వర్షార్పణం
అల్పపీడన ద్రోణి ప్రభావంతో శనివారంనుంచి ఆదివారం ఉదయం వరకు జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. జిల్లాలో సగటు వర్షపాతం 43.3మి.మీ నమోదైంది. రికార్డుస్థాయిలో దామరచర్ల మండలంలో 158.2 మి.మీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో చేతికొచ్చిన వరి పొలాలు నేలవాలాయి. పత్తి తడిసిపోయింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి.
నీలగిరి : అరేబియా సముద్రంలో సంభంవించిన వాయుగుండం ప్రభావంతో జిల్లాలో భారీ వర్షం కురిసింది. దీంతో అనేక చోట్ల చేతికొచ్చిన పంట పొలాలు నేలకొరిగాయి. పలు చోట్ల పత్తి తడిసిపోవడంతో అపార నష్టం వాటిల్లింది. వందలాది ఎకరాల్లో పంటలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైన దామరచర్ల మండలంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక వ్యవసాయ మార్కెట్లలో నిల్వ ఉంచిన ధాన్యం తడిసిముద్దయ్యింది. మార్కె ట్లలో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో అధికారులు పూర్తి నిర్లక్ష్యం వహించారు.
మార్కెట్లలో సకాలంలో ధాన్యం కొనుగోళ్లు జరపకపోవడంతో వర్షం ధాటికి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. తడిసిన ధాన్యాన్ని తరుగు పేరుతో కోత పెట్టి కొనుగోలు చేస్తున్నారు. హాలియా వాగు, పేరూరు సోమసముద్రం చెరువు, రాజవరం, తిరుమలగిరి చెరువు వెంట 50 ఎకరాల్లో వరిచేలు నీటమునిగాయి. నిడమనూరు మండలం తుమ్మడం, కుంటిగోర్ల గూడెం, వల్లభాపురం, బాలాపురం, రాజన్నగూడెం, నిడమనూరు గ్రామాల్లో చిలుకలవాగు వెంట 100 ఎకరాలు నీటిముగింది. పెద్దవూర మండలంలో పెద్దవాగు ఉప్పొంగి ప్రవ హిస్తోంది. పేరూరు సోమసముద్రం చెరువునీరు రోడ్డుపై ప్రవహించడంతో హాలియా- పేరూరు గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
హుజూర్‌నగర్ మండలంలో లింగగిరి- సర్వారం మధ్య బండలరేవు వాగు, శ్రీనివాసపురం- అమరవరం మధ్య పిల్లవాగు, బూరుగడ్డ- గోపాలపురం మధ్య నల్లచెరువు అలుగు పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. లింగగిరి చిన్న చెరువు అలుగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సుమారు 70 ఎకరాలలో వరి నీట మునిగింది. గరిడేపల్లి , నేరేడుచర్ల మండలాల్లో సుమారు 14 వందల ఎకరాల్లో వరిచేలు నేలకొరిగాయి. మఠంపల్లి మండలంలోని చౌటపల్లి సమీపంలో గల ఈదులవాగు పొంగిప్రవహించడంతో 50 హెక్టార్లలో వరిచేలు నీటి మునిగాయి. మేళ్లచెర్వు మండలంలో పత్తి పంటకు అపార నష్టం వాటిల్లింది.
మిర్యాలగూడ మండలంలో ఐలాపురం, కిష్టాపురం గ్రామాలలో వంద ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. దామరచర్ల మండలంలోని వీరభద్రాపురంలో ఇళ్లలోకి నీరు చేరింది. దాంతో పాటు దామరచర్ల - అడవిదేవుపల్లి గ్రామాల మధ్య అన్నమేరు వాగుపొంగడం, దామరచర్ల - జాన్‌పహాడ్ మధ్య బుగ్గవాగు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అదే విధం గా సుమారు 100 ఎకరాల్లో పత్తి, 30 ఎకరాల వరి నీట మునిగింది. మరో 30 ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది.
రామన్నపేట మండలంలో 10వేల ఎకరాల్లో పత్తికి నష్టం వాటిల్లింది. కట్టంగూరు మండలంలో కురుమర్తిలోని ఐకేిపీ కేంద్రంలో 50 బస్తాల ధాన్యం తడిసిముద్దయింది.నల్లగొండ మార్కెట్‌యార్డులో వర్షపు నీరు నిలిచి 6 వేల క్వింటాళ్ల ధాన్యం తడిసి ంది. తడిసిన ధాన్యాన్ని ఆదివారం కొనుగోలు చేశారు.తడిసిన ధాన్యం కొనుగోలు చేయడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. క్వింటాకు బస్తాతో కలిపి 9 కిలోల తరుగు తీస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటాకు రూ. 1250 మాత్రమే చెల్లిస్తున్నారు. మునుగోడు, చండూరు మండలాల్లో కూడా పంటలకు నష్టంవాటిల్లింది.
చౌటుప్పుల్ మార్కెట్ యార్డులో 45 కుప్పలు, నల్లగొండ మార్కెట్ యార్డులో 35 కుప్పలు, భువనగిరి మార్కె ట్‌యార్డులో 20 కుప్పలు, రామన్నపేటలో 60 కుప్పలు నిల్వ ఉన్నాయి. ఐకేపీ కేంద్రాల్లో కూడా ధాన్యం నిల్వలు ఉన్నాయి. వర్షం కారణంగా ధాన్యం రంగు మారే అవ కాశం ఉంది. దీంతో ధాన్యం రంగు మారిందన్న సాకుతో కొనుగోలు చేసేందుకు మిల్లర్లు నిరాకరించడమేగాక, కొ నుగోలు కేంద్రాలలో కూడా రైతుల నుంచి ధాన్యం కొనేందుకు ఒప్పుకునే పరిస్థితులు కనిపించడం లేదు.