
గ్రూప్–2 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 12 నుంచి 24 వరకు
టీఎస్‌పీఎస్సీ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–2 సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ఈ నెల 12 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. తేదీల వారీగా వెరిఫికేషన్‌కు హాజరుకావాల్సిన అభ్యర్థుల జాబితాలను తమ వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచింది. గ్రూప్–2 పరీక్షలో వైట్‌నర్ ఉపయోగించి అభ్యర్థి వివరాలను మార్పు చేసిన వాటినే అనుమతించామని, వైట్‌నర్‌తో జవాబులు మార్పు చేసిన అభ్యర్థులను అనుమతించలేదని టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. గత నవంబర్‌లో జరిగిన పరీక్షలో విద్యార్థులకు ఇచ్చిన ఓఎంఆర్ జవాబుపత్రం, ప్రశ్నపత్రం సరిపోలకపోవడంతో వాటిని మార్చారు.
ఈ క్రమంలో ముందుగా ఇచ్చిన ఓఎంఆర్ జవాబు పత్రంలో అభ్యర్థికి సంబంధించిన వివరాలను, ప్రశ్న పత్రం బుక్‌లెట్ కోడ్ మాత్రమే కొంతమంది అభ్యర్థులు వైట్‌నర్ ఉపయోగించి మార్పు చేశారని పేర్కొంది. ఇదే విషయాన్ని అభ్యర్థులతోపాటు చీఫ్ సూపరిం టెండెంట్లు తెలియ జేశారంది. దీనిపై టెక్నికల్ కమిటీ వేశామని, ఆ కమిటీ సూచ నల మేరకు వివరాలను మాత్రమే వైట్‌నర్‌తో మార్పు చేసిన వారి ఫలితాలను ఇచ్చామని, జవాబులను మార్పు చేసిన వారి ఫలితాలను ఇవ్వలేదని తెలిపింది. నామినల్ రోల్స్ ఇతర వివరాలను సరిచూశాకే ఫలితాలను ఇచ్చామంది. దీనివల్ల మెరిట్ విషయంలో ఎవరికీ అన్యాయం జరిగే అవకాశం ఉండదని పేర్కొంది.