కోతలుండవు కానీ..మోత తప్పదు..
భారీగా పెరగనున్న కరెంటు చార్జీలు
2018-19 నాటికి డిస్కంల నష్టాలు రూ.29,398 కోట్లు
నష్టాలను అధిగమించేందుకు కరెంటు చార్జీలు 13 శాతం మేర పెంచక తప్పదు
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల నష్టాలు 2014-15 సంవత్సరం ముగిసే నాటికి రూ.13,867 కోట్లకు పేరుకుపోయాయి. విద్యుత్ కొనుగోలు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కరెంటు చార్జీల పెంపుదల లేకపోతే 2018-19 చివరి లోగా నష్టాలు రూ.29,398 కోట్లకు ఎగబాకనున్నాయి. ఒక్క 2018-19లోనే రూ.5,082 కోట్ల నష్టాలను డిస్కంలు మూటగట్టుకోనున్నాయి. కేవలం ఆ ఒక్క ఏడాది నష్టాలను అధిగమించేందుకు ఏకంగా 13 శాతం విద్యుత్ చార్జీలు పెంచాల్సి రావొచ్చు. ఏటేటా పేరుకుపోతున్న నష్టాలను అధిగమించేందుకు భవిష్యత్తులో భారీగా విద్యుత్ చార్జీలను పెంచుకోక తప్పదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
‘24ఁ7 పవర్ ఫర్ ఆల్’పథకం కింద 2018-19లోగా రాష్ట్రంలో అందరికీ నిరంతర విద్యుత్ సరఫరా సదుపాయం కల్పించేందుకు ఈ నెల 11న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. రాష్ట్ర విద్యుత్ రంగ వాస్తవ స్థితిని తెలిపే సమగ్ర సమాచారంతోపాటు విశ్లేషణలు, భవిష్యత్ కార్యాచరణ వివరాలను ఈ ఒప్పంద పత్రంలో పొందుపరిచారు. ఈ పత్రాన్ని ‘సాక్షి’ సంపాదించింది. అందులోని ముఖ్యాంశాలపై ఈ వారం ఫోకస్..
- సాక్షి, హైదరాబాద్
చార్జీల మోత తప్పదా?
ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా డిస్కంల భవిష్యత్ ఆర్థిక పరిస్థితిపై నాలుగు సందర్భాల్లో ప్రభుత్వం విశ్లేషణ చేసింది. 2018-19 నాటికి డిస్కంల నష్టాలు ఏ మేరకు పేరుకుపోనున్నాయి? 2018-19లో ఉత్పన్నమయ్యే నష్టాలను అధిగమించేందుకు సగటున ఎంత శాతం టారిఫ్ పెంచాల్సి ఉంటుందన్న ప్రశ్నలకు ఇందులో సమాధానాలున్నాయి. పెరుగుతున్న విద్యుత్ కొనుగోలు ధరలు, విద్యుత్ చార్జీల్లో పెంపు లేకుండా ‘ప్రస్తుత స్థితి’ యథాతథంగా కొనసాగితే పరిస్థితి ఎలా ఉండనుంది? అలాగే కేంద్రం నుంచి నిధులు రాకుంటే ఎలా ఉంటుంది? సాంకేతిక వాణిజ్య నష్టాల మొత్తం(ఏటీ సీ లాస్) ఒక శాతం పెరిగితే ఏం జరుగ నుంది? డిస్కంల నష్టాలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తే ఎంత ఉపశమనం కలగనుంది? ఈ నాలుగు సందర్భాల్లో విద్యుత్ చార్జీలను ఏ మేరకు పెంచాల్సి ఉంటుందో ఈ కింది పట్టికలో చూడవచ్చు.
7.6 లక్షల ఇళ్లకు కరెంటు లేదు
విద్యుత్ సౌకర్యం లేని ఇళ్లకు 2017-18లోగా విద్యుదీకరణ చేసేం దుకు కార్యాచరణ రూపొందించారు. 2015 మార్చి 31 నాటికి రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో 44,532 ఇళ్లు, గ్రామీణ ప్రాంతా ల్లో 7,21,588 ఇళ్లకు విద్యుత్ సౌకర్యం లేదు. పవర్ ఫర్ ఆల్ కింద 2017-18లోగా వీటికి విద్యుత్ సదుపాయం కల్పించనున్నారు. ఉత్తర డిస్కం పరిధిలో 44,532 పట్టణ గృహాలు, 3,20,020 గ్రామీణ గృహాలు, దక్షిణ డిస్కం పరిధిలో 4,01,568 గ్రామీణ గృహాలకు విద్యుదీకరణ జరపాల్సి ఉంది.
వ్యవసాయ విద్యుత్‌కు మీటర్లు
ప్రభుత్వ విధానానికి అనుగుణంగా రాయితీ(ఉచిత విద్యుత్)కి అర్హులైన చిన్న, సన్నకారు రైతులను గుర్తించేందుకు మళ్లీ సర్వే నిర్వహించాలని ఒప్పందంలో పేర్కొన్నారు. నష్టాలు, రాయితీల భారాన్ని తగ్గించుకునేందుకు మూడంచెల్లో వ్యవసాయ విద్యుత్‌కు మీటరింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి. దీంతో నష్టాల నుంచి వ్యవసాయ విద్యుత్‌ను వేరు చేసి వాస్తవిక నష్టాలను తెలుసుకోడానికి వీలు కలుగనుంది. కెపాసిటర్లు, ఐఎస్‌ఐ మార్కు పంపుసెట్లను తప్పనిసరి చేయనున్నారు.
ఒప్పందం ప్రకారం ఈ మేరకు చర్చలు చేపట్టాలి..
► స్వల్పకాలిక చర్యగా వ్యవసాయ, ఇతర వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసే మదర్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లకు తక్షణమే మీటర్లను బిగించాలి.
► మధ్యకాలిక చర్యగా అన్ని వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లకు మీటర్లు ఏర్పాటు చేయాలి
► దీర్ఘకాలిక చర్యగా వ్యవసాయ వినియోగదారులందరికీ మీటర్లు బిగించాలి
తలసరి వినియోగం ఎక్కువే
జాతీయ తలసరి విద్యుత్ వినియోగంతో పోల్చితే రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం అధికంగా ఉంది. 2014-15లో రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 1,394 యూనిట్లు కాగా దేశంలో సగటు వినియోగం 1,010 యూనిట్లు మాత్రమే.
కేంద్రం నుంచి 75 శాతం నిధులు
రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు సమగ్ర విద్యుత్ అభివృద్ధి పథకం(ఐపీడీఎస్), దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన(డీడీయూజీవై) పథకాల కింద రూ.9,973 కోట్లతో రానున్న మూడేళ్లలో పనులు పూర్తి చేయనున్నారు. అందరికీ విద్యుత్ పథకంలో రాష్ట్రం చేరినందుకు కేంద్ర ప్రభుత్వం ఈ రెండు పథకాల కింద 75 శాతం వాటా భరించనుంది. అంటే రూ.7,480 కోట్లు అందిస్తుంది.