నిధులకు గాలం.. పనులకు తాళం!
ఒక నిర్మాణాన్ని మొదలు పెట్టేముందు.. అందుకు సంబంధించి ముడిసరుకు, పని, వ్యయం తదితర అంచనాలు వేసి ఆ తర్వాత పని ప్రారంభిస్తాం. సాధారణంగా అందరూ ఇదే తరహా ప్రణాళికతో రంగంలోకి దిగుతారు. కానీ మన పంచాయతీరాజ్ ఇంజినీర్ల తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ముందుగా పనులు మొదలుపెట్టి.. కొంత మొత్తాన్ని ఖర్చు చేసిన తర్వాత అంచనాలు వేశారు. నిర్మాణానికి కేటాయించిన మొత్తం చాలడం లేదంటూ చేతులెత్తేశారు. మరిన్ని నిధులిస్తేనే పనులు చేస్తామని మెలిక పెట్టి నిధులను అట్టిపెట్టుకోవడం గమనార్హం.
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్నం భోజనం తయారీకిగానూ కిచెన్ షెడ్ల ఏర్పాటుకు సర్కారు సిద్ధ్దమైంది. ఇందులో భాగంగా జిల్లాలోని 1,147 పాఠశాలలకు కిచెన్ షెడ్లు మంజూరు చేసింది. వీటి నిర్మాణ బాధ్యతలను పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగానికి అప్పగించింది. ఈ తంతు జరిగి మూడేళ్ళు కావస్తున్నా.. పురోగతి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. ఈ మూడేళ్ల కాలంలో కేవలం 56 కిచెన్‌షెడ్లను పూర్తి చేసి ఇంజనీర్లు మమ అనిపించడం గమనార్హం.
ఎందుకీ జాప్యం..
ఒక్కో కిచెన్ షెడ్డుకు రూ.75వేల చొప్పున ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ మొత్తంతో నిర్దేశిత విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టవచ్చని ప్రభుత్వం భావించి ఈమేరకు నిధులు విడుదల చేసింది. అయితే జిల్లా పంచాయతీరాజ్ అధికారులకు మాత్రం ఈ నిధులు చాలడం లేదట. ఇక్కడున్న పరిస్థితుల దృష్ట్యా రూ.75వేలకో కిచెన్ షెడ్డు నిర్మించడం సాధ్యం కాదని ఇంజినీర్లు తేల్చిచెప్పారు. దీంతో పనులు గ్రౌండ్ చేసిన 205 నిర్మాణాలను ఎక్కడికక్కడ వదిలేశారు. నిర్మాణ వ్యయం రూ.25 వేలు పెంచాలని డిమాండ్ చేస్తున్న ఇంజనీర్లు.. ఆ మొత్తాన్ని ఇస్తేనే పనులు చేస్తామంటూ స్పష్టం చేయడంతో యంత్రాంగం తలపట్టుకుంది.
సర్దుకు పోరట..
నిధులు విడుదల చేసి మూడేళ్లు కావస్తున్న నేపథ్యంలో పనుల పురోగతిపై ఇటీవల కలెక్టర్ ఎన్.శ్రీధర్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నిధుల పెంపు అంశాన్ని ఇంజినీర్లు ప్రస్తావించారు. నిధులు పెంచే అంశం ప్రభుత్వ పరిధిలో ఉన్నందున కొంత సర్దుబాటు చేసి పనులు చేస్తే సరిపోతుందని విద్యాశాఖ సలహా ఇచ్చింది. పాఠశాలలో ఇప్పటికే నిర్మించి ఉన్న ప్రహరీ సపోర్టు తీసుకొని.. స్లాబుకు బదులుగా రేకులు వేసి నిర్మాణాలు పూర్తి చేస్తే మేలు జరుగుతుందని సూచించింది. అయితే ఈ సూచన పంచాయతీరాజ్ ఇంజనీర్లకు రుచించలేదు. దీంతో అలా సర్దుకుపోబోమని స్పష్టం చేసిన ఇంజనీర్లు.. తమ మాటే నెగ్గించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద నిర్మాణాలు నిలిచిపోగా మూడేళ్ల పాటు ఖజానాలో రూ.కోట్లు మురుగుతుండడం కొసమెరుపు.