
పూజలు చేస్తున్న భక్తులు
అమ్రాబాద్: నల్లమల లోతట్టు ప్రాంతం పదర మండలంలోని మద్దిమడుగు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. హనుమాన్ జయంత్యుత్సవాల సందర్భంగా ఆంజనేయ దీక్ష స్వాములతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో మద్దిమడుగు చేరుకుంటున్నారు. గురువారం ప్రారంభమైన ఆంజనేయస్వామి ఉత్సవాలు రెండు రోజులుగా జరుగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా హనుమన్ నామస్మరణతో మార్మోగిపోతోంది.
ఉత్సవాల్లో భాగంగా వేదపండితులు వీరయ్యశాస్త్రి, వీరయ్య శర్మల ఆధ్వర్యంలో ఉదయం ద్వాదశపూజ, హోమం రుద్రహోమం, మన్యసూక్తి హోమం, గవ్యాంతర పూజలు, బలిహరణ సహస్రనామార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పదర పీహెచ్ ఆధ్వర్యంలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటన జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో ఈఓ సత్యనారాయణ, సర్పంచు పద్మాబాయి, ఆలయ అధికారులు జైపాల్‌రెడ్డి, జంగయ్య, విశ్వేశ్వరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.