సమ్మె ‘సెలవు’పై నీలిమేఘాలు! | Guarantees given to the RTC workers are not fully implemented | Sakshi
Sakshi News home page

సమ్మె ‘సెలవు’పై నీలిమేఘాలు!

Published Sat, Jul 28 2018 2:35 AM | Last Updated on Sat, Jul 28 2018 2:35 AM

Guarantees given to the RTC workers are not fully implemented - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సకల జనుల సమ్మె విషయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు నేటికీ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. సమ్మె కాలాన్ని స్పెషల్‌ క్యాజువల్‌ లీవులుగా పరిగణిస్తామన్న ప్రభుత్వ హామీ నేటికీ నెరవేరకపోవడంపై కార్మికులు మండిపడుతున్నారు.

దాదాపు 27 రోజులు సమ్మెలో పాల్గొన్న తమను తెలంగాణ రాష్ట్రం వచ్చాక విస్మరించడం సరికాదని వాపోతున్నారు. సమ్మె ముగిసి ఏడేళ్లు గడుస్తున్నా.. ఈ విషయంలో ఎలాంటి ముందడుగు పడకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన శాఖలకు స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌ వర్తింపజేసిన ప్రభుత్వం తమకు సవతి ప్రేమ చూపుతోందని ఆరోపిస్తున్నారు.

నేపథ్యం ఇదీ!
తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. 27 రోజులు (19–09–2011 నుంచి 15–10–2011 వరకు) సమ్మెలో పాల్గొన్నారు. సమ్మె అనంతరం కార్మికులు ఆర్జిత సెలవులను వేతనంగా మలుచుకున్నారు.

తెలంగాణ వచ్చాక.. ప్రభుత్వం సకల జనుల సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులందరికీ సమ్మె కాలాన్ని స్పెషల్‌ క్యాజువల్‌ లీవులుగా పరిగణిస్తూ జీఓ01–2016ను జారీ చేసింది. దీని ప్రకారం ఇతర విభాగాల్లో పాల్గొన్న ఉద్యోగులందరికీ సమ్మె కాలాన్ని స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌ పరిగణించారు. కానీ ఆర్టీసీలో అమలు కాలేదు. దీంతో వీరికి రావాల్సిన ఆర్జిత సెలవులు జత కాలేదు.

మంత్రులు అంగీకరించినా..
గత జూన్‌లో మధ్యంతర భృతి కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జరిగిన చర్చల్లోనూ స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌ విషయం ప్రస్తావనకు వచ్చింది. చర్చల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, మహేందర్‌రెడ్డి, కేటీఆర్‌ తదితరులు స్పెషల్‌ క్యాజువల్‌ లీవులను ఇచ్చేందుకు, సమ్మెలో పాల్గొన్న కాలానికి వేతనం చెల్లించేందుకు అంగీకరించారు.

ఈ మేరకు దాదాపు రూ.80 కోట్లు చెల్లించేందుకు సీఎం కేసీఆర్‌ కూడా సుముఖత తెలిపారు. కానీ ఆ ఆదేశాల అమలులో జాప్యం జరుగుతోంది. సీఎం ఆదేశాలను అమలు చేయాలంటూ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ సునీల్‌ శర్మ సర్క్యులర్‌ జారీ చేసినా ఉపయోగం లేకుండాపో యిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెరపైకి ఈఎల్స్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌
ఓ వైపు సకల జనుల సమ్మె సమయంలో రావాల్సిన స్పెషల్‌ క్యాజువల్‌ లీవుల అమలు జరగలేదు. మరోవైపు సంస్థలో 2013లో ఉద్యోగులు వాడుకోకుండా మిగిలిపోయిన ఆర్జిత సెలవులను నగదు రూపంలోకి మార్చుకునే వీలు కల్పిస్తూ ఆర్టీసీ ఉత్తర్వులు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఆగస్టు 14న ఉత్తర్వులు వెలువరించేందుకు సమాయత్తమవుతోంది. 2014 సంవత్సరం లీవుల చెల్లింపులు సెప్టెంబర్‌లో ఉంటాయని సమాచారం. ఇందులోనూ రిటైర్డ్‌ కార్మికుల ప్రస్తావన ఉండదన్న ప్రచారం విశ్రాంత ఉద్యోగులను కలవరపెడుతోంది.

