సాక్షి, న్యూఢిల్లీ: గత రెండు రోజులుగా ఢిల్లీలో మకాంవేసి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం వద్ద మంత్రి హరీశ్‌రావు చేసిన మంత్రాంగం ఫలించింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, జలవనరుల శాఖ కార్యదర్శి అమర్జిత్‌సింగ్, సీడబ్ల్యూసీ ఉన్నతాధికారులతో సమావేశమైన హరీశ్‌రావు ప్రాజెక్టుకు సంబంధించి మరో రెండు కీలక అనుమతులను సాధించడంలో సఫలీకృతమయ్యారు.
ప్రాజెక్టుకు అవసరమైన కేంద్ర భూగర్భజల శాఖ నుంచి రావాల్సిన అనుమతులను, నిర్మాణ యంత్రాల కన్సల్టెన్సీ డైరెక్టొరేట్ నుంచి అవసరమైన రెండు కీలక అనుమతులను హరీశ్ సాధించగలిగారు. గతంలో ప్రాజెక్టుకు సంబంధించి హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర అనుమతి, స్టేజ్–1 అటవీ అనుమతులు, పర్యావరణ అనుమతులు లభించిన విషయం తెలిసిందే. ఇక కీలక అనుమతులు సాధించడానికి హరీశ్, ప్రాజెక్టు సీఈ హరిరాం, ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిలు మంగళవారం అమర్జిత్‌సింగ్‌తో, బుధవారం నితిన్ గడ్కరీతో, సీడబ్ల్యూసీ అధికారులతోనూ సమావేశమై చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టు పనుల పురోగతిని, పలు అనుమతుల మంజూరులో ఆలస్యం వల్ల పనుల్లో ఏర్పడుతున్న అవాంతరాలను హరీశ్‌రావు వివరించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని వివరించారు. అనుమతులు మంజూరు చేసేలా గడ్కరీని హరీశ్‌రావు ఒప్పించగలిగారు. కీలకమైన ఈ రెండు అనుమతులు మంజూరైన నేపథ్యంలో మిగిలిన అనుమతులు వీలైనంత త్వరలో మంజూరయ్యే అవకాశం ఉందని అధికారుల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment