
సాక్షి,వైఎస్సార్‌జిల్లా : అభిమానానికి హద్దుండదు. ఆత్మీయతకు వయస్సుతో పనిలేదు. ఈ రెండింటికి సరైన చిరునామా వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. చిన్నారుల్లో జననేతకు ఉన్న క్రేజ్ చూస్తూనే ఉన్నాం. అది కుప్పం అయినా, విజయవాడ,గుంటూరు,పులివెందుల అయినా సరే. వైఎస్ జగన్‌పై ఉన్న అభిమానం, ఆప్యాయత మరోమారు నిరూపిమతమైంది.

బాలుడి పేరు మెహబూబ్ షరీష్. పులివెందులకు ఐదుకిలోమీటర్ల దూరంలో ఉన్న కొండారెడ్డి కాలనీలో నివాసం ఉంటాడు. అతనికి వైఎస్ జగన్ అంటే పిచ్చి. ఎలాగైనా ఈ రోజు తమ అభిమాన నేత వైఎస్ జగన్‌ను కలవాలని తెల్లవారు జామున ఐదుగంటలకు చెప్పుల్లేకుండా కాలి నడకన బయలుదేరాడు. వైఎస్ జగన్ హెలిఫ్యాడ్ వద్ద దిగుతారని తెలుసుకొని అక్కడే ఎదురు చూశాడు ఈ బాలుడు.

మధ్యాహ్నం 12గంటల సమయంలో వైఎస్ జగన్ పులివెందులకు చేరుకున్నారు. అక్కడికి వచ్చిన వైఎస్ జగన్‌ను ఎలాగైనా కలవాల్సిందేనని ప్రయత్నించాడు ఈ బాలుడు. ఎట్టకేలకు వైఎస్ జగన్‌ను చూడగానే బాలుడు ఆనంద భాష్పాలు రాల్చాడు. ఆ పిల్లాడిని గమనించిన వైఎస్ జగన్ దగ్గరకు తీసుకున్నారు. వైఎస్ జగన్ బాలుడి కళ్ల నీళ్లు తుడిచి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాలుడి అభిమానానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చలించిపోయారు. మొత్తానికి వైఎస్ జగన్‌తో బాలుడు ఫొటో దిగాడు. జాగ్రత్తగా ఆ బాలుడిని ఇంటి వద్ద దిగబెట్టాలని పార్టీ నేతలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు.

అభంశుభం తెలియని బాలుడే వైఎస్ జగన్‌పై చూపిన ప్రేమను నాటి వైఎస్సార్‌సీపీ పాలనకు సాక్షమని పరిశీలకులు అంటున్నారు. బాలుడికి కోరిక తీర్చి వైఎస్ జగన్ పెద్దమనసు చాటుకున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అలాగే, వైఎస్ జగన్ తన పాలనలో అమ్మఒడిని అమలు చేశారని, నాడు,నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చారని, అందుకే చిన్నారుల గుండెల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెరగని ముద్రవేసుకున్నారని వైఎస్సార్‌సీపీ అంటోంది.