుతుంటారని చెబుతున్నారు. ఈ విషయాన్ని వారు తమ కుటుంబీకులతో చెప్పడంతో స్థానిక యువకులతో కలిసి విషయం తెలసుకునేందుకు గురువారం పాఠశాలకు వెళ్లారు.
అక్కడ విద్యార్థుల కుటుంబీకులకు, యువకులకు, ఉపాధ్యాయుడు సుధాకర్‌రెడ్డి నడుమ మాటా మాటా పెరగడంతో విషయం దాడి చేసుకునే స్థాయికి వెళ్లింది. విషయం తెలుసుకున్న ఎంఈఓ శ్రీనివాస్‌రెడ్డి కుకునూరుపల్లి హైస్కూల్‌కు చేరుకొని విద్యార్థుల కుటుంబీకులను, యువకులను, ఉపాధ్యాయుడిని సముదాయించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులకు ఇలాంటి ఘటన పునరావృత్తం కాకుండా చర్యలు తీసకుంటామని హామీ ఇచ్చారు. హెచ్‌ఎం గజ్జెల కనుకరాజు వైఖరిపై సైతం యువకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడు సుధాకర్ రెడ్డిని ఎంఈఓ శ్రీనివాస్‌రెడ్డి మందలించారు. విద్యార్థులతో సరైన రీతిలో మెదగాలని సూచించారు. ఈ విషయమై ప్రధానోపాద్యాయుడు కనుకరాజుకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment