సాక్షి, సిటీబ్యూరో: కరోనాతో కన్నుమూసిన వ్యక్తి అంత్యక్రియలు జరపాలంటే పలు ఇబ్బందులెదురవుతున్నాయి. నియమ నిబంధనల మేరకు పోలీసుల సమక్షంలో మాత్రమే అంత్యక్రియలు నిర్వహించాలి. మరణించాక ఆస్పత్రి నుంచి శ్మశాన వాటికకు తరలించేంత వరకు.. అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకు నిబంధనలు పక్కాగా అమలుచేయాలి. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ కార్యక్రమాలు నిర్వహించే పోలీసు, జీహెచ్‌ఎంసీ, వైద్యసిబ్బంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల బాధితులూ చికిత్సల కోసం ఇక్కడికే వస్తున్నారు. ఒకవేళ సదరు వ్యక్తి మరణిస్తే మృతదేహాన్ని స్వస్థలాలకు తీసుకువెళ్తున్న వారి సంఖ్య తక్కువే. కరోనా మృతుల సంఖ్య ఇప్పటికే దాదాపు రెండొందలకు చేరువలో ఉంది. కేసులు ఇంకా పెరుగుతాయనే హెచ్చరికలు వెలువడుతుండటం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో అంత్యక్రియలకు సంబంధించి అపోహలు వీడి.. స్థానికులు సహకరించకుంటే మరింత సమస్యాత్మకంగా మారే అవకాశముంది. మరోవైపు ఎవరికీ ఇబ్బంది తలెత్తకుండా కరోనా మృతుల అంత్యక్రియలకు ఒక ప్రత్యేక శ్మశానవాటిక ఉండటం అవసరమని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. నగర శివార్లలో అందుకు తగిన స్థలం కేటాయిస్తే ఆయా ప్రాంతాల్లోని స్థానికులకు, అంత్యక్రియలు నిర్వహించే ప్రభుత్వ యంంత్రాంగానికీ ఇబ్బందులు ఉండవంటున్నారు.
అయినవాళ్లూ దూరమే..
కరోనా మృతుల అంత్యక్రియలకు వచ్చేవారి సంగతేమో గాని.. ఆఖరి చూపులకూ రాని సంఘటనలెన్నో ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో మరణించిన వారిలోనూ దాదాపు 20 శాతం మృతదేహాలకు మాత్రమే అయినవాళ్ల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. మిగతా వాళ్లు, తమవల్ల కాదని మీరే నిర్వహించండని అధికార యంత్రాంగానికి విన్నవించినట్లు సమాచారం. దీంతో నగరంలో అందుబాటులో ఉన్న శ్మశానవాటికల్లో నిర్వహించేందుకు తీసుకువెళ్తే స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటీవల నగరంలోని కవాడిగూడ, అంబర్‌పేట, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లోని శ్మశానవాటికల్లో ఇదే పరిస్థితి ఎదురైంది. కరోనా మృతుల అంత్యక్రియల వల్ల పరిసరాల్లోని ప్రజలు వ్యాధుల బారిన పడతారనే ఆందోళనలు వ్యక్తం చేశారు.
ప్రభుత్వమే కేటాయించాలి..
ప్రజలు ప్రత్యేక శ్మశానవాటిక కోరుతున్నా.. అందుకు తగిన స్థలం అవసరమని, ప్రభుత్వం కేటాయించాలని ఒక అధికారి పేర్కొన్నారు. ప్రజల వ్యతిరేకత దృష్ట్యా నగర శివార్లలో అయితేనే ఇబ్బందులుండవని ప్రజాప్రతినిధి ఒకరు అభిప్రాయపడ్డారు. జీహెచ్‌ఎంసీ దాదాపు రూ. 2.40 కోట్లతో బన్సీలాల్‌పేట, అంబర్‌పేట, పంజగుట్ట, ఎస్సార్‌నగర్‌లలో విద్యుత్ దహన వాటికలు ఏర్పాటు చేసినా ప్రస్తుతం ఒక్కటి కూడా పనిచేయడం లేదు. వాటిలో కనీసం ఒక్కటి పనిచేసినా కరోనాతో మరణించిన వారి అంత్యక్రియల్లో ప్రభుత్వ యంత్రాంగానికి ఇబ్బందులు కొంత తప్పేవని ఆయన పేర్కొన్నారు.
అపోహ మాత్రమే
కరోనాతో ఎవరైనా మరణిస్తే, వారి సంబంధీకులకు సమాచారమిస్తాం. వారు ఏదైనా శ్మశానవాటికను ఎంపిక చేసుకుంటే, అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక సంబంధిత సిబ్బంది, ప్రత్యేక వాహనంలో అక్కడకు తరలిస్తారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు, తగిన భద్రత కోసం పోలీసులు కూడా ఉంటారు. చాలా ప్రాంతాల్లో తగిన అవగాహన లేక స్థానికులు సిబ్బందిని కొట్టడానికి వస్తున్నారు. మరణించాక సంబంధీకులకు సమాచారమిచ్చేందుకు కూడా పది ఇరవై సార్లు ఫోన్లు చేయాల్సి వస్తోంది. వెంటనే స్పందించేవారు తక్కువ. వర్షాకాలంలో దహన సంస్కారాలకు కట్టెలు దొరకడం కష్టం. ఒక్కో మృతదేహానికి దాదాపు 25 లీటర్ల డీజిల్ అవసరమవుతుంది. ప్రస్తుతం 14 వాహనాలు, సిబ్బందిని ఈ విధులకు వినియోగిస్తున్నారు. ఎక్కడ దహన సంస్కారాలు చేసినా, పరిసరాల్లో వ్యాధులు వస్తాయనుకోవడం అపోహ. ప్రత్యేక పద్ధతుల్లో నిర్వహించడం వల్ల వంద మీటర్ల దూరం వరకు ఎలాంటి క్రిమికీటకాలున్నా నశిస్తాయి. ఆ తర్వాత క్రిమిసంహారక స్ప్రే కూడా చేస్తారు. ప్రజలకు ఈ విషయంలో అవగాహన వస్తే తప్ప యంత్రాంగానికి ఇబ్బందులు తప్పవు.– డాక్టర్ రవీందర్‌గౌడ్, ఏఎంఓహెచ్ (కోవిడ్–19 సంబంధిత అధికారి)
Comments
Please login to add a commentAdd a comment