నగరంలోని పలు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులు కోవిడ్–19 గుప్పిట్లోవిలవిల్లాడుతున్నాయి. ఇతర వైద్యులతో పోలిస్తే గైనకాలజీ వైద్యులు వైరస్‌కుఎక్కువగా ఎక్స్‌పోజ్ అవుతున్నారు. ఫలితంగా పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణులకు ప్రసవం చేయాలంటేనే వైద్యులు భయపడుతున్నారు.సకాలంలో వైద్యసేవలు అందక గర్భిణులు సైతం ఇబ్బంది పడుతున్నారు.
సాక్షి, సిటీబ్యూరో: సహజ, సిజేరియన్ ప్రసవ సమయంలోనే కాదు.. ఓపీకి వచ్చే గర్భిణులను వివిధ చెకప్‌ల పేరుతో తరచూ ముట్టుకోవాల్సి వస్తుంది. ఆపరేషన్ థియేటర్, ఐసీయూలో పని చేస్తున్న వైద్యులు పీపీ ఈ కిట్స్, ఎన్–95 మాస్క్‌లు, చేతి గ్లౌజులు ధరించి వైరస్ బారిన పడకుండా కొంత వరకు జాగ్రత్త పడుతున్నప్పటికీ... ఓపీ, ఐపీల్లో పనిచేసే వారు మాత్రం వైరస్ బారి నుంచి తప్పించుకోలేక పోతున్నారు.
పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో...
పేట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరు యూనిట్లు ఉండగా, ఒక్కో యూనిట్‌లో ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్ల చొప్పున మొత్తం 24 మంది పని చేస్తున్నారు. వీరిలో ఒక ప్రొఫెసర్ సహా ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు సీనియర్ రెసిడెంట్లకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలిసింది. ఇక్కడ పని చేస్తున్న 20 పీజీల్లో ఇప్పటికే 12 మందికి పీజీలకు పాజిటివ్ వచ్చింది. మరో 8 మంది రిపోర్టులు రావాల్సి ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పాజిటివ్ వచ్చిన వైద్యులను కింగ్‌కోఠి, గాంధీ ఆస్పత్రులకు తరలించారు. వారికి సన్నిహితంగా మెలిగిన సహచర వైద్యులను క్వారంటైన్ చేశారు. ఇక ఆస్పత్రిలో పన్నెండు మంది కాంట్రాక్ట్ రెసిడెంట్లు ఉండగా, వీరిలో ఇద్దరికి వైరస్ సోకడంతో మిగిలిన వారంతా భయంతో విధులకు గైర్హజరవుతున్నట్లు తెలిసింది. కీలక విభాగాల్లోని ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు వైరస్ సోకడం, ఒకరు లీవ్‌లో ఉండటంతో మిగిలిన తొమ్మిది మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లలో ఐసీఎంఆర్ నిబంధనల మేరకు కేవలం నలుగురు డ్యూటీలో ఉంటే.. ముగ్గురు క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తుంది. ఆస్పత్రి ఓపీకి రోజుకు సగటున 400–600 మంది గర్భిణులు వస్తుంటారు. ఇక్కడ రోజుకు 40 నుంచి 60 ప్రసవాలు జరుగుతుంటాయి. రోగుల నిష్పత్తికి తగి నంత మంది వైద్యులు లేక పోవడం, ఉన్నవారిని కూడా కరోనా వైరస్ భయం వెంటాడుతుండటంతో రోగులకు కనీస వైద్యసేవలు అందకుండా పోయాయి.
సుల్తాన్‌బజార్ ఆస్పత్రి కిటకిట...
గాంధీ గైనకాలజీ విభాగంలో ఆరు యూనిట్లు ఉన్నాయి. వీటిలో రెండు యూనిట్‌లను కరోనా వైరస్ బారిన పడిన గర్భిణులకు చికిత్స చేసేందుకు గాంధీలోనే ఉంచారు. ఇప్పటికే వీరు కరోనా బారిన పడిన నలుగురు గర్భిణులకు కూడా విజయవంతంగా ప్రసవం చేశారు. మిగిలిన యూనిట్లను ఉస్మానియా వైద్య కశాళాలకు అనుబంధంగా పని చేస్తున్న సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్ప్రతికి తరలించారు. దీంతో ఈ ఆస్పత్రి కిటకిటలాడుతోంది. మార్చి వరకు గాంధీలో ఫాలో అప్ కోసం వచ్చిన ఆయా ప్రాంతాలకు చెందిన గర్భిణులను సుల్తాన్ బజార్ ప్రసూతి ఆస్పత్రికి తరలించి చికిత్సలు చేస్తున్నారు. వైద్యులు కూడా ఒక రోజు రెండు ఆస్పత్రులు తిరిగి చికిత్సలు చేయాల్సి వస్తుంది. కరోనా వైరస్ భయంతో సిటీ శివారు ప్రాంతాల్లో ఉన్న ఏరియా ఆస్పత్రుల్లోనూ గర్భిణులను చూసేందుకు వైద్యులు భయపడుతున్నారు.
ఒకే యూనిట్‌గా పరిగణించాలి
పేట్లబురుజు, సుల్తాన్‌బజార్, నిలోఫర్, గాంధీ గైనకాలజీ విభాగాలను వేర్వేరు యూనిట్లుగా కాకుండా ఒకే యూనిట్ కిందికి తీసుకురావడం ద్వారా ఆయా ఆస్పత్రుల్లో పని చేస్తున్న ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్, పీజీల్లో 2/3 వైద్యులను విధుల్లో ఉంచిæ, మరో 1/3 వైద్యులు క్వారంటైన్‌లో ఉండేలా చూడొచ్చు. ఓపీకి వస్తున్న గర్భిణులకు ముందే కరోనా పరీక్షలు నిర్వహించడం వల్ల వైద్యులు వైరస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. – డాక్టర్ బొంగు రమేష్, చైర్మన్, ప్రభుత్వ వైద్యుల సంఘం
Comments
Please login to add a commentAdd a comment