అక్రమాల లెవీ
- పైరవీకారులకు ధాన్యం కేటాయింపులు
- సీఎంఆర్ ప్రక్రియలో జోరుగా అక్రమాలు
- బియ్యం ఇచ్చే విషయంలో జాప్యం
- 38 శాతమే బియ్యం ఇచ్చిన రైస్ మిల్లర్లు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చే(సీఎంఆర్) ప్రక్రియలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయి. రైస్ మిల్లర్లకు ధాన్యాన్ని కేటాయించే విషయంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మిల్లుల సామర్థ్యాన్ని పరిగలోకి తీసుకోకుండా.. తమకు నచ్చిన వారికే ధాన్యాన్ని కేటాయిస్తున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులను ప్రసన్నం చేసుకున్న వారికి ఎక్కువగా ధాన్యం దక్కుతుంది.
రైస్ మిల్లర్ల సంఘం ముఖ్య నాయకులు సీఎంఆర్ బియ్యం లెవీ అక్రమాల్లో పాత్ర ధారులు అవుతున్నారు. అధికారుల వద్ద పైరవీలు చేసిన సంఘం నాయకుల మిల్లులకే ఎక్కువ ధాన్యం చేరుతోంది. రైస్ మిల్లర్ల నుంచి గడువులోపు బియ్యాన్ని ప్ర భుత్వానికి అప్పజెప్పేలా చూడాల్సిన మి ల్లర్ల సంఘం ముఖ్యులు.. ఈ విషయంలో అక్రమార్కులకే సహకరిస్తున్నారు. ఇలా అధికారులు, రైస్ మిల్లర్ల సంఘం ము ఖ్యలు కలిసి తమకు నచ్చిన వారికి ధాన్యం కేటాయింపుల ప్రక్రియను నిర్వహిస్తున్నా రు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన బి య్యాన్ని కొందరు మిల్లర్లు బహిరంగ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారు. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యాన్ని స్వాహా చేస్తున్నారు.
బియ్యం ఇవ్వడంలో జాప్యం
రైతులకు కనీస మద్దతు ధర కల్పిం చేందుకు ప్రభుత్వ సంస్థలు ధాన్యం కొనుగోలు చేయడం దశాబ్దకాలంగా జరుగుతోంది. 2014-15 లెవీ మార్కెటింగ్ సీజ ను గత ఏడాది అక్టోబరు 1న మొదలైంది. ఈ ఏడాది సెప్టెంబరు 30తో ముగియనుంది. గత ఖరీఫ్, రబీల్లో ఉత్పత్తి అయిన ధాన్యంలో 83,642 టన్నులను ప్రభుత్వం సేకరించింది. మార్కెటింగ్ సీజనులో ఇందిరా క్రాంతిపథం(ఐకేపీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతుల నుంచి ప్రభుత్వం ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసింది.
ఈ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యంగా మార్చేందుకు జిల్లాలోని 72 మంది మిల్లర్లకు అధికారులు కేటాయించారు. 83,642 ధాన్యం మిల్లింగ్ చేయడంతో 56,876 టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతాయి. ఈ బియ్యాన్ని మిల్లర్లు సెప్టెంబరు 30లోపు భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ), పౌర సరఫరాల సంస్థకు ఇవ్వాల్సి ఉంటుంది. ధాన్యాన్ని తీసుకున్న మిల్లర్లు వెంటనే బియ్యంగా మార్చి ఇచ్చే విషయంలో తాత్సారం చేస్తున్నారు. చాలా మిల్లులో ధాన్యం లేని పరిస్థితి ఉంది.
కొందరు అధికారులు ఈ విషయాన్ని గుర్తించినా చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా సెప్టెంబరు 30లోపు ప్రభుత్వం సంస్థలకు మిల్లర్లు బియ్యం ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మిల్లర్లు ప్రభుత్వ సంస్థలకు ఇవ్వాల్సిన బియ్యంలో ఇప్పటికి 22,064 టన్నులనే ఇచ్చారు. మిగిలిన 34,802 టన్నుల బియ్యం ఎప్పటికి వస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. బియ్యం సేకరణకు క్షేత్రస్థాయి అధికారులను సమాయత్తం చేయాల్సిన ఉన్నతాధికారులు ఈ పని చేయడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.