సాక్షి, హైదరాబాద్: సత్వర సాగునీటి ప్రయోజన పథకం కింద రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులకు నిధుల విడుదలలో కేంద్రం జాప్యం చేస్తోందంటూ ఈ నెల 19న ‘మాటలు సరే..మూటలేవీ’ అంటూ ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై నీటిపారుదల మంత్రి టి.హరీశ్‌రావు స్పందించారు. దీనిపై సోమవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ స్పెషల్ సీఎస్ జోషి, కార్యదర్శి వికాస్‌రాజ్, ఈఎన్‌సీలు మురళీధర్‌రావు, నాగేంద్రరావు, అనిల్, సీఈలు భగవంతరావు, బంగారయ్య, కాడా కమిషనర్ మల్సూర్, ఓఎస్‌డీ శ్రీధర్ దేశ్‌పాండేలు హాజరయ్యారు.
ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై)లో చేర్చిన దేవాదుల, కుమురం భీం, రాజీవ్ భీమా, ఎస్సారెస్పీ స్టేజ్–2, ఇందిరమ్మ వరదనీటి కాల్వ, పాలెంవాగు, పెద్దవాగు, మత్తడివాగు, ర్యాలివాగు, గొల్లవాగు, నీల్వాయి ప్రాజెక్టుల పనుల పురోగతి తదితర పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టుల్లో మత్తడివాగు, నీల్వాయి, గొల్లవాగు, ర్యాలివాగు, పాలెంవాగు ప్రాజెక్టుల పనులు పూర్తయ్యాయని అధికారులు చెప్పారు.
మిగతా పనులకు సంబంధించి ఎస్సారెస్పీ కింద రూ.31 కోట్లు, రాజీవ్ భీమా కింద రూ.108 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని వివరించారు. దేవాదులకు రూ.470 కోట్లు, నీల్వాయికి రూ.67 లక్షలు, మత్తడి వాగు కోసం రూ.2.6 కోట్లు, జగన్నాథ్‌పూర్‌కు రూ.32 కోట్లు, గొల్లవాగుకు రూ.2 కోట్లు గతంలో కేంద్రం మంజూరు చేసిన నిధుల వ్యయానికి సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లను వెంటనే జారీ చేయాలని సంబంధిత సీఈలను మంత్రి ఆదేశించారు.
ప్రాజెక్టులను పూర్తిచేయటానికి అవసరమైన నిధులు వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరాలని, ఇందుకు మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీ అధ్యక్షతన జరగనున్న సమావేశంలో పాల్గొననున్నట్లు మంత్రి చెప్పారు. కేంద్రం నుంచి సకాలంలో నిధులు విడుదల చేయడంతో పాటు ప్రాజెక్టులకు అనుమతుల మంజూరు ప్రక్రియను సరళతరం చేయాలని, నాబార్డు నుంచి రుణాల విడుదలకు కేంద్రం చొరవ తీసుకోవాలని మంత్రి కేంద్రాన్ని కోరనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment