మమ్మల్ని బతికించండి | Guvvalagutta people troubles with water problem | Sakshi
Sakshi News home page

మమ్మల్ని బతికించండి

Published Thu, Aug 31 2017 2:39 AM | Last Updated on Sun, Sep 17 2017 6:09 PM

మమ్మల్ని బతికించండి

మమ్మల్ని బతికించండి

వాటర్‌ అనాలసిస్ట్‌ బృందానికి గువ్వలగుట్ట వాసుల వినతి 
 
చందంపేట (దేవరకొండ): ‘కృష్ణమ్మ పక్కనే ఉన్నా.. తాగనీకి స్వచ్ఛమైన నీళ్లు లేక సుద్దనీటిని తాగుతూ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాం. గ్రామస్తులు పిట్టల్లా రాలుతున్నారు. మమ్మల్ని బతికించండి’అంటూ నల్లగొండ జిల్లా చందంపేట మండలం గువ్వలగుట్ట గ్రామస్తులు బుధవారం ఆ గ్రామానికి వచ్చిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడికల్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబ్స్‌ బృందానికి విన్నవించారు. కిడ్నీ వ్యాధులతో అవస్థలుపడుతున్న గ్రామ ప్రజల ఆవేదన, దుస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ‘సాక్షి’ ఈనెల 16న సాక్షి ప్రధాన సంచికలో ‘‘జనం పరిస్థితి అధ్వానం..ఇది మన ఉద్ధానం’’, బుధవారం రోజున మరో ‘‘ప్రాణం పోయింది’’అనే శీర్షికన కథనాలను ప్రచురించింది.

ఈ కథనాలకు స్పందించిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడికల్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబ్స్‌ బృందం చీఫ్‌ వాటర్‌ అనాలసిస్ట్‌ బి. ఆంజనేయులు, సీనియర్‌ వాటర్‌ అనాలసిస్ట్‌ వి.కిరణ్మయి బుధవారం గువ్వలగుట్ట, మంగళితండాలను సందర్శించారు. గ్రామంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు, గ్రామస్తులతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ప్రజలు ప్రభుత్వానికి మా గోస తెలుస్తలేదని, ఊరు వల్లకాడయ్యాకే స్పందిస్తుందా? అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మమ్ములను బతికించండి సారూ.. అని వారు వేడుకున్నారు.

ఈ గ్రామంలో పర్యటించిన బృందానికి 50 ఏళ్ల పైబడిన వృద్ధులు ఏ ఒక్కరూ కానరాకపోవడంతో సభ్యులు ఇదేంటని ప్రశ్నించారు. గ్రామస్తులు మా తండాలో 50 ఏళ్లకు మించి బతకడం లేదని చెప్పడంతో అవాక్కయ్యారు. అనంతరం గ్రామంలో చేతిపంపులు, బోర్ల నుంచి సేకరించిన నీటి నమూనాలను పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు పంపనున్నట్లు తెలిపారు. ఫిజికల్‌ కెమికల్‌ అనాలసిస్, బ్యాక్ట్రాలజికల్‌ అనాలసిస్‌ పరీక్షలు నిర్వహించిన తర్వాత పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని వారు తెలిపారు. బృందం సభ్యుల్లో వేణుగోపాల్, గోవర్ధనాచారి తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement