సాక్షి, సిటీబ్యూరో: ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్‌లో ఎంతో కీలకంగా వ్యవహరించే వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు కరోనా వైరస్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కంటికి కన్పించని శత్రువుతో పోరాడుతున్న వారిలో వైద్య సిబ్బంది ముందుంటున్న విషయం తెలిసిందే. అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన బాధితులకు ఆరోగ్యాన్ని పంచాల్సిన వారే.. ప్రస్తుతం ఒకరి తర్వాత మరొకరు వైరస్ బారిన పడుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. 200 మంది వైద్య సిబ్బంది క్వారంటైన్‌లో ఉండగా.. వీరిలో 72 మంది వైద్యులు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా నిమ్స్, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, ఉస్మానియా, కొండాపూర్ ఏరియా ఆస్పత్రుల్లోని వైద్య సిబ్బంది ఎక్కువగా వైరస్ బారినపడటం గమనార్హం. వైద్యులతో పాటు పారా మెడికల్ సిబ్బంది వైరస్ బారిన పడుతుండటం, వారితో పాటు వారికి సన్నిహితంగా మెలిగిన వారు కూడా క్వారంటైన్‌లో ఉండాల్సి రావడంతో ఆయా ఆస్పత్రుల్లోవైద్య సేవలకు తీవ్ర విఘాతం ఏర్పడుతోంది. రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్య సిబ్బంది లేకపోవడంతో సకాలంలో వైద్య సేవలు అందక అనేక మంది రోగులు మృత్యువాత పడుతున్నారు. కేవలం ఒక్క ఉస్మానియాలోనే రోజుకు కనీసం 15 మంది చనిపోతున్నట్లు స్వయంగా ఆస్పత్రి వర్గాలే ప్రకటిస్తున్నాయి. కళ్లముందు రోగుల ప్రాణాలు పోతున్నా వైద్యులుగా తాము ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఉన్నట్లు కొంతమంది జూనియర్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏ కార్యాలయంలో ఎంత మందికి..
♦ పరిపాలనకు కేంద్ర బిందువైన సచివాలయంలోని వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న 11 మంది సిబ్బంది వైరస్ బారిన పడటంతో ఇప్పటికే ఆ విభాగాన్ని తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది.
♦ కరోనా హై లెవల్ కమిటీలోని కీలకమైన ఇద్దరు వైద్యులకు ఇటీవల వైరస్ సోకింది. దీంతో వారికి సన్నిహితంగా మెలిగిన ఐఏఎస్, ఇతర అధికారుల్లో ఆందోళన మొదలైంది.
♦ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయాల్లో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులకు వైరస్ సోకింది.
♦ ప్రతిష్టాత్మక నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్)లో మొత్తం 67 మంది వైరస్ బారిన పడ్డారు. వీరిలో 26 మంది వైద్యులు, 41 మంది పారామెడికల్ సిబ్బంది. దీంతో నెఫ్రాలజీ, కార్డియాలజీ, యూరాలజీ విభాగాల్లో సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. డయాలసిస్ సేవలను కూడా రెండు రోజుల క్రితమే పునరుద్ధరించారు.
♦ ఉస్మానియా వైద్య కళాశాలకు అనుబంధంగా పని చేస్తున్న స్పెషాలిటీ ఆస్పత్రుల్లో 64 మంది పీజీలు, సీనియర్ వైద్యులు వైరస్ బారిన పడ్డారు. వీరిలో ఒక్క పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలోనే 33 పాజిటివ్ కేసులు నమోదు కావడం విశేషం. వీరిలో ఒక అటెండర్ కూడా మృతి చెందారు.
♦ ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలోని ఆర్థోపెడిక్, డెర్మటాలజీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్ విభాగాల్లో పని చేస్తున్న సుమారు 20 మంది పీజీలు , నిలోఫర్‌లో నలుగురు పీజీలు, ఛాతీ ఆస్పత్రిలో ఇద్దరు సీనియర్లు, కింగ్‌కోఠి ఆస్పత్రిలో ఆరుగురు పారామెడికల్ సిబ్బంది కరోనా వైరస్ బారిన పడ్డారు.
♦ కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రి సూపరింటిండెంట్ సహా పలువురు వైద్య సిబ్బందికి పాజిటివ్ లక్షణలు బయటపడ్డాయి.
♦ కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో ముగ్గురు వైద్యులు సహా మరో ఎనిమిది మంది పారామెడికల్ సిబ్బందికి వైరస్ సోకింది.
♦ సరూర్‌నగర్ పీహెచ్‌సీ డాక్టర్ సహా పాతబస్తీలోని ఓ డాక్టర్‌తో పాటు నలుగురు ఏఎన్‌ఎంలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
♦ హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఐదుగురు ఉద్యోగులకు కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. వీరికి సన్నిహితంగా మెలిగిన జిల్లా అధికారి సహా ఇతర సీనియర్ వైద్యులు కూడా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment