- తాజ్‌కృష్ణాలో ప్రారంభమైన సదస్సు
- 20 దేశాల నుంచి హాజరైన ప్రతినిధులు
- మరో రెండు రోజులపాటు కొనసాగనున్న ఎగ్జిబిషన్
సాక్షి, సిటీబ్యూరో: ఇండో గ్లోబల్ హెల్త్‌కేర్ సమ్మిట్ ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో భాగంగా పలు పరికరాలు, ఉత్పత్తులను ఎగ్జిబిట్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఫ్యాఫ్సీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఫార్మాసూటికల్స్ అసోసియేషన్, ఇండస్ ఫౌండేషన్, ఓమిక్స్ సంయుక్తాధ్వర్యంలో హోటల్ తాజ్‌కృష్ణలో ఏర్పాటు చేసిన ఈ సదస్సును తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి టి.తారకరామారావు శుక్రవారం ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాల నుంచి సుమారు రెండు వేలమంది ప్రతినిధులు హాజరయ్యారు.
మూడు రోజులపాటు జరుగనున్న ఈ సదస్సులో 60 మంది నిపుణులు, 200పైగా అంశాలపై చర్చించనున్నారు. వివిధ ఫార్మాసూటికల్ కంపెనీలకు చెందిన ఉత్పత్తులు, వైద్య పరికరాలను ఎగ్జిబిషన్‌లో ఉంచారు. ఇండస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సీడీ అర్హ, ఓమిక్స్ గ్రూప్ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ శ్రీనిబాబు గేదెల, ఇండస్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ అనుమోలు, ఫ్యాఫ్సీ అధ్యక్షుడు రూంగ్టా తదితరులు పాల్గొన్నారు.
జీవిత సాఫల్య పురస్కారాలు ప్రదానం..
వైద్య రంగంలో విశిష్ట సేవలందించిన పలువురు వైద్యులకు ఈ సందర్భంగా జీవిత సాఫల్య పురస్కారాలను అందజేశారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ వీఎం కతోచ్, నిమ్స్ మాజీ డెరైక్టర్ కాకర్ల సుబ్బారావు, ఈఎన్‌టీ సర్జన్ డాక్టర్ టీవీ కృష్ణారావు, ఐఎంఏ చైర్మన్ డాక్టర్ ఎన్.అప్పారావు, అపోలో హాస్పిటల్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ మాజీ డీన్ డాక్టర్ ఎం.హబీబ్, క్లినికల్ ల్యాబోరేటీస్ డెరైక్టర్ డాక్టర్ అనిల్‌కౌల్, డాక్టర్ ఇందిరాశర్మ, డాక్టర్ సంజయ్ పి.సింగ్, డాక్టర్ ముజఫర్ అహ్మద్, ప్రొఫెసర్ వి.విక్రమ్‌కుమార్‌లను మంత్రి కేటీఆర్ సత్కరించారు.