రిటైర్డ్‌ కార్మికుల ఊసే లేదు
సకల జనుల సమ్మె తర్వాత ఆర్టీసీలో దాదాపు 7,000 మందికిపైగా కార్మికులు రిటైర్‌ అయ్యారు. సమ్మె కాలంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్జిత సెలవుల విషయంలో వీరికి ఎలాంటి చెల్లింపులు ఉండవన్న సంకేతాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే రిటైరయ్యారన్న కారణంతో స్పెషల్‌ క్యాజువల్‌ లీవులను వర్తించే విషయంలోనూ వీరిని పరిగణనలోకి తీసుకోవాలన్న ప్రచారం కూడా మొదలైంది. ఉద్యమంలో పాల్గొన్న తమకు రిటైరయ్యామన్న కారణంతో చెల్లింపులు చేయకపోవడం తగదని వారు వాపోతున్నారు.


ఇది నిధుల దారి మళ్లింపే..
ఇది ముమ్మాటికీ నిధుల దారి మళ్లింపే. సకల జనుల సమ్మె సమయంలో ఇచ్చిన స్పెషల్‌ క్యాజువల్‌ లీవుల విషయం, వేతన హామీలు అమలు చేయకుండా 2013 ఆర్జిత సెలవులను నగదుగా ఎలా మారుస్తారు. స్పెషల్‌ క్యాజువల్‌ లీవుల విషయాన్ని కార్మికులు మర్చిపోయేందుకే ఈ విషయాన్ని సంస్థ తెరపైకి తీసుకువస్తోంది. కార్మికులకు రూ.80 కోట్లు చెల్లిస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలుకాకపోవడం శోచనీయం. ఇది అధికార టీఎంయూ వైఫల్యమే.     – అశోక్, ఎన్‌ఎంయూ ఉప ప్రధాన కార్యదర్శి   ,– హన్మంత్, తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి  

వారిది అసత్య ప్రచారం
సకల జనుల సమ్మెలో పాల్గొన్న కార్మికులకు రావాల్సిన అన్ని బెనిఫిట్లు వస్తాయి. అందులో సందేహం లేదు. ఈ విషయంలో ఇతర యూనియన్లు కార్మికులను తప్పదోవ పట్టిస్తున్నాయి. ఇటీవల సీఎం విడుదల చేసిన రూ.80 కోట్ల విషయంలో స్పష్టత లోపించడంతో ఆర్థిక శాఖ అభ్యంతరం తెలిపిన మాట వాస్తవమే.

వీటిని ఇలాగే వదిలేస్తే.. నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదముంది. అందుకే ఆ నిధులతోనే 2013 ఆర్జిత సెలవులను నగదుగా మార్చే వీలు కల్పించేలా కృషి చేశాం. త్వరలోనే సకల జనుల సమ్మెకు సంబంధించిన స్పెషల్‌ క్యాజువల్‌ లీవుల సమస్య కూడా సమసి పోతుంది. రిటైర్డ్‌ కార్మికుల సమస్య తీరేలా కృషి చేస్తాం. – అశ్వత్థామరెడ్డి, తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ అధ్యక్షుడు,థామస్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

అందరికీ అన్నీ వస్తాయి
ప్రస్తుతం జరుగుతున్న చెల్లింపులపై కార్మికులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదు. అందరికీ అన్ని చెల్లింపులు అందుతాయి. సంస్థ ఎవరినీ విస్మరించరాదన్న విషయాన్ని గమనించాలి. స్పెషల్‌ క్యాజువల్‌ లీవుల విషయం త్వరలోనే పరిష్కరిస్తాం. రిటైర్డ్‌ కార్మికులకూ అన్యాయం చేయం.
– సోమారపు సత్యనారాయణ,
    ఆర్టీసీ చైర్మన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement