పట్టుకున్న చెయ్యే పేల్చిందా..?  | Gun Shot Residue Becoming Crucial In Suspicious Encounter | Sakshi
Sakshi News home page

పట్టుకున్న చెయ్యే పేల్చిందా..? 

Published Mon, Dec 9 2019 1:51 AM | Last Updated on Mon, Dec 9 2019 1:57 AM

Gun Shot Residue Becoming Crucial In Suspicious Encounter - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘కీలక ఆధారాల సేకరణ కోసం నలుగురినీ తీసుకువెళ్లాం. తప్పించుకునే ప్రయత్నం చేసిన నిందితులు పోలీసుల వద్ద తుపాకులు లాక్కుని కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం జరిపిన ఎదురు కాల్పుల్లో వారు చనిపోయారు’ . ఇది ‘దిశ’ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి పోలీసులు చెబుతున్న మాట.

అయితే ఈ వ్యవహారంలో గన్‌ షాట్‌ రెసిడ్యూ(జీఎస్సార్‌)విధానం అత్యంత కీలకంగా మారనుంది. ప్రాథమిక ఆధారాలు, ఇతర అంశాలను బట్టి పోలీసులు చెప్పింది నిజమేనని కనిపిస్తున్నా.. సాంకేతికంగా నిరూపించడంతోపాటు పోలీసులపై ఉన్న అనుమానాలు పూర్తిగా నివృత్తి కావడానికి ఎన్‌కౌంటర్‌ కేసులో జీఎస్సార్‌ నివేదికలే కీలకంగా మారనున్నాయి.  

రెండుగా బుల్లెట్‌.. 
తుపాకీలో ఉండే తూటా పైకి ఒకటిలానే కనిపించినా.. అందులో రెండు భాగాలుంటాయి. పేల్చిన వెంట నే దూసుకుపోయే ముందు భాగమైన బుల్లెట్‌ ఒకటి కాగా.. అలా దూసుకుపోవడానికి అవసరమైన శక్తిని అందించే క్యాట్రిడ్జ్‌ (బుల్లెట్‌ కేస్‌) మరొకటి. రివాల్వర్‌ విషయానికి వస్తే సిలిండర్‌లో లోడ్‌ అయి ఉండే తూటాను కాల్చాలని భావించిన వ్యక్తి తన చూపుడు వేలితో ట్రిగ్గర్‌ను నొక్కుతాడు.

ఆ వెంటనే తుపాకీపైన వెనుక భాగంలో ఉండే హేమర్‌ తూటా వెనుక భాగంలో మధ్యలో ఉండే ప్రైమర్‌ను హిట్‌ చేస్తుంది. దీంతో బుల్లెట్‌ కేస్‌లో ఉండే ప్రొపెల్లెంట్‌గా పిలిచే గన్‌ పౌడర్‌ మండుతుంది. ఫలితంగా ఉత్పన్నమయ్యే శక్తి బుల్లెట్‌ను ముందుకు దూసుకుపోయేలా చేస్తుంది. ఇలా కాల్చిన తర్వాత మిగిలే ఎమ్టీ క్యాట్రిడ్జ్‌ రివాల్వర్‌ సిలిండర్‌లోనే ఉండిపోతుంది. పిస్టల్‌ విషయానికి వస్తే కుడివైపు పైభాగాన ఉండే ప్రత్యేక అర నుంచి బయటకు పడిపోతుంది.  

జీఎస్సార్‌ అంటే.. 
తూటాను కాల్చినప్పుడు హేమర్‌ ధాటికి ప్రైమర్‌ ప్రేరేపితమై బుల్లెట్‌ కేస్‌లో ఉండే గన్‌ పౌడర్‌ను మండిస్తుంది. అత్యంత స్వల్ప వ్యవధిలోనే ముందు భాగంలో ఉండే బుల్లెట్‌ దూసుకుపోవడంతో గన్‌ పౌడర్‌ పూర్తిగా కాలిపోదు. బుల్లెట్‌ కేస్‌ నుంచి స్వల్ప మొత్తంలో బయటకు చిమ్ముతుంది. అది ఆ తుపాకీని కాల్చిన వ్యక్తి చేతి బొటన వేలు, చూపుడు వేళ్ల మధ్య భాగంలో పడుతుంది. దీన్నే సాంకేతిక పరిభాషలో జీఎస్సార్‌ అంటారు.

కంటికి కనిపించని ఈ జీఎస్సార్‌ను స్వాబ్స్‌ ద్వారా సేకరించి ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపిస్తారు. ఫలానా తుపాకీని, ఫలానా వ్యక్తే ఫైర్‌ చేశారు అని అధికారికంగా, సాంకేతికంగా నిర్ధారించడానికి ఈ జీఎస్సార్‌ నివేదికలు ఎంతో కీలకం. వేరే వ్యక్తులు ఎవరైనా సదరు ఆయుధాన్ని వినియోగించి ఓ వ్యక్తిని హత్య చేసి, ఆపై తుపాకీని చనిపోయిన వ్యక్తి చేతుల్లో పెట్టే అవకాశాలు ఉంటాయి. ఇలాంటప్పుడు చనిపోయిన వ్యక్తి చేతి వేళ్లపైన జీఎస్సార్‌ కనిపించదు. 

ఇలా కీలకం.. 
దిశ కేసులో నిందితులుగా ఉన్న నలుగురిలో ప్రధాన నిందితుడు ఆరిఫ్‌తోపాటు నాలుగో నిందితుడు చెన్నకేశవులు పోలీసులపై దాడికి దిగారు. అధికారుల వద్ద ఉన్న సర్వీస్‌ తుపాకులైన పిస్టల్స్‌ లాక్కుని ఇద్దరూ కాల్పులు జరిపారన్నది పోలీసులు చెబుతున్న అంశం. ఈ నేపథ్యంలో ఎన్‌కౌంటర్‌ స్థలికి వెళ్లిన క్లూస్‌ టీమ్, ఫోరెన్సిక్‌ నిపుణులు ఆ ఇద్దరి కుడి చేతి బొటన, చూపుడు వేళ్ల మధ్య నుంచి నమూనాలు సేకరించారు.

వీటిని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీకి పంపిన అధికారులు.. ఆ నివేదికల ఆధారంగా నిందితులు కాల్పులు జరిపినట్లు నిర్ధారించనున్నారు. ‘ఆ తుపాకులపై ఉన్న నిందితుల వేలిముద్రల్ని బట్టి వాళ్లు వాటిని పట్టుకున్నారని మాత్రమే చెప్పగలం. జీఎస్సార్‌ నివేదికల ఆధారంగానే ఆ తుపాకీని వాళ్లే కాల్చారా? లేదా? అనేది తేల్చగలం’అని ఫోరెన్సిక్‌ విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement