- కేంద్రం ఖరారు చేసిన ధరకే సన్నద్ధమైన యంత్రాంగం
సాక్షి, హైదరాబాద్: గ్రీన్‌హౌస్ (పాలీహౌస్) నిర్మాణ వ్యయం పెరగనుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ధారించిన యూనిట్ ధరనే ఖరారు చేయాలని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ సర్కారు ప్రకటించిన ధర తమకు గిట్టుబాటు కాదని భావించిన గ్రీన్‌హౌస్ కంపెనీలు ఎక్కువ ధరకు ఆర్థిక బిడ్ దాఖలు చేశాయి. దీంతో గ్రీన్‌హౌస్‌పై ఏర్పడిన ఉద్యానశాఖ నిపుణుల కమిటీ ఆ కంపెనీలతో చర్చలు జరిపింది. అవి కేంద్రం ఇస్తున్న ధరను ఖరారు చేయాలని డిమాండ్ చేశాయి.
తప్పనిసరి పరిస్థితిలో ఆ ధరకే సాంకేతిక కమిటీ కూడా ఓకే చేయాల్సి వస్తోంది. దీనిపై సోమవారం సమావేశమై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనుంది.దీని వల్ల ప్రభుత్వంపై భారం పడినా అది రైతులకు మేలు కలిగిస్తుందని... నిర్మాణంలో నాణ్యత ఉంటుందని ఉద్యానశాఖ అధికారులు అంటున్నారు.
ఒక్కో స్లాబుకు ఒక్కో యూనిట్ ధర
గ్రీన్‌హౌస్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కంపెనీలకు ఒక్కో చదరపు మీటరుకు రూ. 700 ఇవ్వాలని తొలుత భావించింది. నాలుగు వేల చదరపు మీటర్లకు ఖర్చు రూ. 28 లక్షలు అవుతుంది. ఇదిగాక కంపెనీకి సంబంధం లేకుండా విత్తనాలు, భూమి చదును, ఇతరత్రా నిర్వహణ వ్యయం చదరపు మీటరుకు రూ. 140 ఇవ్వాలని భావించింది. మొత్తంగా రైతుకు 75 శాతం సబ్సిడీ ప్రకటించింది. దీన్ని సవరించాలని సాంకేతిక కమిటీ తాజాగా నిర్ణయానికి వచ్చింది.
అది కేంద్ర ప్రభుత్వం నాలుగు స్లాబుల్లో ప్రకటించిన ధరల అమలుకు నిర్ణయించింది. ఆ ప్రకారం 500 నుంచి 560 చదరపు మీటర్ల స్లాబుకు చదరపు మీటరుకు రూ. 1,060 వంతున చెల్లిస్తారు. ఇక 561 నుంచి వెయ్యి చదరపు మీటర్ల వరకు చదరపు మీటరుకు రూ. 935 చెల్లిస్తారు. ఇక 1001 నుంచి 2000 చదరపు మీటర్ల స్లాబుకు చదరపు మీటరుకు రూ. 890 చొప్పున చెల్లిస్తారు. రెండు వేలకు పైగా దాటిన స్లాబుకు రూ. 844 కంపెనీలకు చెల్లిస్తారు.
ఆ యూనిట్ వ్యయంలోనే అన్ని పన్నులు కలిపి ఉంటాయి. ఈ ధరలనే ఖరారు చేయాలని సాంకేతిక కమిటీ యోచిస్తోంది. అయితే బిడ్‌లో కంపెనీలు కోట్ చేసిన ధరలు భిన్నంగా ఉన్నాయి. ఇండియన్ గ్రీన్‌హౌస్ ప్రైవేటు లిమిటెడ్ రూ. 935, నోయిడాకు చెందిన జెస్తా డెవలపర్స్ లిమిటెడ్ రూ. 840, హైదరాబాద్‌కు చెందిన భానోదయం ఇండస్ట్రీస్ రూ. 1044, శ్రీసాయి ఫైబర్ ప్రైవేటు లిమిటెడ్ రూ. 1260, జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ లిమిటెడ్ రూ. 1244, హైతాసు కార్పొరేషన్ రూ. 991, బెంగళూరు, తమిళనాడులకు చెందిన అగ్రి ఫ్లాస్ట్ ప్రొటెక్టెడ్ కల్టివేషన్ ప్రైవేటు లిమిటెడ్ రూ. 844, మహారాష్ట్రకు చెందిన సన్మార్గ్ ఆగ్రో సర్వీసెస్ రూ. 1,035 కోట్ చేశాయి.
వారి ప్రతిపాదనలు ఎలా ఉన్నా కేంద్రం ప్రకటించిన మేరకు ధర నిర్ధారించి సర్కారు ఆమోదం లభించగానే వాటిని ఖరారు చేయాలని నిపుణుల కమిటీ భావిస్తోంది. తర్వాత తుది జాబితా తయారుచేస్తారు. ఏదైనా కంపెనీ కేంద్రం ధరకు మించి కోట్ చేస్తే నిర్ధారిత సొమ్ముపైనే రైతులకు సబ్సిడీ ఇస్తారు. మిగిలినది రైతులే భరించాల్సి ఉంటుంది. అన్నీ ఖరారయ్యాక నోటిఫికేషన్ విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. రైతులు తమకు ఇష్టమైన కంపెనీని ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పిస్తామంటున్నారు.