భర్త ఆరోగ్యం నయం కావడంలేదని బలవన్మరణం
- చేతి నరాలు, గొంతు కోసుకొని.. భవనంపై నుంచి దూకి మృతి
కాటేదాన్: భర్త రెండు కిడ్నాలు పాడవ్వడం.. లక్షలు అప్పుచేసి వైద్యం చేయించినా నయం కాకపోవడంతో మనోవేదనకు గురై ఓ గృహిణి బలవన్మరణానికి పాల్పడింది. చేతినరాలు, గొంతుకోసుని.. ఆపై దాబా నుంచి దూకి చనిపోయింది. ఈ హృదయ విదారకఘటన మైలార్‌దేవ్‌పల్లిలోని పద్మశాలీపురం బస్తీలో జరిగింది. ఎస్సై మహేంద్రనాథ్ కథనం ప్రకారం... పద్మశాలీపురం బస్తీకి చెందిన చేపూరి యాదగిరి, మీనా (33) దంపతులు. వీరికి పాప, బాబు సంతానం. యాదగిరి టైలర్.
మద్యం కారణంగా అనారోగ్యానికి గురైన యాదగిరిని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. కిడ్నీలు, కాలేయం పూర్తిగా దెబ్బతిన్నాయని వైద్యులు ధ్రువీకరించారు. నెలరోజులుగా ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటున్న యాదగిరి శనివారం రాత్రి ఇంటికి వచ్చాడు. ఆదివారం ఉదయం తిరిగి పొత్తికడుపులో నొప్పి రావడంతో మళ్లీ ఆస్పత్రికి తరలించారు.
పిల్లల్ని పాఠశాలకు పంపి...
లక్షలు అప్పు చేసి వైద్యం చేయించినా భర్తకు నయం కాకపోవడంతో మీనా కృంగిపోయింది. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. సోమవారం ఉదయం పిల్లల్ని పాఠశాలకు పంపిన తర్వాత బ్లేడ్‌తో రెండుచేతుల మణికట్లను, గొంతును కోసుకుంది. ఆ తర్వాత భవనం మొదటి అంతస్తు నుంచి కిందకు దూకింది. రక్తపుమడుగులో పడివున్న ఆమెను స్థానికులు ఉస్మానియాకు తరలించారు. అప్పటికే ఒంట్లోని రక్తమంతా పోవడంతో చికిత్స అందించేలోపే మీనా మృతి చెందింది.
భయాందోళనకు గురైన స్థానికులు...
పద్మశాలీపురం బస్తీలోని ప్రజలు ఉదయాన్నే జరిగిన ఈ ఘటనతో ఉలిక్కిపడ్డారు. ఘటనా స్థలంలో రక్తపుమడుగులో పడివున్న మీనాను చూసి భయాందోళనకు గురయ్యారు. ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు మొదట ఎవ్వరూ సాహసించలేదు. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న యాదగిరిని భార్య మృతదేహం చూసేందుకు బంధువులు అంబులెన్స్‌లో తీసుకొచ్చారు. భార్య మృతదేహాన్ని చూసిన ఆయన బోరుమన్నాడు. అనంతరం అతడిని ఆసుపత్రికి తిరిగి తీసుకెళ్లారు. తల్లి మృతి చెండం, తండ్రి ఆసుపత్రి పాలుకావడంతో వారి పిల్లలు దిక్కులేని వారిగా మారడం అందరినీ కలచివేసింది.