ఎలివేటెడ్‌ కారిడార్లకు పచ్చజెండా! | Green Signal To Elevated Corridors In Hyderabad | Sakshi
Sakshi News home page

ఎలివేటెడ్‌ కారిడార్లకు పచ్చజెండా!

Published Wed, Mar 7 2018 2:17 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Green Signal To Elevated Corridors In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జాతీయ రహదారులు, వాటిపై అవసరమైన చోట్ల ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణానికి కేంద్రం అనుమతినిచ్చింది. ఈ ఆర్థిక ఏడాదికి సంబంధించి గతంలో మంజూ రు చేసినప్పటికీ పనులు ప్రారంభించేందుకు వీలుగా ఇంతకాలం కేంద్రం అనుమతివ్వలేదు. రూ.3,120 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టులకు మంగళవారం కేంద్ర ఉపరితల రవాణ శాఖ పచ్చజెండా ఊపింది.

ఇందులో హైదరాబాద్‌లో కీలకమైన 3 ఎలివేటెడ్‌ కారిడార్లు ఉన్నాయి. ఆర్థిక ఏడాది ముగియనుండటంతో కేంద్ర ఉపరితల రవాణ శాఖతో తెలంగాణ జాతీయ రహదారుల విభాగం సంప్రదింపులు జరుపుతూ తుది అనుమ తులిచ్చేలా చర్యలు తీసుకుంది. తాజాగా ఆ విభాగం ఈఎన్‌సీ గణపతిరెడ్డి ఢిల్లీ వెళ్లి అధికారులతో చర్చించటంతో అన్ని పనులకు మంగళవారం తుది అనుమతులు లభించాయి.

ఉప్పల్‌ ట్రాఫిక్‌కు పరిష్కారం..
హైదరాబాద్‌–వరంగల్‌ జాతీయ రహదారిపై ఉప్పల్‌ వద్ద ట్రాఫిక్‌ చిక్కులు తీవ్రంగా ఉండటంతో వాహన వేగానికి బ్రేకులు పడుతున్నాయి. రోడ్డును విస్తరించేందుకు కూడా అవకాశం లేకపోవటంతో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించాలని గతంలోనే ప్రతిపాదించారు. తాజా అనుమతుల నేపథ్యంలో ఉప్పల్‌ కూడలి నుంచి పీర్జాదిగూడ దాటాక ఉన్న సెంట్రల్‌ పవర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వరకు 6.25 కిలో మీటర్ల మేర కారిడార్‌ కొనసాగనుంది.

ఇందుకు రూ.850 కోట్లు ఖర్చు కానుంది. భూసేకరణకు రాష్ట్రప్రభుత్వం రూ.200 ఖర్చు చేయనుండగా మిగతా మొత్తా న్ని కేంద్రం ఇస్తుంది. ఇక అంబర్‌పేటలో కూడా మరో వంతెన నిర్మాణం చేపట్టనున్నా రు. చే నంబర్‌ కూడలి నుంచి అంబర్‌పేట మార్కెట్‌ వద్ద ఉన్న కూడలి వరకు 4 వరసలతో నిర్మితమయ్యే ఈ వంతెనకు రూ.186 కోట్లు ఖర్చు కానున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో మరో వంతెన నిర్మించనున్నారు.

హైదరాబాద్‌ నుంచి ఆరాంఘర్‌ వరకు పీవీ ఎలివేటెడ్‌ కారిడార్‌ ఉండగా ఆ తర్వాత వాహనాలు ట్రాఫిక్‌ లో చిక్కుకోవాల్సి వస్తోంది. శంషాబాద్‌లో ఇబ్బంది ఉండటంతో ఇక్కడ వంతెన నిర్మించబోతున్నారు. ఆరాంఘర్‌ నుంచి శంషాబాద్‌ దాటే వరకు 10 కిలోమీటర్ల మేర 6 వరసలతో నిర్మితమయ్యే ఈ వంతెనకు రూ.284 కోట్లు ఖర్చు కానున్నాయి.

వీటితోపాటు రూ.224 కోట్లతో అలీనగర్‌–మిర్యాలగూడ మధ్య 30 కిలోమీటర్లు రోడ్డు విస్తరణ, రూ.300 కోట్లతో మల్లేపల్లి–హాలియా మధ్య 40 కి.మీ., మేర రూ.207 కోట్లతో సిరోంచా–ఆత్మకూరు మధ్య 34 కి.మీ మేర రూ.324 కోట్లతో మిర్యాలగూడ–కోదాడ మధ్య 46 కి.మీ., రూ.114 కోట్లతో హగ్గరి–రాయ్‌చూరు–జడ్చర్ల మధ్య 15 కి.మీ. మేర రోడ్లను విస్తరించనున్నారు. వీటికి త్వరలో టెండర్లు పిలవనున్నట్లు ఈఎన్‌సీ గణపతి రెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement