నిఘా నేత్రం | Hanuman Jayantyhi Shobhayatra Today Hyderabad | Sakshi
Sakshi News home page

నిఘా నేత్రం

Published Fri, Apr 19 2019 9:35 AM | Last Updated on Tue, Apr 23 2019 7:26 AM

Hanuman Jayantyhi Shobhayatra Today Hyderabad - Sakshi

వీడియో కాన్ఫరెన్స్‌లో సీపీ అంజనీకుమార్‌ తదితరులు

సాక్షి, సిటీబ్యూరో: హనుమాన్‌ జయంతి సందర్భంగా శుక్రవారం నిర్వహించనున్న శోభాయాత్రకు నగర పోలీసులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. పోలీస్‌ సిబ్బందితో పాటు సాయుధ బలగాలతో భారీ బందోబస్తును వినియోగించనున్నారు. మొత్తం 12వేల మంది విధులు నిర్వర్తించనున్నారు. బందోబస్తు, భద్రత ఏర్పాట్లపై నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ బుధ, గురువారాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి సమీక్ష నిర్వహించారు. ప్రధాన ఊరేగింపు మార్గాలను పరిశీలించడంతో పాటు యాత్ర ప్రారంభమయ్యే, ముగింపు జరిగే దేవాలయాలను సందర్శించారు. ప్రధాన ఊరేగింపు నగరంలోని మూడు జోన్లలో 27 కి.మీ మేర జరగనుంది. గౌలిగూడ రామ్‌మందిర్‌ దగ్గర ప్రారంభమై తాడ్‌బండ్‌ ఆంజనేయస్వామి దేశాలయం వద్ద ముగుస్తుంది. అదే విధంగా తూర్పు మండలంలోని ఐఎస్‌ సదన్‌ నుంచి మరో ఊరేగింపు 3 కి.మీ సాగి గౌలిగూడ రామ్‌మందిర్‌ వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తుంది. మొత్తమ్మీద 15 ప్రాంతాల నుంచి వచ్చే ఊరేగింపులు ప్రధాన శోభాయాత్రలో కలుస్తాయి.

సైబరాబాద్‌తో పాటు నగరంలోని తూర్పు, మధ్య, ఉత్తర మండలాల్లో మొత్తం 27 కి.మీ మేర జరిగే ఊరేగింపును కమ్యూనిటీ, ట్రాఫిక్‌ సీసీ కెమెరాల ద్వారా బషీర్‌బాగ్‌ కమిషనరేట్‌లోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (సీసీసీ) నుంచి నిత్యం పర్యవేక్షించనున్నారు. అదనంగా 570 తాత్కాలిక, మూవింగ్, వెహికల్‌ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. బందోబస్తులో ఉండే పోలీసులకు మరో 300 హ్యాండీ క్యామ్స్‌ అందజేస్తున్నారు. ప్రతి ఘట్టాన్నీ చిత్రీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఊరేగింపు జరిగే మార్గాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు విధించిన పోలీసులు... గురువారం రాత్రి నుంచే బారికేడ్లు ఏర్పాటు చేయడం ప్రారంభించారు. బందోబస్తును అధికారులు రెండు రకాలుగా విభజించారు. శోభాయాత్ర వెంట ఉండడానికి కొంతమంది, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యవేక్షించడానికి మరికొంత మందిని కేటాయిస్తున్నారు. ప్రతి జోన్‌కు ఆయా డీసీపీలు బాధ్యత వహిస్తారు. వీరికి తోడు ప్రాంతాల వారీగా సీనియర్‌ అధికారులను ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. ఊరేగింపు ముందు, ముగింపులో అదనపు, సంయుక్త పోలీసు కమిషనర్లు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ఊరేగింపుల్లో మొత్తం 2లక్షల మంది భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.

డేగకన్ను...   
హనుమాన్‌ జయంతి, శోభాయాత్ర నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కొత్వాల్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో శాంతిభద్రత విభాగం, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. స్థానిక పోలీసులు మైత్రీ, పీస్‌ కమిటీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు టాస్క్‌ఫోర్స్, లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు రౌడీషీటర్లతో పాటు అనుమానిత వ్యక్తులు, గతంలో ఇబ్బందికరంగా మారిన వారిని తమ కార్యాలయాలకు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. అవసరాన్ని బట్టి కొందరిని బైండోవర్‌ సైతం చేస్తున్నారు. బందోబస్తు విధుల్లో ఉండే ప్రతి ఒక్క పోలీస్‌ తమ చుట్టూ ఉన్న 25 మీటర్ల మేర కన్నేసి ఉంచుతారు. అక్కడ ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ స్మార్ట్‌ ఫోన్లలో ఉన్న ‘టీఎస్‌ కాప్‌’ యాప్‌ ద్వారా వీడియోలు తీస్తూ అప్‌లోడ్‌ చేస్తుంటారు. ఎవరికైనా అనుమానిత వ్యక్తులు తారసపడితే వెంటనే వారి ఫొటోలతో పాటు వివరాలు పోలీసులకు తెలపాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు.  

సర్వం సిద్ధం...
సుల్తాన్‌బజార్‌: హనుమాన్‌ జయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ), బజరంగ్‌దళ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించనున్న వీర హనుమాన్‌ విజయ యాత్రకు సర్వం సిద్ధం చేశామని బజరంగ్‌దళ్‌ రాష్ట్ర కన్వీనర్‌ సుభాశ్‌చందర్‌ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శోభాయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈసారి రెండు లక్షల బైకులతో ర్యాలీ నిర్వహించాలని బజరంగ్‌దళ్‌ నాయకులు నిర్ణయించారు. శుక్రవారం ఉదయం 11గంటలకు కోఠి ఆంధ్రాబ్యాంక్‌ చౌరస్తాలో వేలాది మంది సామూహిక హనుమాన్‌ జయంతి పారాయణం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్‌కుమార్, కేంద్రీయ సంఘటన ప్రధాన కార్యదర్శి వినాయక్‌రావు దేశ్‌పాండే హాజరు కానున్నారు. విజయ యాత్ర ఉదయం 10గంటలకు గౌలిగూడ రామ్‌మందిర్‌ నుంచి ప్రారంభమై తాడ్‌బండ్‌ హనుమాన్‌ ఆలయం వరకు కొనసాగుతుంది.  

ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా...
హనుమాన్‌ జయంతి సందర్భంగా కొన్ని సంస్థలు, సంఘాలు శోభాయాత్ర నిర్వహించనున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. గౌలిగూడ రామ్‌మందిర్‌ నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర పుత్లిబౌలి చౌరస్తా, ఆంధ్రాబ్యాంక్‌ చౌరస్తా, డీఎం అండ్‌ హెచ్‌ఎస్‌ సర్కిల్, రామ్‌కోఠి చౌరస్తా, కాచిగూడ జంక్షన్, వైఎంసీఏ నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, గాంధీనగర్, కవాడీగూడ, బైబిల్‌ హౌస్, ఎంజీ రోడ్, బాలంరాయ్‌ మీదుగా తాడ్‌బండ్‌ హనుమాన్‌ టెంపుల్‌ వరకు సాగనుంది. ఈ మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్థితిగతుల నేపథ్యంలో వాహనచోదకులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కమిషనర్‌ సూచించారు. మరోపక్క ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ నుంచి ముషీరాబాద్‌ చౌరస్తా వైపు ఎలాంటి వాహ నాలను అనుమతించరు. అవసరమైన పక్షంలో ఆర్టీసీ బస్సులను కూడా దారి మళ్లిస్తారు.
అదనపు సీపీలు షికాగోయల్‌ (క్రైమ్‌), అనిల్‌కుమార్‌ (ట్రాఫిక్‌), డీఎస్‌ చౌహాన్‌ (శాంతిభద్రతలు)లు చార్మినార్, సిద్ధి అంబర్‌బజార్‌ మసీదు, సెంట్రల్‌జోన్‌ ప్రాంతాలతో పాటు కీలక అంశాలకు నేతృత్వం వహిస్తారు. 
శోభాయాత్ర ఊరేగింపు ప్రారంభంలో అదనపు సీపీ ఎం.శివప్రసాద్, ముగింపులో అదనపు సీపీ టి.మురళీకృష్ణ ఉండనున్నారు.  
ఐదు జోన్లకు చెందిన టాస్క్‌ఫోర్స్‌ టీమ్స్‌ ఊరేగింపు ఆద్యంతం బందోబస్తు నిర్వహించనున్నాయి.  
పోకిరీలకు చెక్‌ చెప్పడానికి షీ–టీమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు.  
శుక్రవారం ఉదయం 6గంటల నుంచి శనివారం ఉదయం 6గంటల వరకు నగరంలో మద్యం విక్రయాలపై ఆంక్షలు విధించారు.  
కమ్యూనికేషన్‌ పరికరాలు, బైనాక్యూలర్లతో ఎత్తైన భవనాలపై రూఫ్‌ టాప్‌ వాచ్‌ బృందాలు ఏర్పాటు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement