ఖైరతాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రకుసర్వంసిద్ధమైంది. నిమజ్జన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం 7గంటలకు శోభాయాత్ర ప్రారంభమై... మధ్యాహ్నానికి ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెంబర్.6కు చేరుకునేలా అధికారులుఏర్పాట్లు చేస్తున్నారు.
♦ శుక్రవారం రాత్రి 11గంటలకు మహాగణపతి షెడ్డు తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి.
♦ ఎస్‌టీసీ ట్రాన్స్‌పోర్ట్‌కు చెందిన ట్రాయిలర్ వాహనం శుక్రవారం ఉదయమే మహాగణపతి ప్రాంగణానికి చేరుకుంది.
♦ మహాగణపతిని దర్శించుకునేందుకు శనివారం మధ్యాహ్నం వరకే భక్తులకు అనుమతిస్తారు. ఆ తర్వాత దూరం నుంచి మాత్రమే చూడాలి.
♦ శనివారం అర్ధరాత్రి 12గంటలకు కలశాన్ని కదిలించి.. మహాగణపతికి క్రేన్ సెట్టింగ్, వెల్డింగ్ పనులు ప్రారంభిస్తారు.
♦ ఆదివారం తెల్లవారుజాము 3–4 గంటల్లోపు వెల్డింగ్ పనులు పూర్తవుతాయి.
♦ ఉదయం 7గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుంది.
ఇదీ రూట్‌మ్యాప్
శోభాయాత్ర సెన్సేషన్ థియేటర్ మీదుగా రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, హోంసైన్స్ కళాశాల, ఎక్బాల్ మినార్ చౌరస్తా, సచివాలయం పాతగేటు, తెలుగుతల్లి చౌరస్తా.. అక్కడి నుంచి ఎడమ వైపునకు మలుపు తిరిగి లుంబినీ పార్క్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌లోని 6వ నెంబర్ క్రేన్ దగ్గరికి ఉదయం 11గంటల వరకు చేరుకుంటుంది. ఆ తర్వాత పూజలు నిర్వహించి మధ్యాహ్నం 12గంటల్లోపు నిమజ్జనం చేస్తారు.
శివాలయానికి శివపార్వతులు...
మహాగణపతికి కుడివైపున ఏర్పాటు చేసిన శ్రీనివాస కల్యాణం విగ్రహాన్ని మాత్రమే నిమజ్జనానికి తరలిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఎడమవైపున ఏర్పాటు చేసిన శివపార్వతుల విగ్రహాన్ని శ్రావ్య గ్రాఫిక్స్‌కు చెందినవారు వరంగల్ ఆలేరులోని ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన శివ దేవాలయానికి తీసుకెళ్తున్నారు.
ఆరేళ్లుగా ...
మహాగణపతిని నిమజ్జనానికి తరలించే ట్రాయిలర్ వాహనం సారథిగా ఎస్‌టీసీ కంపెనీలో 20ఏళ్లుగా పనిచేస్తున్న భాస్కర్‌రెడ్డి బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. నాగర్‌కర్నూల్‌కు చెందిన భాస్కర్‌రెడ్డి ఆరేళ్లుగా ఖైరతాబాద్ నిమజ్జనానిని రథసారథిగా వ్యవహరిస్తున్నాడు. శోభాయాత్ర ప్రారంభమైన నాలుగు గంటల్లో గణపతిని సాగర తీరానికి చేరుస్తానని ఆయన తెలిపాడు.
ఆపరేటర్ జమీల్..
రవి క్రేన్స్ ఆధ్వర్యంలో ప్రతిఏటా మహాగణపతిని ట్రాయిలర్ వాహనంలోకి ఎక్కిస్తున్నారు. తర్వాత తిరిగి అందులో నుంచి తీసి నిమజ్జనం చేస్తున్నారు. ఈ క్రేన్ ఆపరేటర్‌గా మహ్మద్ జమీల్ పనిచేస్తున్నాడు. మహాగణపతికి సేవ చేసే భాగ్యం లభించడం తనకెంతో సంతోషాన్నిస్తోందని ఆయన పేర్కొన్నాడు.
హెవీ మొబైల్ క్రేన్...
మహాగణపతి నిమజ్జనంలో భాగంగా గత 13ఏళ్లుగా రవిక్రేన్స్‌కు చెందిన హైడ్రాలిక్ టెలిస్కోప్ హెవీ మొబైల్ క్రేన్‌ను వినియోగిస్తున్నారు. జర్మనీకి చెందిన ఈ క్రేన్ బరువు 110 టన్నులు. 150 టన్నుల బరువును అవలీలగా పైకి లేపుతుంది. క్రేన్ జాక్ 50 మీటర్ల పైకి వెళ్తుంది. వెడల్పు 11 ఫీట్లు, పొడవు 60 ఫీట్లు ఉంటుంది. దీనికి 12 టైర్లు ఉంటాయి. ఒక్కో టైరు ఒక టన్ను బరువు 2 మీటర్ల ఎత్తు ఉంటుంది. దీనికి 4 హైడ్రాలిక్ జాక్‌లు ఉంటాయి. 40 టన్నుల బరువున్న ఖైరతాబాద్ వినాయకుడిని క్రేన్ అవలీలగా వాహనంలోకి ఎక్కిస్తుందని ఎండీ కేవీ రావు తెలిపారు.
ట్రాయిలర్ వాహనం...
గత ఏడేళ్లుగా మహాగణపతి శోభాయాత్రకు వినియోగిస్తున్న ట్రాయిలర్ వాహనం (ఏపీ16 టీడీ 4059) సామర్థ్యం 100 టన్నులు. 70 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు ఉండే ఈ వాహనానికి 26 టైర్లు ఉంటాయి. దాదాపు 40 టన్నుల బరువుండే మహాగణపతిని ఈ వాహనం నిమజ్జనానికి తరలిస్తుందని ఎస్‌టీసీ ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌చార్జి శరత్‌కుమార్ తెలిపారు.
దిశానిర్దేశం నాగరాజు...
శోభాయాత్ర ముందు నడుస్తూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన నాగరాజు డ్రైవర్‌కు దిశానిర్దేశం చేస్తాడు. ఇతని సూచనల మేరకు వాహనం ముందుకు సాగుతుంది. గత 15ఏళ్లుగా నాగరాజు సేవలందిస్తున్నాడు.
ఆ క్షణంలో శిల్పి ఉండరు...
35 ఏళ్లుగా ఖైరతాబాద్ మహాగణపతిని అద్భుతంగా తయారు చేస్తున్న శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ నిమజ్జన యాత్రలో పాలుపంచుకోరు. తాను తీర్చిదిద్దన అద్భుత రూపం సాగరంలో కరిగిపోయే ఆ క్షణాలను చూసి తట్టుకునే ధైర్యం లేకే నిమజ్జనానికి ఉండనని చెప్పారు రాజేంద్రన్.
Comments
Please login to add a commentAdd a comment