అపద్ధర్మ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట : ‘ప్రజలంతా టీఆర్‌ఎస్ వైపే ఉన్నారని.. చెప్పేలా ఈ నెల 4న నల్లగొండ జిల్లాకేంద్రంలో సభ నిర్వహిస్తున్నాం.. గతంలో ఏ పార్టీ చేయనట్లుగా ఈ సభ అద్భుతంగా ఉండబోతోంది. ప్రజలు ద్విచక్ర వాహనాలు, పాదయాత్రలతో స్వచ్ఛందంగా.. ఉత్సాహంగా సభకు తరలేందుకు సన్నద్ధమవుతున్నారు. మూడున్నర లక్షల మంది ఈ సభకు హాజరుకాబోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సభలో ఏం చెబుతారో వినేందుకు ప్రజలు తరలుతున్నారు. మాయకూటమికి ఉమ్మడి జిల్లాలో ఓటు అడిగేందుకు.. ఒక్క అంశంపైనా అర్హత లేదు. ఉమ్మడి జిల్లాలో మేమేంటో సభే చెబుతుంది’ అని విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండలో నిర్వహించబోతున్న ఆ పార్టీ సభ, అభ్యర్థుల విజయావకాశాలు, ఉమ్మడి జిల్లాకు చేసిన అభివృద్ధిపై సోమవారం ‘సాక్షి’ కి ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాలు ఆయన మాటల్లోనే..
టీఆర్‌ఎస్‌కే ఓటు అడిగే హక్కు ఉంది..
రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో కేవలం తెలంగాణ రాష్ట్ర సమితికి మాత్రమే ప్రజలను ఓట్లు అడిగే హక్కు ఉంది. 2014 ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అక్షరాన్ని అమలుచేశాం. ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఉమ్మడి జిల్లాలో ప్రతి కేటగిరీ లబ్ధి పొందింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వ నాలుగున్నరేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి గతంలో కాంగ్రెస్, టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధిని ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చాం.. రైతులకు రైతుబంధు, ప్రమాదబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారఖ్ ఇలా అన్ని వర్గాలను సంతృప్తి పరిచాం. గ్రామీణవృత్తులకు జీవం పోసింది.. ఈ ప్రభుత్వమే. గ్రామీణ ప్రాంతాల్లో గొర్రెలకాపరులకు గొర్రెలు, మత్స్య కార్మికుల కోసం చేపల పంపిణీ చేపట్టి వారి ఆదాయాన్ని పెంచాం. ఇలా వంద కారణాలు ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓటు వేయడానికి ఉన్నాయి.
మాయకూటమిలోని పార్టీల పాలనలో భూములకు నీళ్లందాయా..
కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల కాలంలో నాగార్జునసాగర్ ఆయకట్టు కింద చివరి భూములకు నీళ్లందలేదు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగర్‌లో డెడ్‌స్టోరేజీ నీళ్లు ఉన్నా.. సాగుకు నీళ్లిచ్చాం. రాజవరం, ముదిమాణిక్యం, జానపహాడ్ లాంటి టెయిలాండ్ భూములకు ఇప్పుడు నీళ్లందాయి. జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ఏనాడైనా సాగునీళ్ల కోసం తమ ప్రభుత్వాల్లో ప్రశ్నించలేదు. ప్రశ్నిస్తే తమ మంత్రి పదవులు ఎక్కడ ఊడిపోతాయోనని మిన్నకుండా ఉన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడాన్ని ప్రజలు అసహించుకుంటున్నారు. విభజన చట్టం ప్రకారం.. రాష్ట్రానికి రావాల్సిన కరెంటు, నీళ్లను ఇవ్వొద్దంటూ చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాశాడు. ప్రత్యేకంగా ఉమ్మడి జిల్లాలో సాగర్, శ్రీశైలం నీటి విడుదలపై పేచీ పెట్టింది టీడీపీ కాదా.
12 స్థానాల్లో టీఆర్‌ఎస్ జెండా ఎగరవేస్తాం..
జిల్లాలో 12 స్థానాల్లో టీఆర్‌ఎస్ జెండా ఎగరవేయబోతుంది. నాలుగైదుసార్లు మంత్రులుగా పనిచేసిన వారి ఇలాఖాల్లో కూడా గులాబీ జెండా రెపరెపలాడబోతోంది. ఉమ్మడి జిల్లాలో పాలమూరు, డిండి, శివన్నగూడెం, ఎస్సారెస్పీ జలాలు, నల్లగొండ, సూర్యాపేటకు మెడికల్ కళాశాలలు, ఏయిమ్స్, యాదాద్రి పవర్‌ప్లాంటు, యాదాద్రి దేవాలయం ఇలా అభివృద్ధి ఆకాశాన్ని తగిలింది. ప్రజలు ఈ అభివృద్ధిని చూసే 12 స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టబోతున్నారు. ఫ్లోరోసిస్ భూతాన్ని ఉమ్మడిజిల్లాలో తరిమికొట్టింది టీఆర్‌ఎస్ ప్రభుత్వమే. రక్షిత మంచినీటిని అందించేందుకు పెట్టిన మిషన్‌భగీరథ పథకం సక్సెస్ అవుతోంది. మరోవైపు 28 ఏళ్లలో ఏనాడు నాటి పాలకులు మూసీ ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు నీటిని అందించలేదు. కాకతీయులు, అసఫ్‌జాహీలా కాలంలో తవ్విన కాలువలు ధ్వంసమైతే తమ ప్రభుత్వమే ఆధునికీకరించింది. తొలిసారి ఖరీఫ్, రబీ పంటలకు వరుసగా.. నీళ్లు ఇచ్చింది తమ ప్రభుత్వమే.
అసమ్మతులు సమసిపోతున్నాయ్..
ప్రజాభిమానం ఉన్న పార్టీలో టిక్కెట్ల కోసం ఆశావహులు ఎక్కువగా పోటీ పడడం అన్నది సహజం. జిల్లాలో అభ్యర్థులను ప్రకటించిన స్థానాల్లో అసమ్మతులు సమసిపోతున్నాయ్. అన్ని స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా అందరం కలిసి కృషి చేస్తున్నాం. ఈనెల 4న జరిగే సభతో మా సత్తా ఏంటో ఉమ్మడి జిల్లాలో తేలిపోతుంది. జిల్లాలో మాకేదో ఉందని.. బీరాలు పలుకుతున్న నేతల కళ్లు సభను చూసి బైర్లు కమ్ముతాయి.
59 మండలాలకు వెళ్లా..
ఉమ్మడి జిల్లాలో 59 మండలాల్లో 400 గ్రామాలకు వెళ్లా. ఈ గ్రామాల్లో శంకుస్థాపనలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశా. ఉమ్మడి జిల్లాలో గతంలో ఏ మంత్రి కూడా అన్ని మండలాలకు వెళ్లి ఇన్ని గ్రామాలను సందర్శిం చిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి మంత్రివర్గానికి చేసిన సూచనలతో ప్రజల వద్దకు పాలన అంటూ గ్రామాలకు వెళ్లి ప్రజాక్షేత్రంలో గడిపాం. వాళ్లకు ఏం కావాలో ఇచ్చాం. వాళ్లడగనివి సైతం అమలుచేశాం. ఇదే మా గెలుపునకు గీటురాయి.
Comments
Please login to add a commentAdd a comment