చట్టసభల్లో పోరాడతాం
గవర్నర్‌కు అధికారాలపై హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని శాంతిభద్రతలపై గవర్నరుకు అధికారాలను అప్పగించడంపై చట్టసభల్లోనూ, న్యాయస్థానాల్లోనూ పోరాటం చేస్తామని రాష్ట్ర సాగునీటి శాఖామంత్రి టి.హరీశ్‌రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గవర్నరుకు శాంతిభద్రతల అధికారాలు అప్పగించటం ద్వారా తెలంగాణపై ఆధిపత్యాన్ని కొనసాగించే కుట్రకు ఏపీ సీఎం చంద్రబాబు పాల్పడుతున్నాడని ఆరోపించారు. రెండు రాష్ట్రాలు ఏర్పాటైతే పదేళ్లు కాదు, పది రోజులు కూడా ఉండమంటూనే హైదరాబాద్‌ను గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. హైదరాబాద్‌లో ఎన్నో దేశాల ప్రజలు నివాసం ఉంటున్నారని, ఎవరికీ లేని భయాందోళనలు ఒక్క ఆంధ్రోళ్లకు ఎందుకని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటై నెలరోజులు దాటినా ఒక్క సీమాంధ్రునిపై అయినా దాడి జరిగిందా అని అడిగారు. గవర్నరుకు అధికారాలు కోరడం అక్రమ కార్యకలాపాలను కొనసాగించడానికా అని హరీశ్‌రావు అనుమానాన్ని వ్యక్తం చేశారు.
సచివాలయంలో బారికేడ్లు పెడితే భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్నట్టుగా ఎందుకంటూ చంద్రబాబు గగ్గోలు పెట్టి ఇప్పుడేమో ఆంధ్రా పోలీసులను హైదరాబాద్‌లో పెడ్తారా అని ప్రశ్నించారు. బారికేడ్లను వారు ఒప్పుకోకుంటే ఆంధ్రా పోలీసులు బందూకులు పట్టుకుని తిరుగుతామంటే ఎలా ఒప్పుకుంటామన్నారు. దేశంలో 28 రాష్ట్రాలు ఏర్పాటైనప్పుడు లేని షరతులు, విధానాలు ఒక్క తెలంగాణకే అమలు చేయటంపై టీటీడీపీ, టీబీజేపీ నాయకుల వైఖరిని ప్రశ్నించారు. అక్రమార్కులను రక్షించడానికి చంద్రబాబు చేస్తున్న కుట్రలను తిప్పికొడ్తామని హరీశ్‌రావు ప్రకటించారు.