సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష కొనసాగుతోంది. చివరి నిమిషంలో అభ్యర్థులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఐడీ కార్డుతో పాటు గుర్తింపు పత్రాలు తీసుకురాని అభ్యర్థులను పోలీసులు బయటికి పంపించారు.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)లో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో గత అక్టోబర్ 16న నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష రద్దయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రిలిమినరీ పరీక్షను తిరిగి నిర్వహించనున్నట్లు వెల్లడించిన టీఎస్‌పీఎస్సీ... ఈనెల 11న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరగనుంది.
పోటీ తీవ్రమే..
వివిధ ప్రభుత్వ శాఖల్లో 503 ఉద్యోగ (గ్రూప్–1) ఖాళీలున్నాయి. వీటికి 3,80,081 మంది దరఖాస్తు చేసుకోగా, గత అక్టోబర్ 16న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 2,86,051 మంది హాజరయ్యారు. అనంతరం మెయిన్ పరీక్షలకు అర్హత సాధించిన వారి వివరాలను టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. కానీ ప్రశ్నపత్రాల లీకేజీతో ఈ పరీక్షను రద్దు చేయాల్సి వచ్చింది.
చెప్పులు వేసుకొస్తేనే అనుమతి
అభ్యర్థులు ఒరిజినల్ హాల్‌టికెట్‌తో హాజరుకావాలి. హాల్‌టికెట్‌పై ఫొటో సరిగ్గా లేకుంటే మూడు ఫొటోలపై గెజిటెడ్ అధికారి సంతకంతో కూడిన హాల్‌టికెట్‌తో హాజరుకావాలి. అభ్యర్థులు తప్పకుండా గుర్తింపు కార్డు (పాన్, ఆధార్, ఓటర్ ఐడీ తదితరాలు)ను వెంట తెచ్చుకోవాలి.
పరీక్షా హాల్లోకి అభ్యర్థులను అనుతించే విషయంలో కమిషన్ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. పరీక్షా సమయానికి 15 నిమిషాల ముందే గేట్లు వేసేస్తారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. అభ్యర్థులు కేవలం చెప్పులు మాత్రమే ధరించాలి. బూట్లు ధరించకూడదు. బెల్టు ధరించిన అభ్యర్థులను సైతం పక్కాగా పరిశీలించిన తర్వాతే అనుమతిస్తారు. పరీక్ష తీరును పరిశీలించేందుకు టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సైతం ఏర్పాటు చేసినట్లు కమిషన్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment