* అన్ని ఉద్యోగాల భర్తీ బాధ్యతా టీఎస్‌పీఎస్సీదే
* కానిస్టేబుల్ నుంచి గ్రూప్-1 వరకు నియామకాలు
* ఉపాధ్యాయ పోస్టులు కూడా కమిషన్ చేతుల్లోకి..
* ఇతర నియామక సంస్థల రద్దు లేదా టీఎస్‌పీఎస్సీ పరిధిలోకి..
* కేరళలోని విధానం అమలుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి
* త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం
* ఇప్పటికే కమిషన్‌కు సమాచారమిచ్చిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: పోలీస్, ఉపాధ్యాయ పోస్టులతో సహా అన్ని రకాల నియామకాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్(టీఎస్‌పీఎస్సీ) ద్వారానే చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉద్యోగాల భర్తీ కోసం ఏర్పాటు చేసిన రాజ్యాంగబద్ధమైన సంస్థనే పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని యోచిస్తోంది. కేరళలో అనుసరిస్తున్న ఈ విధానాన్నే రాష్ర్టంలోనూ అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. దీంతో ప్రస్తుతమున్న లక్షకుపైగా ఖాళీలను భర్తీ చేసే బాధ్యతను టీఎస్‌పీఎస్సీకే అప్పగించే అవకాశముంది.
ప్రస్తుతం ఉపాధ్యాయ పోస్టుల భర్తీని జిల్లా ఎంపిక కమిటీ(డీఎస్‌సీ)లు చేస్తుండగా, కానిస్టేబుల్, ఎసై్స వంటి పోస్టులను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చేపడుతోంది. మరికొన్ని శాఖలు సొంతంగానే నియామకాలు చేసుకుంటున్నాయి. వీఆర్‌ఏ/వీఆర్‌వో వంటి పలు నియామక పరీక్షలను రెవెన్యూ శాఖ నిర్వహిస్తుండగా.. ఫారెస్టు బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ వంటి పోస్టుల భర్తీ అటవీ శాఖ నేతృత్వంలోనే జరుగుతోంది. ఇలా పలు శాఖలు వేర్వేరుగా నియామకాలు చేపడుతుండటంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు.
గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4, లెక్చరర్, ఇంజ నీర్ వంటి కొన్ని రకాల పోస్టుల భర్తీకే కమిషన్ పరిమితమవుతోంది. రాజ్యాంగబద్ధమైన సంస్థ ను వదిలేసి ప్రభుత్వ శాఖలే సొంతంగా నియామకాలు చేపట్టడం సరికాదన్న భావన ప్రభుత్వవర్గాల్లో నెలకొంది. అందుకే అన్ని రకాల నియామకాలను కొత్తగా ఏర్పడిన టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలోనే చేపట్టే అంశంపై తాజాగా దృష్టి సారించింది. దీన్ని అమలు చేస్తే, ప్రస్తుతమున్న పోలీస్ బోర్డు వంటి అన్ని రకాల నియామక సంస్థలను పూర్తిగా రద్దు చేయాలా? లేక వాటిని సర్వీస్ కమిషన్ పరిధిలోకి తీసుకురావాలా అన్న అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనుంది.
ఇప్పటికే ఈ విషయాన్ని టీఎస్‌పీఎస్సీకి ప్రభుత్వం తెలియజేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శుక్రవారం కమిషన్ తొలి సమావేశం జరిగింది. ఈ సంద ర్భంగా పలు అంశాలపై చైర్మన్ ఘంటా చక్రపాణి, సభ్యులు సి.విఠల్, బానోతు చంద్రావతి చర్చించారు. ప్రభుత్వ సలహాదారు పాపారావు, ఇతర అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు.
వేర్వేరుగా నియామకాలతో తలనొప్పి
ఎక్కువ సంఖ్యలో పోస్టుల భర్తీ జరిగే విద్యాశాఖలో ఉపాధ్యాయ నియామకాలను గతంలో పబ్లిక్ సర్వీసు కమిషనే చేపట్టింది. తర్వాత ఈ బాధ్యతను విద్యాశాఖ పరిధిలోకి తెచ్చారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా విద్యా శాఖాధికారి(డీఈవో) కన్వీనర్‌గా జిల్లా ఎంపిక కమిటీ(డీఎస్‌సీ)లను ఏర్పాటు చేసి ఉపాధ్యాయ నియామకాలను చేపడుతున్నారు. అయితే ఈ ప్రక్రియ విద్యాశాఖకు తలనొప్పి వ్యవహారంగా మారింది. తక్కువ సిబ్బందితో ఎక్కువ పని చేయాల్సి వస్తోంది. అదీ జిల్లాల్లోని సిబ్బంది నేతృత్వంలోనే జరగాల్సిరావడంతో పనిభారం తీవ్రమైంది. నిబంధనలు, రిజర్వేషన్లు, రోస్టర్ విధానంపై డీఈవోలకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఓపెన్ కోటా పోస్టులను లోకల్, నాన్‌లోకల్ అభ్యర్థుల్లో మెరిట్ ఆధారంగా భర్తీ చేయాల్సి ఉన్నా.. మొత్తంగా నాన్‌లోకల్ అభ్యర్థులతోనే భర్తీ చేసిన సందర్భాలు ఉన్నాయి. పైగా ఈ పని ఒత్తిడి వల్ల డీఈవోలకు పాఠశాలలను పట్టించుకునే పరిస్థితి లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో ఈ బాధ్యతలను సర్వీస్ కమిషన్‌కే అప్పగించేందుకు విద్యాశాఖ సుముఖంగా ఉంది. మిగతా శాఖల పరిస్థితి కూడా దాదాపుగా ఇంతే. కాగా, కార్పొరేషన్ల పరిధిలోని పోస్టుల భర్తీని కూడా టీఎస్‌పీఎస్సీ పరిధిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. తద్వారా పారదర్శకంగా నియామకాలు చేపట్టే అవకాశం ఉంటుందని భావిస్తోంది.
రాష్ర్టంలో ప్రస్తుతమున్న ఖాళీలు
పాఠశాల విద్యాశాఖ-24,861, ఉన్నత విద్యాశాఖ-10,592, హోంశాఖ-15,339, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ-11,834, రెవెన్యూ-10,142, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ-7,193, మహిళ, శిశు సంక్షేమ శాఖ-5,074, సాంఘిక సంక్షేమ శాఖ-3,376, నీటిపారుదల, ఆయక ట్టు అభివృద్ధి సంస్థ-2,584, వ్యవసాయ సహకార శాఖ-2,164, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ-2,759, పశుసంవర్థక శాఖ-1,761, ఆర్థిక శాఖ- 1,330, బీసీ సంక్షేమ శాఖ-748, రోడ్లు భవనాల శాఖ - 891, సాధారణ పరిపాలన శాఖ -710, వాణిజ్య, పరిశ్రమలు-383, ఐటీ శాఖ-192, సీఎఎఫ్-419, ఈఎఫ్‌ఎస్‌అండ్‌టీ-2,777, ఇంధన శాఖ-19, గృహ నిర్మాణ శాఖ-6, ఐ అండ్ ఐ-1, న్యాయ శాఖ-196, లెజిస్లేటివ్ సెక్రటేరియట్-227, ఎల్‌ఈటీ అండ్ ఎఫ్- 1,493, మైనారిటీ సంక్షేమ శాఖ-48, ప్లానింగ్-247, యువజన, పర్యాటక శాఖ-367, పబ్లిక్ ఎంటర్‌ప్రజైస్-7, రెయిన్ షాడో ఏరియా డెవలప్‌మెంట్-4.
ఇక ఒకే ఒక్కటి
Published Sat, Dec 20 2014 1:09 AM | Last Updated on Sat, Aug 11 2018 4:59 PM
Advertisement