గ్రూప్‌–1 టాపర్‌ మాధురి | Group-1 Topper Madhuri | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–1 టాపర్‌ మాధురి

Published Mon, Oct 30 2017 3:28 AM | Last Updated on Mon, Oct 30 2017 3:29 AM

Group-1 Topper Madhuri

సాక్షి మెటీరియల్‌ ఎంతో ఉపయోగపడింది
గ్రూప్‌–1లో ఫస్ట్‌ ర్యాంక్‌ రావడం సంతోషంగా ఉంది. మాది భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మండలం మంగపేట. ఎంటెక్‌ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నా. మూడుసార్లు యూపీఎస్సీ ఇంటర్వ్యూ  వరకూ వెళ్లినా ర్యాంకు రాలేదు. సాక్షి భవితను నిత్యం అనుసరించా, అందులో మెటీరియల్‌ ఎంతగానో ఉపయోగపడింది.     – ఆర్‌డీ మాధురి 

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ శనివారం ప్రకటించిన గ్రూప్‌–1 ఫలితాల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారే ఎక్కువ టాప్‌ ర్యాంకులు సాధించారు. రంగారెడ్డి జిల్లా హైదర్‌నగర్‌కు చెందిన ఆర్‌డీ మాధురి గ్రూప్‌–1లో అత్యధిక స్కోర్‌తో మొదటి ర్యాంకర్‌గా నిలిచి డిప్యూటీ కలెక్టర్‌ పోస్టుకు ఎంపికయ్యారు. ఆమెతోపాటు మరో 9 మంది టాప్‌–10లోపు ర్యాంకులను సాధించి ఉత్తమ పోస్టులకు ఎంపికయ్యారు. నల్లగొండ పట్టణం హౌసింగ్‌ బోర్డుకు చెందిన ఎన్‌.ఉదయ్‌రెడ్డి రెండో ర్యాంక్‌ సాధించి డీఎస్పీ కేడర్‌ను ఎంచుకున్నారు. రంగారెడ్డి జిల్లా సఫిల్‌గూడకు చెందిన రోహిత్‌ సింగ్‌ మూడో ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్‌ కేడర్‌ను ఎంచుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన బెన్షలోమ్‌ 8వ ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్‌ పోస్టును ఎంపిక చేసుకున్నారు. అభ్యర్థుల వయస్సు, సామాజిక వర్గం, పోస్టుల రోస్టర్‌ పాయింట్ల ఆధారంగా సర్వీసులను టీఎస్‌పీఎస్సీ కేటాయించింది. మరోవైపు టాప్‌–10లో ఏడుగురు పురుషులు ఉండగా, ముగ్గురు మహిళలు ఉన్నారు. 2011లో జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించిన మెయిన్‌ పరీక్షలను, ఇంటర్వ్యూలను ఇటీవల పూర్తి చేసిన టీఎస్‌పీఎస్సీ 127 పోస్టుల్లో 121 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

సుహృద్భావ వాతావరణంలో ఇంటర్వ్యూలు..
గ్రూప్‌–1 ఇంటర్వ్యూలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని పలువురు అభ్యర్థులు వెల్లడించారు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగానికి సంబంధించిన అంశాల్లోనే ఎక్కువ ప్రశ్నలు అడిగారని చెప్పారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను ఎలా డీల్‌ చేస్తారన్న కోణంలో, ప్రజలకు అందించాల్సిన సేవలకు సంబంధించిన పనితీరుపైనే ప్రశ్నలు అడిగారని, దానికి తోడు రాష్ట్రంలో సామాజిక పరిస్థితులు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి సంబంధించిన అంశాలపై ప్రశ్నలు అడిగినట్లు అభ్యర్థులు వివరించారు.

మొదటి ప్రయత్నంలోనే..
ఐబీఎం, డెలాయిట్, విప్రోలో పనిచేసిన వంశీకృష్ణ సివిల్స్‌ లక్ష్యంగా పెట్టుకుని తొలి ప్రయత్నంలోనే గ్రూప్‌–1 ర్యాంకు సాధించారు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఆయన పదో తరగతి వరకు అక్కడే చదువుకున్నారు. కరీంనగర్‌లో ఇంటర్‌.. అనంతపురం జేఎన్‌టీయూలో బీటెక్‌ పూర్తి చేశారు. తండ్రి నాగేందర్, తల్లి లలిత. భార్య మేథ వ్యవసాయ అధికారిగా మంచిర్యాలలో పని చేస్తున్నారు.

పిల్లలను చూసుకుంటూ.. తాను చదువుకుంటూ..
9వ ర్యాంక్‌ సాధించిన వి.ప్రశాంతి పిల్లలను చూసుకుంటూ.. తానూ చదువుకున్నారు. ప్రస్తుతం రామంతాపూర్‌లో నివాసం ఉంటున్న ఆమెకు 18వ ఏటే వివాహమైంది. ఆ తర్వాత పట్టుదలతో ఐదేళ్ల న్యాయ విద్య కోర్సు, ఎంబీఏ పూర్తి చేశారు. ఓయూ లా కాలేజీలో 5వ ర్యాంకు సాధించారు. ఎంబీఏలో టాప్‌ ర్యాంకర్‌గా నిలిచారు. భర్త రవి ప్రకాశ్‌ వ్యాపారం చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.

బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగం చేస్తూనే..
ఆరో ర్యాంకు సాధించిన సంతోష్‌ బీహెచ్‌ఈఎల్‌ డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్నారు. సివిల్స్‌ సాధించాలన్న లక్ష్యంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. మూడు సార్లు సివిల్స్‌ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. గ్రూప్‌–1లో ఆరో ర్యాంకు సాధించారు. వరంగల్‌ ఎన్‌ఐటీ నుంచి ఈఈఈ పూర్తి చేసిన ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు భాస్కర్‌రెడ్డి, విజయభారతి, భార్య శ్రీదేవి ప్రోత్సాహం ఎంతగానో ఉందన్నారు.

ఆత్మస్థైర్యం కోల్పోవద్దు
ప్రజలకు సేవ చేయాలనే కోరిక, ఐఏఎస్‌ కావాలనే బలమైన ఆకాంక్షతో పట్టువదలని విక్రమార్కుడిలా చదివి డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగాన్ని సంపాదించారు రోహిత్‌సింగ్‌. సివిల్స్‌ సాధించాలన్నా.. గ్రూప్‌–1 ఉద్యోగం పొందాలన్నా ధృడ సంకల్పం, అంతకుమించిన గుండె ధైర్యం ఉండాలంటున్నారు. ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌లో రిటైర్డ్‌ డిప్యూటీ మేనేజర్‌ శివ్‌చరణ్‌సింగ్‌ కుమారుడైన రోహిత్‌ హైస్కూల్‌ చదువు ఖమ్మంలో ఇంటర్, బీఈ హైదరాబాద్‌లో సాగింది. ఎప్పుడూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా సెల్ఫ్‌ మోటివేషన్‌ చేసుకుంటూ ఉండాలని, ఎన్ని గంటలు చదివామన్నది కాదు ఇష్టంతో ఆరు గంటలు కూర్చున్నా మంచి ఫలితాలు సాధించవచ్చని రోహిత్‌ చెప్పారు.

వ్యవసాయ కుటుంబం నుంచి..
మహబూబ్‌నగర్‌ జిల్లా మర్రిపల్లిలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన దేప విష్ణువర్ధన్‌ రెడ్డి జెన్‌కో(నాగార్జునసాగర్‌)లో పనిచేస్తూనే గ్రూప్‌–1లో ఏడో ర్యాంకు సాధించి డివిజనల్‌ ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టుకు ఎంపికయ్యారు. కల్వకుర్తిలో టెన్త్, హైదరాబాద్‌లోని ప్రైవేటు కాలేజీలో బీటెక్, వరంగల్‌ ఎన్‌ఐటీలో ఎంటెక్‌ పూర్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement